Protein Deficiency: మీ శరీరంలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే ప్రోటీన్ లోపం ఉందని అర్థం, వెంటనే వీటిని తినండి
Protein Deficiency: ప్రతి మనిషికి ప్రోటీన్ చాలా అవసరం. కొన్ని పరిస్థితుల్లో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. ఆ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
Protein Deficiency: మన శరీరంలో ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. ఇది హార్మోన్లు, కండరాలు, చర్మం, ఎంజైములు... వీటన్నింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైనది. శరీరానికి తగినంత ప్రోటీన్ లభించకపోతే మన శారీరక విధులు కూడా సక్రమంగా నిర్వర్తించలేము. ఈ పోషకం లోపిస్తే మన శరీరం ముఖ్యంగా ఆరు లక్షణాలను చూపిస్తుంది. ఈ లక్షణాలు మీరు కనిపిస్తే ప్రోటీన్ లోపం ఉందని అర్థం. అప్పుడు ప్రోటీన్ నిండిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే ఈ ప్రోటీన్ లోపం అనర్ధాలకు దారితీస్తుంది .
ఎడెమా
ఎడెమా అంటే శరీరంలో వాపు కనిపించడం. ముఖ్యంగా కాళ్లు, పాదాలు, చేతుల్లో ఈ వాపు కనపడుతుంది. దీన్నే ఎడెమా అంటారు. అల్బుమిన్ వంటి ప్రోటీన్లు మీ శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడడానికి సహాయపడతాయి. ఎప్పుడైతే ప్రోటీన్ లోపం సంభవిస్తుందో అప్పుడు ఆ ద్రవాలు రక్తనాళాల నుండి బయటకు వెళ్లి కణజాలాలలో పేరుకుపోతాయి. దీనివలన అక్కడ వాచినట్టు అవుతుంది. కాబట్టి ప్రోటీన్ స్థాయిలు తగ్గితే శరీరంలో ద్రవాల సమతుల్యతలు తగ్గుతాయి. ఇది ఇన్ఫ్లమేషన్‌కు, ఎడెమాకు కారణం అవుతుంది.
చర్మం, జుట్టు
మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపిస్తే చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యం తగ్గిపోతుంది. కణజాలాల నిర్మాణం తగ్గుతుంది. కొలాజిన్, కెరాటిన్ వంటి ప్రోటీన్లు ఎప్పుడైతే శరీరానికి అందవో.. అప్పుడు చర్మం, జుట్టు, గోళ్ళు అనారోగ్యంగా కనిపిస్తాయి. గోళ్లు పెళుసుగా మారుతాయి. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలాగే చర్మం పొడిబారినట్టు అవుతుంది. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రోటీన్ లోపం ముందేమో చెక్ చేయించుకోవడం చాలా అవసరం.
విపరీతమైన ఆకలి
ఆకలిని నియంత్రించడానికి ప్రోటీన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ఆహారంలో తగినంత ప్రోటీన్ లభించలేదు. శరీరం అధిక కేలరీల ఆహారాల కోసం ఎదురుచూస్తుంది. ఆకలి కోరికలను పుట్టిస్తుంది. మీకు ఆకలి విపరీతంగా వేస్తే మీలో ప్రోటీన్ లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. తగినంత ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. ఇది మీలో ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని కూడా అడ్డుకుంటుంది.
కండరాల బలహీనత
కండరాల పెరుగుదలకు, నిర్వహణకు ప్రోటీన్ చాలా అవసరం. తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే శరీరంలో కండరాల కణజాలాలు విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల కండరాల బలహీనత ఏర్పడుతుంది. చిన్న బరువులు కూడా మోయలేరు.
ఆరోగ్యకరమైన రోగ నిరోధకవ్యవస్థకు కూడా ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది రోగ నిరోధక వ్యవస్థలో కణాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రోటీన్ లేకపోతే శరీరానికి అంటువ్యాధులు త్వరగా సోకుతాయి. ఇన్ఫెక్షన్ బారిన త్వరగా పడుతుంది. కాబట్టి ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోండి. మీరు తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
కాలేయ ఆరోగ్యానికి కూడా ప్రోటీన్లు చాలా అవసరం. ప్రోటీన్ లోపం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినడం వైఫల్యం చెందడం జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ శరీరానికి తగినంత స్థాయిలో తినడం చాలా అవసరం.
ప్రొటీన్ నిండిన ఆహారాలు
ప్రోటీన్ నిండిన ఆహారాలలో ముఖ్యమైనవి గుడ్లు, బాదం పప్పులు, చికెన్, చీజ్, పెరుగు, పాలు, పప్పు దినుసులు వంటివి వీటిని ప్రతిరోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది.