వర్షాకాలంలో గాలిలో తేమ పెరుగుతుంది. ఈ తేమ వల్ల ఆరోగ్యానికి హానికరమైన కారకాలు గాల్లో చేరిపోతాయి. వీటివల్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ముందుగానే పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మురికి నీళ్లలో బ్యాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధి కారక జీవులు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు ఈ నీళ్లను అనుకోకుండా తాకినప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అలాగే త్రాగేనీళ్లు కూడా తొందరగా కలుషితమై జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడతారు. కాచి చల్లార్చిన నీళ్లు వర్షాకాలంలో తాగడం ఉత్తమం.
పూణేలోని అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ అభిమన్యు సేన్ గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో, "ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, చల్లగా తేమతో కూడిన గాలి పిల్లలకు హానికరం. ఇది ముక్కు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలెర్జీలు, శ్వాసకోశ రుగ్మతలకు దారితీస్తుంది. " అన్నారు.