Electricity Bill Saving: మీ కరెంటు బిల్లులో 30శాతంపైగా తగ్గాలంటే ఇలా చేయండి.. తప్పకుండా బిల్లు తగ్గుతుంది…!-if you want to reduce your electricity bill by more than 30 percent do this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Electricity Bill Saving: మీ కరెంటు బిల్లులో 30శాతంపైగా తగ్గాలంటే ఇలా చేయండి.. తప్పకుండా బిల్లు తగ్గుతుంది…!

Electricity Bill Saving: మీ కరెంటు బిల్లులో 30శాతంపైగా తగ్గాలంటే ఇలా చేయండి.. తప్పకుండా బిల్లు తగ్గుతుంది…!

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 12, 2024 02:22 PM IST

Electricity Bill Saving: ధనిక,పేద తేడా లేకుండా ఇప్పుడు అందరికి కరెంటు బిల్లుల మోత తప్పడం లేదు. విద్యుత్‌ ఛార్జీలతో పాటు సర్దుబాటు ఛార్జీల భారం, గతంలో వాడిన దానికి కూడా ప్రస్తుత బిల్లుల్లో అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్త విద్యుత్ బిల్లుల్ని గణనీయంగా ఆదా చేసుకోవచ్చు.

విద్యుత్‌ బిల్లుల్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..
విద్యుత్‌ బిల్లుల్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..

Electricity Bill Saving: విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్లే విద్యుత్ బిల్లుల భారం అధికంగా ఉంటుంది. ఈ భారాన్ని చిన్పాటిన చిట్కాలు పాటించి ఇంట్లో విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

విద్యుత్ ఆదా చేయాలంటే ఇలా చేయండి..

1.పాత కాలం బల్బుల స్థానంలో విద్యుత్‌ ఆదా చేసే కాంపాక్ట్ ఫ్లోర్ సెంట్ లాంప్ (సిఎఫ్ఎల్), ఎల్‌ఇడి, టి5,టి 8 ట్యూబులైట్లను వాడాలి. సాధారణ అరవై వాట్ల ఫిలమెంట్‌ బల్బు ఎంత కాంతి ఇస్తుందో 15 వాట్ల సి.ఎఫ్.ఎల్. కూడా అంతే కాంతినిస్తుంది. ఇప్పుడు 9వాట్లలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. సాధారణ బల్బు వాడే విద్యుత్‌లో నాలుగో వంతు మాత్రమే సి.ఎఫ్.ఎల్ బల్బు వినియోగిస్తుంది.వీటిని వాడటం వలన ఇళ్లలో కాంతి కోసం మనం చెల్లించే బిల్లులో కనీసం సగం ఆదా అవుతుంది.

సాధారణ బల్బు వినియోగించుకునే విద్యుత్లో 90 శాతం బల్బులో ఫిలమెంట్‌ వేడెక్కడానికే సరిపోతుంది.అందులో పది శాతమే కాంతికోసం వినియోగం అవుతుంది.ఈ వృథాని సి.ఎఫ్.ఎల్ తో అరికట్టవచ్చు.సిఎఫ్ఎల్ కంటే ఎల్‌ఇడి బల్బులు విద్యుచ్ఛక్తిని ఎక్కువ ఆదా చేస్తాయి. వీటి ధర గతంలో ఎక్కువగా ఉండేది.ఇప్పుడు సాధారణ ట్యూబ్‌లైట్ల ధరలకే ఎల్‌ఇడి లైట్లు లభిస్తున్నాయి.

2. లైట్లపై దుమ్ము పేరుకుపోతే కాంతి సరిగా రాదు. కాబట్టి అప్పుడప్పుడు లైట్లపై దుమ్మును పొడిబట్టతో తుడిచేయాలి.

3. పాతకాలం కాపర్ చోక్‌ బల్బులకు కాలం చెల్లింది. వాటి స్థానంలో తప్పనిసరైతే ఎలక్ట్రానిక్ చోక్ బల్బులు, ఎలక్ట్రానిక్ రెగ్యురేటర్లను వాడాలి.

4. గది మొత్తం కాంతినిచ్చే ట్యూబులైట్లను వాడటానికి బదులు మనం గదిలో వాడుకునే ప్రదేశంలోనే కాంతిపడేలా సీలింగ్‌లో పలు ప్రదేశాలలో లైట్లను అమర్చుకోవడం ఉత్తమం. పడుకునే చోట, చదువుకునే చోట, పనిచేసే చోట మాత్రమే కాంతి పడేలా సీలింగ్‌ లైటను ఏర్పాటు చేసుకోవచ్చు. గదిలో కూర్చుని మాట్లాడుకునేటపుడు ఎక్కువ కాంతి అవసరం ఉండదు. స్నానాల గదిలో గడ్డం చేసుకునే అద్దం దగ్గర మంచి లైటు అవసరం అవుతుంది. కానీ స్నానానికి ఎక్కువ కాంతి అవసరం ఉండదు.

కంప్యూటర్ వాడేటపుడు కంప్యూటర్ కీబోర్డ్ మీద కాంతి బాగా పడేలా సీలింగ్‌ లైట్ అమర్చుకొంటే సరిపోతుంది. గది మొత్తం కాంతి పడేలా ట్యూబైట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ కాంతి అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే లైట్లను వెలిగించే అలవాటు చేసుకుంటే దానంతట అదే విద్యుత్ వినియోగం తగ్గిపోతుంది.

5. ప్రస్తుతం మనుషుల కదలికలకు అనుగుణంగా వెలిగే సెన్సార్ లైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి కదలికలు లేకపోతే లైట్లు వాటంతట అవే ఆగిపోతాయి. లైట్లు వేయడానికి, ఆర్పివేయడానికి మన ప్రమేయం అక్కరలేకుండా ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లు, మోషన్ సెన్సర్లు, ఆటోమేటిక్ టైమర్స్, డిమ్మర్స్ మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటితో విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

రిఫ్రిజిరేటర్

1. 'ఫ్రిజ్ డోర్ తరచుగా తెరవకూడదు' అనేది అందరికీ తెలిసిన విషయమే.కాకపోతే తప్పనిసరిగా దానిని పాటించాలి. డోర్ తెరిచే ముందే ఏంకావాలో స్పష్టం చేసుకోకుండా ఫ్రిజ్ తెరిచిన తర్వాత ఎందుకు తెరిచారా అనుకోకూడదు. ఎక్కువ సేపు డోర్ తీసి ఉంచితే విద్యుత్ వినియోగం అవుతుంది.

2. ఫ్రిజ్‌లోకి గాలి చొరబడనంత 'టైట్'గా ఫ్రిజ్ డోర్ ఉండాలి. ఇది తెలియాలంటే ఫ్రిజ్ వద్ద కాగితం పెట్టి డోర్ వేయాలి.కాగితం అలాగే నిలబడితే 'సీల్' బాగున్నట్లు, కాగితం గాలికి ఊగితే ఫ్రిజ్‌లో చల్లటి గాలి బయటకు పోతున్నట్టు నిర్ధారించుకోవచ్చు. డోర్ గాస్కెట్, సీల్‌ కూడా చూసుకో వాలి.

3. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత మరీ తక్కువ ఉండేలా టెంపరేచర్‌'సెట్' చేస్తే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. అటుఇటు కాకుండా మధ్యస్థంగా టెంపరేచర్ ఉండేలా సెట్ చేసుకోవడం మంచిది. లేదా ఫ్రిజ్‌లో ఉన్న పదార్ధాలకు తగ్గట్టుగా టెంపరేచర్‌ పెట్టుకోవడం మేలు.

4. డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లలో ఐస్‌ ఆరు మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ పేరుకోకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా 'డిఫ్రాస్ట్' (ఐస్ కరిగేలా) చేసుకుంటే విద్యుత్ వృథా కాదు. అలాగే ఆటోమెటిక్ ఐస్ మేకర్ వాడకపోవడమే మంచిది.

5. ఫ్రిజ్‌లో ఎక్కువ లోడ్ వేస్తే లోపల గాలి సర్క్యులేషన్ సరిగా ఉండదు. తక్కువ లోడ్ కూడా మంచిది కాదు. ఖాళీ ఫ్రిజ్ కంటే ఫ్రిజ్‌ సామర్థ్యానికి తగినట్లు వస్తువులుంటేనే అది బాగా పనిచేస్తుంది. ఫ్రిజ్‌ లో వేడి వస్తువులు పెట్టకుండా అవి చల్లబడిన తర్వాతే లోపల పెట్టాలి.

6. సూర్యరశ్మి తగలని చోట, వేడి సోకని చోట, డిష్ వాషర్, వోవెన్, వంట స్టవ్ లాంటి వాటికి దూరంగా ఫ్రిజ్ ‌ను నిలబెట్టాలి. ఫ్రిజ్ చుట్టూ కనీసం 30 సెంటీమీటర్ల ఖాళీ ఉండాలి. ఫ్రిజ్ కండెన్సర్, కాయిల్ల నుండి వేడి బయటికి పోయేలా ఏర్పాటు చేస్తేనే కూలింగ్ సిస్టం సమర్థంగా పనిచేస్తుంది. ఫ్రిజ్ వెనుక ఉన్న కాయిల్ని మూడు నెలలకొకసారి శుభ్రపరుస్తూ ఉండాలి. అలాగే డోర్ క్రింద ఉన్న ఇన్టేక్ గ్రిల్‌ను కూడా శుభ్రం చేయాలి.

7. ఫ్రిజ్‌ లో పెట్టే ఘన, ద్రవ పదార్థాలను మూతవేసిన పాత్రలలో కానీ, కవర్లలో కానీ పెట్టి ఉంచాలి. మూత లేకుండా పెడితే ఆహారపదార్థాలు విడుదల చేసిన తేమ వల్ల కంప్రెషర్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది.

8. తరచుగా వాడే వస్తువులన్నీ చిన్న కేబినెట్లలో పెట్టండి.

మిక్సర్- గ్రైండర్

1 మిక్సర్ గ్రైండర్లలో తడి పదార్థాల గ్రైండింగ్ కంటే పొడి పదార్థాల గ్రైండింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పొడి పదార్థాల గ్రైండింగ్‌కు మిక్సర్ గ్రైండర్ వాడకపోవడమే మంచిది.

ఎలక్ట్రిక్ ఇస్త్రీ

1 ఆటోమేటిక్‌గా టెంపరేచర్ కట్ ఆఫ్ అయ్యే ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె వాడటం మంచిది.

2 దుస్తులను బట్టి రెగ్యులేటర్ వాడాలి.

3 ఇస్త్రీ చేసేటపుడు బట్టలపై ఎక్కువ నీరు చల్లకూడదు. తడిబట్టలను ఇస్త్రీ చేయవద్దు.

మైక్రోవేవ్ ఓవెన్

1 మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని బాగా ఆదా చేయవచ్చు. మామూలు ఓవెన్ బదులు మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా 50 శాతం కంటే ఎక్కువ ఇంధనం ఆదా అవుతుంది. తక్కువ పరిమాణంలో పదార్థాలను వేడి చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా తక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది.

2. భారీ పరిమాణంలో పదార్థాలను వేడి చేసేందుకు మైక్రోవేవ్ ఓవెన్ వాడకపోవడమే మంచిది.

3. పదార్థాలు వేడి అయ్యాయో లేదో చూడడానికి మధ్యలో డోర్ తీసి చూసిన ప్రతిసారి లోపల 25° సెల్సియస్ వేడి తగ్గిపోతుంది. టైం చూసుకుని నిర్ణీత సమయం తర్వాత పదార్థాలను బయటకు తీసి వాడుకోవడం మంచిది.

కంప్యూటర్లు

1. ఇంట్లోనయినా, ఆఫీసులోనయినా వినియోగించనపుడు కంప్యూటర్ షట్‌ డౌన్‌ చేసి, స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. విద్యుత్ సమర్థంగా వినియోగించుకునే రిఫ్రిజిరేటర్ కంటే 24 గంటలు ఆన్‌లో ఉండే కంప్యూటర్‌ ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది.

