జీవిత భాగస్వాముల మధ్య శృంగారం ముఖ్యమైన అంశం. ఇద్దరి మధ్య శారీరక సంబంధం బలంగా ఉండాలి. పడక గదిలో సుఖాన్ని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. రోజంతా కష్టపడ్డాక కొందరు జంటలు లైంగికంగా కలుస్తారు. శృంగారం వల్ల శరీరం, మెదడు రెండూ రిలాక్స్ అవుతాయి. అయితే, కలయిక తర్వాత కొందరు ముద్దులు, కౌగిలింతలతో రొమాన్స్ కొనసాగిస్తే.. మరికొందరు మాత్రం బాగా అలసిపోతారు. ఇంకొందరు నిద్రపోతారు. మరి శృంగారం తర్వాత అలసట సాధారణమేనా.. ఏదైనా సమస్య ఉంటుందా అని చాలా మంది మదన పడుతుంటారు.
కలయిక తర్వాత అలసట రావడం సాధారణమైన విషయమే. ఇది సమస్య కాదని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చాయి. శృంగారం తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గడం మామూలేనని పేర్కొన్నాయి. కలయిక తర్వాత మహిళల కంటే పురుషులే ఎక్కువగా అలసిపోయినట్టుగా ఫీలవుతారు. అయితే, కలయిక తర్వాత అలసటకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
లైంగిక చర్యలో కలయిక వల్ల ఆక్సిటోసిన్ హర్మోన్ అధికం అవుతుంది. శృంగారం సమయంలో ఆక్సిటోసిన్, ప్రోలక్టిన్ అనే రెండు హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. వీటివల్ల శరీరం రిలాక్స్ అయి.. నిద్రవచ్చినట్టుగా అనిపిస్తుంది. అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్‍లో ఒడిదొడుకుల వల్ల కూడా ఎనర్జీపై ప్రభావం పడుతుంది.
శృంగారం కూడా ఒకరమైన వ్యాయామంగా పరిగణిస్తారు. ఫోర్‌ఫ్లేతో కలిపి సగటున 20 నిమిషాల పాటు చేస్తే సుమారు 60 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఒకవేళ ఎక్కువసేపు లైంగిక చర్యలో ఉంటే శరీరం అలసిపోవడం సాధారణమే. ఇది కూడా వ్యాయామం తర్వాత అలసిపోయినట్టే.
నిద్రలేమి వల్ల కూడా కలయిక తర్వాత వెంటనే అలసట వస్తుంది. ఒకవేళ మీకు సరైన నిద్ర లేక ఏదైనా శారీరక శ్రమ చేస్తే వెంటనే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. శృంగారం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అందుకే శృంగారం తర్వాత త్వరగా అలసిపోతే నిద్రలేమి కూడా ఓ కారణంగా ఉంటుంది.
శృంగారం తర్వాత మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం దక్కినట్టుగా అనిపిస్తుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. కండరాల నుంచి కూడా ఒత్తిడి పోతుంది. ఇలా శృంగారం తర్వాత శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం దక్కడంతో రిలాక్స్ అయి కొందరు అలసినట్టుగా విశ్రాంతి తీసుకుంటారు.
శృంగారానికి చాలా గంటల ముందు వరకు నీరు, ఆహారం తీసుకుకోపోతే కూడా అలసట ఎదురవుతుంది. కలయిక తర్వాత అలసటగా అనిపిస్తుంది. అలాగే, శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది
శృంగారం తర్వాత కొన్ని గంటలు, కొన్ని రోజుల పాటు నీరసంగా ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి. కలయిక తర్వాత అలసట సాధారణమే అయినా.. తీవ్రమైన నీరసం, నొప్పులు, శ్వాస ఇబ్బందులు, తలనొప్పి లాంటివి ఉంటే మాత్రం జాగ్రత్తలు పాటించాలి. నిపుణుల సూచనలు పాటించాలి.