Rava Kudumulu: రవ్వతో కుడుముల తాలింపు చేసి చూడండి, చాలా సులభమైన రెసిపీ-try rava kudumulu for breakfast a simple recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rava Kudumulu: రవ్వతో కుడుముల తాలింపు చేసి చూడండి, చాలా సులభమైన రెసిపీ

Rava Kudumulu: రవ్వతో కుడుముల తాలింపు చేసి చూడండి, చాలా సులభమైన రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Sep 29, 2024 06:30 AM IST

Rava Kudumulu: రవ్వతో చేసే బటన్ కుడుములు కొత్తగా అనిపిస్తాయి. రొటీన్‌గా కాకుండా భిన్నంగా తినాలనుకుంటే వీటిని ప్రయత్నించండి. చాలా సింపుల్ రెసిపీ ఇది.

రవ్వ కుడుములు
రవ్వ కుడుములు

రవ్వతో చేసే టేస్టీ బటన్ కుడుముల రుచి తప్పక చూడాల్సిందే. వీటిని పిల్లలకు పాస్తా అని చెప్పి ఇచ్చారంటే ఇంకా ఇష్టంగా తింటారు. కుడుముల్లాగా కాకుండా పాస్తాలాగా పొడవుగా, మెలితిప్పి చేసివ్వచ్చు. వీటి తయారీ చాాలా సింపుల్. ఉదయం అల్పాహారంలోకి, సాయంత్రం పూట స్నాక్స్ లోకి ఇది వెంటనే చేసుకోదగ్గ రెసిపీ

రవ్వ కుడుముల తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు:

1 కప్పు సన్నం రవ్వ

1 కప్పు నీళ్లు

నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, సన్నని తరుగు

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు

1 టమాటా , సన్నటి ముక్కల తరుగు

2 చెంచాల నూనె

2 చెంచాల పెరుగు

సగం చెంచా ఉప్పు

సగం చెంచా కారం

గుప్పెడు కొత్తిమీర తరుగు

సగం చెంచా ఆరిగానో (ఆప్షనల్)

రవ్వ కుడుముల తాలింపు తయారీ విధానం:

  1. ముందుగా ఒక కడాయిలో నూనె వేసుకుని రవ్వ వేయించుకోవాలి. వాసన వచ్చేదాకా వేయించి సన్నం మంట మీద పెట్టి అందులో ఉప్పు, వేడినీళ్లు పోసుకోవాలి.
  2. కప్పు రవ్వకు కప్పు వేడినీళ్లు పోసుకోండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండండి.
  3. మూత పెట్టి పది నిమిషాలు మగ్గించండి. రవ్వ బాగా ఉడికిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి.
  4. దాంట్లో రెండు చెంచాల పెరుగు వేసుకుని బాగా కలిసేలా చపాతీ పిండి కలిపినట్లు కలపండి. పెరుగు వల్ల కుడుములకు కాస్త పులుపు రుచి, మెత్తదనం వస్తాయి.
  5. ఈ కొలతలతో చేస్తే పిండి సరిగ్గా వస్తుంది. పిండితో ఉండలు చేసేలా ఉండాలని గుర్తుంచుకోండి.
  6. ఇప్పుడు రవ్వను కాస్త తీసుకుని చిన్నగా బటన్ ఆకారం చేసుకోండి. పిల్లల కోసం స్నాక్ లాగా చేస్తే వాళ్లకు నచ్చే ఆకారంలో వీటిని పాస్తాను పోలి ఉండేలాగానూ చేసుకోవచ్చు.
  7. ఇలా చేసుకున్న బటన్ కుడుములను ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్‌లో వేసి ఆవిరి మీద ఉడికించుకోండి. పది నిమిషాలు ఉడికిస్తే రవ్వ కుడుములు ఉడికిపోతాయి.
  8. వీటిమీద ఆవాలు, కరివేపాకు తాలింపు వేసుకుని ఉప్పు, కారం, పసుపు నూనెలో వేిసి కలిపి తినేయొచ్చు. కాస్త టేస్టీగా చేయాలంటే కాస్త వేరేలా తాలింపు పెట్టాలి.
  9. దానికోసం ప్యాన్ వేడెక్కాక నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి వేయించుకోండి.
  10. అన్నీ మెత్తబడ్డాక 2 చెంచాల టమాటా సాస్, కారం, ఉప్పు, ఆరిగానో వేసుకుని కలుపుకోండి. అందులో ఉడికించుకున్న బటన్ కుడుములు వేసుకోండి చాలు.
  11. కొత్తిమీర చల్లుకుని దింపేసుకుంటే హెల్తీ రవ్వ కుడుముల తాలింపు రెడీ.

ఈ రెసిపీ హెల్తీగా ఉండాలనుకుంటే తాలింపు పెట్టుకోకుండా ఏదైనా చట్నీతోనూ తినొచ్చు. అప్పుడు నూనె వాడాల్సిన అవసరం ఉండదు.

Whats_app_banner