2. పని మధ్యలో కంప్యూటర్ వదలాల్సి వస్తే కనీసం మానిటర్ని ఆఫ్ చేయండి. సిస్టం మొత్తం వినియోగించే విద్యుత్లో సగం కంటే ఎక్కువ మానిటర్కి వినియోగం అవుతుంది.

3. వాడనపుడు కంప్యూటర్ మానిటర్, ప్రింటర్లను స్లీప్ మోడ్‌లో ఉంచడం వల్ల విద్యుత్ ఖర్చు దాదాపు 40 శాతం తగ్గుతుంది.

4. కంప్యూటర్, లాప్టాప్, సెల్ ఫోన్‌, డిజిటల్ కెమెరా బ్యాటరీ చార్జర్లను ప్లగ్లులో పెట్టి వదిలేయడం ద్వారా కూడా విద్యుత్ ఖర్చు అవుతుంది. వాడనపుడు ప్లగ్ నుండి చార్జర్లను తీసేయాలి.

5. స్క్రీన్ సేవర్‌ వల్ల కంప్యూటర్ స్క్రీన్ సేవ్ అవుతుంది కానీ విద్యుత్ కాదు. కంప్యూటర్ స్టార్టప్, షటవున్ వల్ల అదనంగా విద్యుత్ ఖర్చు కాదు. పైగా కంప్యూటర్ సామర్థ్యకాలం పెరుగుతుంది.

వాషింగ్ మెషిన్

1. వాషింగ్ మెషిన్ తగినలోడ్‌తో వాడాలి.

2. తక్కువ సైకిల్ టైమ్ ఎంచుకోండి.

3. తగినంత నీటిని, డిటర్జెంట్ వినియోగించాలి.

4. టైమర్‌ను ఫిక్స్ చేయడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

5. బాగా మాసిపోయిన బట్టలకే వేడి నీటిని వినియోగించాలి.

6. బట్టలు నుసిమేందుకు చల్లని నీటినే వినియోగించాలి.

7. బట్టలు ఆరడానికి ఎలక్ట్రిక్ డ్రయర్లకు బదులు సహజ పద్దతులను వినియోగించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చు.

ఎయిర్ కండిషనర్

1. ఇంట్లో సీలింగ్ ఫాన్ తిరగడానికి గంటకు 40 పైసలు ఖర్చయితే, ఎయిర్ కండిషనర్ గంట పని చేయడానికి ఆరు నుండి ఏడు రూపాయలు ఖర్చు అవుతాయి. మరీ అవసరం అయితే తప్ప ఎయిర్‌ కండిషనర్లను వాడకపోవడం మంచిది. ఏసీ లేకపోతే బ్రతకలేం అనే స్థితికి వస్తే దానికి మనం బానిసలం అయిపోయినట్లేనని గుర్తించాలి. అన్నిటికీ సిద్ధపడేలా శరీరానికి అలవాటు చేయడం ఉత్తమం.

2. ఏసీ ఆన్ చేయగానే తక్కువ టెంపరేచర్ (17డిగ్రీల సెంటీగ్రేడ్) పెట్టడం వల్ల ఏసీపై ఎక్కువ భారం పడుతుంది. గది కూడా వెంటనే చల్లబడదు. మంచి ఎయిర్ కండిషనర్ గదిని చల్లబరచడానికి సుమారు 20, 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. గది చల్లబడ్డాక ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్‌ను ఫిక్స్ చేయడం మంచిది. ఆటోమేటిక్‌ టెంపరేచర్ కట్ ఆఫ్ అయ్యే ఏసిలని కొనడం మేలు.

3. ఏసిని 22 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఫిక్స్ చేస్తే ఒక్కో అదనపు డిగ్రీకి 3 నుండి 5 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అందుకే ఏసిని 25డిగ్రీ కి ఫిక్స్ చేసి గదిలో ఫాన్ కూడా వేస్తే గది మొత్తం చల్లబడి మొత్తంమీద విద్యుత్ వినియోగం తగ్గిపోతుంది. ఏసిని 18° సెంటీగ్రేడ్‌లో వాడే బదులు ఈ విధంగా చేయడం వల్ల చల్లదనంలో ఎలాంటి మార్పు ఉండదు.

Whats_app_banner