Green Upma: ఉప్మా బోర్ కొట్టేసిందా? ఈ గ్రీన్ ఉప్మా ట్రై చేస్తే రుచి నచ్చేస్తుంది
Green Upma: ఉప్మా సాధారణంగా ఎక్కువగా తినే అల్పాహారం. ఇది బోర్ కొడితే కాస్త భిన్నంగా గ్రీన్ ఉప్మా ట్రై చేయండి. కొత్తిమీర ఫ్లేవర్‌తో ఉండే ఈ రుచి కాస్త కొత్తగా అనిపిస్తుంది.
ఉప్మా తిని బోర్ కొట్టేస్తుందా? ఎప్పుడూ ఒకటే రుచిలో తినాలంటే అంతే ఉంటుంది. అందుకే ఒకసారి కొత్తిమీర ఫ్లేవర్ తో కొత్తిమీర ఉప్మా తయారు చేయండి. కొత్త రుచితో తప్పకుండా నచ్చేస్తుంది. దీంట్లో కొత్తిమీరను ఆకుల్లా కాకుండా సింపుల్ కొత్తిమీర మసాలా వేసి వండుతాం. దాంతో కొత్తిమీర రుచి ఇంకా బాగా తెలుస్తుంది. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. దానికోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి.
గ్రీన్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు రవ్వ
1 ఉల్లిపాయ, సన్నటి తరుగు
2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు
1 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
1 టీస్పూన్ మినప్పప్పు
1 కరివేపాకు రెమ్మ
తగినంత ఉప్పు
1 చెంచా నిమ్మరసం
గ్రీన్ మసాలా కోసం:
1 కప్పు కొత్తిమీర తరుగు
అంగుళం అల్లం ముక్క
1 పచ్చిమిర్చి ముక్కలు
గ్రీన్ ఉప్మా తయారీ విధానం:
1. కొత్తిమీర ఉప్మా తయారీ కోసం ముందుగా కొత్తిమీర మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్‌లో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమనుకుంటే 2 చెంచాల నీళ్లు పోసుకోవాలి.
2. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి.
3. ఇప్పుడు రవ్వ వేసుకుని కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటూ కలుపుతూ వేయించుకోవాలి. కాసేపయ్యాక మంచి వాసన వస్తుంది.
3. రవ్వ బాగా వేగిపోయాక ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర ముద్ద వేసుకుని రెండు నిమిషాలు పచ్చి వాసన కొద్దిగా పోయేదాక వేయించుకోవాలి.
4. ఆలోపు మరో గిన్నెలో వేడి నీళ్లు పెట్టుకుని అందులో ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి.
5. నీళ్లు మరిగాక వేయించుకున్న రవ్వలో పోసుకోవాలి.
6. నీళ్లు, రవ్వ మిశ్రమం కలిసేదాకా బాగా కలుపుతూ ఉండాలి. నీళ్లు మొత్తం తగ్గిపోయినప్పుడు నిమ్మరసం వేసుకుని కలిపేసుకోవాలి.
7. 5 నిమిషాల పాటూ మూత పెట్టుకుని మగ్గనిస్తే ఉప్మా రెడీ అయినట్లే. ఈ ఉప్మాని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది.