Rajma Pulao: హెల్తీగా టేస్టీగా రాజ్మా పులావ్ రెసిపీ, శాఖాహారులకు ఉత్తమ ప్రోటీన్ ఫుడ్ ఇది-rajma pulao recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rajma Pulao: హెల్తీగా టేస్టీగా రాజ్మా పులావ్ రెసిపీ, శాఖాహారులకు ఉత్తమ ప్రోటీన్ ఫుడ్ ఇది

Rajma Pulao: హెల్తీగా టేస్టీగా రాజ్మా పులావ్ రెసిపీ, శాఖాహారులకు ఉత్తమ ప్రోటీన్ ఫుడ్ ఇది

Haritha Chappa HT Telugu
May 31, 2024 05:30 PM IST

Rajma Pulao: రాజ్మాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శాకాహారులు కచ్చితంగా తినాల్సిన వాటిలో ఇది ఒకటి. రాజ్మాతో పులావ్ చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

రాజ్మా పులావ్ రెసిపీ
రాజ్మా పులావ్ రెసిపీ

Rajma Pulao: ప్రోటీన్ కోసం మాంసాహారులు కోడిగుడ్లు, చికెన్ వంటి వాటిపై ఆధారపడతారు. శాఖాహారులు మాత్రం పప్పు దినుసుల పైనే ఆధారపడాలి. ముఖ్యంగా రాజ్మాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరూ కచ్చితంగా తినాలి. ఇక్కడ మేము రాజ్మా పులావ్ రెసిపీ ఇచ్చాము. రాజ్మాను ఎప్పుడూ కర్రీలానే కాదు. అప్పుడప్పుడు ఇలా పులావ్ రూపంలో వండుకున్నా బాగుంటుంది. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చేయడం చాలా సులువు.

yearly horoscope entry point

రాజ్మా పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

రాజ్మా - అరకప్పు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను

పచ్చిమిర్చి - ఒకటి

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

గరం మసాలా - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కసూరి మేతి - అర స్పూను

నెయ్యి - రెండు స్పూన్లు

దాల్చిన - ఒక చిన్న ముక్క

యాలకులు - నాలుగు

నీరు - తగినంత

లవంగాలు - రెండు

బిర్యానీ ఆకులు - రెండు

రాజ్మా పులావ్ రెసిపీ

1. రాజ్మాను శుభ్రంగా కడిగి రాత్రిపూట నీటిలో వేసి నానబెట్టాలి.

2. మరుసటి రోజు ఉదయం నీటిని తీసివేసి రాజ్మాను కుక్కర్లో వేసి తగినంత నీళ్లు పోయాలి.

3. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

4. ఇప్పుడు మరొక కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి.

5. నెయ్యి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.

6. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించుకోవాలి.

7. ఈ రెండూ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి వేయించాలి.

8. ఇప్పుడు టమోటో తరుగును వేసి కలుపుకోవాలి. ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.

9. టమోటా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి.

10. తర్వాత మూత తీసి గరం మసాలా పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి.

11. అప్పుడు ముందుగా ఉడికించిన రాజ్మాను అందులో వేసి బాగా కలుపుకోవాలి.

12. మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి.

13. తర్వాత బాస్మతి బియ్యాన్ని వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి.

14. రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆవిరి పోయేదాకా ఉంచిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. అంతే టేస్టీ రాజ్మా పులావ్ రెడీ అయిపోతుంది.

15. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే పులావ్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో ఇవి ఒకటి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శాఖాహారులు తినడం వల్ల తగినంత ప్రోటీన్ పొందవచ్చు. రాజ్మాను పిల్లలకు కూడా వారానికి ఒకటి రెండుసార్లు తినిపించడం వల్ల వారికి కావలసిన పోషకాలు శరీరానికి అందుతాయి. దీని చేయడం చాలా సులువు. కాబట్టి వారానికి ఒకసారి అయినా చేసుకుంటే మంచిది. సాధారణ బియ్యంతో కన్నా బాస్మతి బియ్యంతోనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner