Chikkudu Kudumulu: తెలంగాణ స్పెషల్ చిక్కుడుకాయ కుడుములు.. రుచికరమైన అల్పాహారం..-know how to cook telangana special chikkudu kudumulu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chikkudu Kudumulu: తెలంగాణ స్పెషల్ చిక్కుడుకాయ కుడుములు.. రుచికరమైన అల్పాహారం..

Chikkudu Kudumulu: తెలంగాణ స్పెషల్ చిక్కుడుకాయ కుడుములు.. రుచికరమైన అల్పాహారం..

Koutik Pranaya Sree HT Telugu
Nov 02, 2023 06:30 AM IST

Chikkudu Kudumulu: తెలంగాణ స్పెషల్ చిక్కుడు కాయ కుడుములు చాలా రుచిగా ఉంటాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో వివరంగా చూసేయండి.

చిక్కుడుకాయ కుడుములు
చిక్కుడుకాయ కుడుములు

తెలంగాణ స్పెషల్ వంటకం చిక్కుడుకాయ కుడుములు ఎప్పుడైనా రుచి చూశారా? ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు. వాటి తయారీ కాస్త కొత్తగా అనిపించినా ఒక్కసారి చేసి చూస్తే చాలా సులభం. అల్పాహారంలోకి తినడం ఆరోగ్యకరం. వాటిని ఎలా తయారుచేసుకోవాలో వివరంగా చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

అరకేజీ బాగా గింజలున్న చిక్కుడు కాయ

3 కప్పుల బియ్యం పిండి

ఒకటిన్నర కప్పుల నీళ్లు

1 కప్పు ఉల్లికాడలు, తరుగు

2 చెంచాల మెంతికూర, తరుగు

5 పచ్చిమిర్చి, ముద్ద

అరకట్ట కొత్తిమీర, తరుగు

1 చెంచా జీలకర్ర

అరచెంచా ధనియాలు

చెంచా ఉప్పు

1 చెంచా నూనె

అరచెంచా ఆవాలు

అరచెంచా జీలకర్ర

తయారీ విధానం:

  1. ముందుగా చిక్కుడు కాయ కడుక్కుని ముక్కలుగా చేసుకుని సిద్దం చేసుకోవాలి. గింజలతో సహా చిక్కుడుకాయ మునిగేనన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి.
  2. కుక్కర్లో అయితే చిక్కుడుగాయ 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మామూలు పాత్రలో అయితే ఉడికిందనుకుంటే దించేసుకోవచ్చు.
  3. ఇప్పుడు నీళ్లు వంపేసి చిక్కుడుగాయను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే బియ్యం పిండి, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లికాడలు వేసుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సీ జార్ లో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుని ఆ ముద్ద చిక్కుడుగాయ మిశ్రమంలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి.
  5. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఇష్టమైన ఆకారంలో కుడుముల్లాగా ఒత్తుకోవాలి.
  6. ఒక లోతు ఎక్కువున్న పాత్రలో ఒక చెంచా నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి.
  7. అందులోనే నీళ్లు పోసుకుని బాగా మరిగాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కుడుముల్ని వేసుకుని మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. పదినిమిషాల్లో కుడుములు ఉడికి సిద్ధమవుతాయి.

Whats_app_banner