Karela Juice: కాకరకాయ రసాన్ని ఇలా ఉపయోగించారంటే మీ జుట్టు పొడవుగా పెరిగేస్తుంది, ఏం చేయాలో తెలుసుకోండి-if you use kakarakaya juice in this way your hair will grow long know what to do ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karela Juice: కాకరకాయ రసాన్ని ఇలా ఉపయోగించారంటే మీ జుట్టు పొడవుగా పెరిగేస్తుంది, ఏం చేయాలో తెలుసుకోండి

Karela Juice: కాకరకాయ రసాన్ని ఇలా ఉపయోగించారంటే మీ జుట్టు పొడవుగా పెరిగేస్తుంది, ఏం చేయాలో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Sep 24, 2024 08:00 AM IST

Karela Juice: కాకరకాయ మీరు చెప్పగానే చాలామందికి నచ్చదు. కానీ కాకరకాయతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. కాకరకాయతో జుట్టును ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

కాకరకాయ రసంతో పొడవు జుట్టు పొందడం ఎలా?
కాకరకాయ రసంతో పొడవు జుట్టు పొందడం ఎలా? (Pexel)

Karela Juice: కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి కనీసం రెండు మూడు సార్లు కాకరకాయతో చేసిన వంటకాలు తినమని పోషకాహార నిపుణులు చెబుతారు. అయితే దీని రుచి నచ్చక చాలామంది తినరు. నిజానికి కాకరకాయ తినడం వల్ల మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు మేలే జరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి కాకరకాయను ఏదో రకంగా ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. జుట్టును పొడవుగా పెరిగేలా మెరిసేలా చేస్తుంది.

2016లో చేసిన ఒక అధ్యయనంలో కాకరకాయలో ఉండే కణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని తేలింది. చర్మం నిపుణులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇవి మాడుకు పోషణను ఇచ్చే జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయని చెప్పారు.

కాకరకాయ వల్ల లాభాలు

కాకరకాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇది తలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు రాలకుండా ఆగుతుంది. అలాగే తలపై ఉన్న మాడును ఇది హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్లు వెంట్రుకలను అందంగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇది జుట్టుకు సహజమైన కండిషనర్ల పనిచేస్తుంది. జుట్టును విరిగిపోకుండా నిరోధిస్తుంది.

కాకర రసాన్ని తాగగలం అనుకునేవారు చిటికెడు ఉప్పు వేసి ప్రతిరోజు కాకరకాయ రసం తాగితే మంచిది. చిన్న గ్లాస్‌తో కాకరకాయ రసాన్ని తాగినా చాలు, దాని ఫలితం ఎంతో ఎక్కువ కనిపిస్తుంది. వారం రోజుల్లోనే మీ జుట్టు బాగా పెరుగుతుంది.

కాకరకాయతో ఇలా చేయండి

కాకరకాయ రసంతో హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ రసాన్ని తీసి మీ మాడుకు నేరుగా అప్లై చేయండి. అరగంట పాటు అలా వదిలేసి సాధారణ షాంపుతో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ జుట్టు పెరుగుదల బాగుంటుంది. కాకరకాయ ముక్కను తీసుకొని మాడు పై బాగా మూడు నిమిషాల పాటు రుద్దినా మంచి ఫలితం వస్తుంది. కాకరకాయ రసంలో పెరుగు లేదా కొబ్బరి నూనె కలిపి హెయిర్ మాస్కుగా వాడండి. జుట్టుకు బాగా పట్టించాక పావుగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. కాకరకాయ నూనెను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో కాకరకాయ ముక్కలను వేసి కొన్ని రోజులు పాటు ఉంచండి. తర్వాత ఆ ముక్కలను పిండి తీసేయండి. ఆ నూనెను జుట్టుకు పట్టించండి. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అన్నిటికంటే ముఖ్యంగా కాకరకాయను మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. రోజుకు చిన్న గ్లాస్ తో కాకరకాయ రసాన్ని గుటుక్కున మింగేయండి. ఇది మీకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది.

టాపిక్