Kandi Podi: కంది పొడిని ఇలా మూడు పప్పులతో చేశారంటే అదిరిపోతుంది, ఇడ్లీతో, అన్నంతో అదిరిపోతుంది
Kandi Podi: ఎన్ని కూరలు ఉన్నా ఒక ముద్ద కందిపొడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. వేడివేడి అన్నంలో కందిపూడి, నెయ్యి వేసుకుని తిని చూడండి. రుచి అదిరిపోతుంది. కందిపొడి టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాం.
Kandi Podi: తెలుగింటి సాంప్రదాయ పొడి... కందిపొడి. దీన్ని చేయడం చాలా సులువు. భోజనాన్ని మొదలుపెట్టేముందు ఒక ముద్ద కందిపొడి, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే రుచి మాములుగా ఉండదు. కంది పొడిని కావాలనుకుంటే స్పైసీగా చేసుకోవచ్చు. ఎండుమిర్చి తగ్గించుకుంటే కారం ఉండదు. కాబట్టి కారం ఎక్కువగా తినే వారు ఒకలా, కారం తక్కువగా తినేవారు మరొకలా దీన్ని చేసుకోవచ్చు. కందిపొడిని ఎప్పుడూ ఒకేలా చేసే కన్నా మూడు పప్పులు కలిపి చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.
కంది పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు - అరకప్పు
పెసరపప్పు - అర కప్పు
మినపప్పు - పావు కప్పు
శనగపప్పు - అర కప్పు
ఎండు మిరపకాయలు - 20
జీలకర్ర - రెండు స్పూన్లు
ఇంగువ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కంది పొడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి మొదటగా కంది పప్పును వేసి వేయించుకోవాలి.
2. వేయించిన కంది పొడిని మిక్సీ జార్లో వేయాలి. తరువాత పెసరపప్పును వేసి వేయించుకోవాలి.
3. దాన్ని కూడా మిక్సీ జార్ లో వేయాలి. తరువాత వరుసగా శెనగపప్పు, మినప్పప్పును వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని వేసి కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి.
5. వాటిని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఆ జీలకర్రను కూడా మిక్సీ జార్ లో వేయాలి.
7. మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ కూడా వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. అంతే కందిపొడి రెడీ అయినట్టే.
8. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేస్తే మూడు నెలల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.
9. అన్నం తినే మందు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ కందిపొడి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు.
10. అలాగే ఇడ్లీల్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి ఇడ్లీ పై కందిపొడిని చల్లుకొని, అర స్పూన్ నెయ్యిని వేసి ఆ ఇడ్లీలు తిని చూడండి. రుచి అదిరిపోతుంది. దోశెలు వేసేటప్పుడు కూడా ఈ కందిపొడిని చల్లి కాస్త నూనె వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
కంది పొడి రెసిపీలో మనం వాడిన అన్ని పప్పుల్లోనూ ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మన శరీరానికి అవసరమైనవి. అలాగే జింక్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్లు, ఖనిజాలు... వీటిల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి కందిపొడిని తినడం వల్ల ఆరోగ్యమే, కానీ ఎలాంటి అనారోగ్యం ఉండదు. ముఖ్యంగా దీని తయారీలో మనం నూనెను అధికంగా వినియోగించలేదు. కాబట్టి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం తక్కువే.
ప్రతిరోజూ ఒక స్పూను నెయ్యి తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కందిపొడిని ఇలా చేసి ఇంట్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు చట్నీ లేకపోయినా... అన్నం తినేందుకు, ఇడ్లీ, దోశలు తినేందుకు సులువుగా ఉంటుంది. ఒకసారి ఈ కందిపూడి రెసిపీని ప్రయత్నించండి. పిల్లలకు, పెద్దలకు ఇది నచ్చడం ఖాయం.
టాపిక్