Lungs Problems: ఈ లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తులు మీ కన్నా వేగంగా ముసలివైపోతున్నాయని అర్థం, ముందు జాగ్రత్తలు తీసుకోండి
Lungs Problems: మన శరీరంలోని అవయవాలను కాపాడుకోకపోతే మన వయసు కన్నా ముందే అవి ముసలివైపోయే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు చూపించే కొన్ని లక్షణాలను ద్వారా వాటి వయసు పెరిగిపోతోందని అర్థం చేసుకోండి.
Lungs Problems: మన శరీరంలో ఊపిరితిత్తులు ప్రధానమైన అవయవాల్లో ఒకటి. మన వయసును బట్టే మన అవయవాల వయసు కూడా ఉంటుందని అనుకోవద్దు. పరిశుభ్రత లేకపోవడం, చెడు జీవనశైలి, సరిగా తినకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటి చర్యల వల్ల... మనకన్నా మన అవయవాలు త్వరగా వృద్ధాప్యం బారిన పడతాయి. మన వయసు 30 అయినా, మన అవయవాల వయసు 40 దాటిపోవచ్చు. అంటే అవి పని చేసే తీరు మందకొడిగా మారవచ్చు. ఇక్కడ మేము ఊపిరితిత్తులు వయసు పెరిగిపోతోందని చెప్పే లక్షణాలను ఇచ్చాము. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీ వయసు కన్నా మీ ఊపిరితిత్తుల వయస్సు పెరిగిపోతుందని, అవి వృద్ధాప్యం బారిన పడుతున్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే మీ జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులను కాపాడుకోవాలి.
ఈల శబ్దం
ఊపిరి పీలుస్తున్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి సన్నని శబ్దాలు వస్తుంటే వాటిని తేలికగా తీసుకోకూడదు. కొంతమందికి ఈల వేసినట్టు చిన్న శబ్దాలు వస్తాయి. దీనికి కారణం ఇరుకైన వాయు మార్గాలు. ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశించడానికి, తిరిగి నిష్క్రమించడానికి వాయు మార్గాలు వదులుగా లేకపోతే ఇలాంటి శబ్దాలు వస్తాయి. వెంటనే మీరు ఊపిరితిత్తుల పనితీరును ఎలా ఉందో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
తడి దగ్గు
దగ్గు విపరీతంగా రావడంతో పాటు కాస్త శ్లేష్మం కూడా వస్తుంటే ఇది అలెర్జీలకు, ఇన్ఫెక్షన్లకు సంబంధించినది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే ఊపిరితిత్తుల్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తులు వాయు మార్గాలను రక్షించడానికి ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే వాయు మార్గాలలో ఏదో సమస్య ఉంటేనే శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవుతుంది. మీరు ఎల్లప్పుడూ కఫంతో కూడిన దగ్గుతో బాధపడుతుంటే వెంటనే తగిన చికిత్సను తీసుకోండి. లేకుంటే ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితం కావచ్చు.
ఊపిరి ఆడకపోవడం
వ్యాయామాలు చేశాక ఊపిరి పీల్చుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ సాధారణంగా ఇంటి పనులు చేస్తున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తే, దాన్ని హెచ్చరికగానే భావించాలి. మీ ఊపిరితిత్తులు పనితీరు మందగిస్తోందని అర్థం చేసుకోవాలి. అవి విస్తరించడం, సంకోచించడం కష్టంగా మారుతోందని తెలుసుకోవాలి. మీ శరీరానికి తగినంత ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు గ్రహించడానికి ఇబ్బంది పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. వెంటనే ఊపిరితిత్తులను డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సను తీసుకోవాలి.
గాలి అందకుండా
మీరు ఓపెన్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి గాలి అందనట్టు ఫీల్ అవుతున్నా, లోతుగా శ్వాస తీసుకోలేకపోతున్నా ఊపిరితిత్తుల్లో ఏదో ఇబ్బంది ఉందని తెలుసుకోండి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతేనే ఇలా గాలి తీసుకోవడానికి అవి ఇబ్బంది పడతాయి. కండరాలు క్షీణించడంతో శ్వాస తీసుకోలేక పోతారు.
మెట్లు ఎక్కినప్పుడు
ఒక్కోసారి మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అలా మెట్లు ఎక్కుతున్నప్పుడు రెండు మూడు మెట్లకే అలసట వస్తుందంటే మీకంటే త్వరగా మీ ఊపిరితిత్తులు వృద్ధాప్యం బారిన పడుతున్నాయని అర్థం చేసుకోండి. ఊపిరితిత్తుల పనితీరు చాలా వరకు తగ్గిపోతుందని తెలుసుకోవాలి. దీనివల్ల మీరు బలహీనంగా మారిపోతారు, అలసట బారిన పడతారు.
ఛాతీ పట్టేసినట్టు ఉంటే
ఛాతీలో పట్టేసినట్టు ఉన్నా కూడా దానికి కారణం ఊపిరితిత్తుల్లో ఉండే అనారోగ్యం కావచ్చు. మీ ఊపిరితిత్తులు పనిచేయకపోతే ఇలా ఒత్తిడి బారిన పడతాయి. సులభంగా గాలి పీల్చుకోలేక ఛాతీ బిగుతుగా అయిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తుల కోసం కాస్త సమయాన్ని కేటాయించి ఆరోగ్యకరమైన పద్ధతులను నేర్చుకోండి.
మీ కన్నా ముందే మీ ఊపిరితిత్తులు ముసలివైపోతే ఆరోగ్యకరంగా జీవించడం కష్టమైపోతుంది. కాబట్టి ఊపిరితిత్తుల కోసం ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోండి. వ్యాయామంతో పాటు ఒత్తిడి తగ్గించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు చేసుకోండి. ముఖ్యంగా వైద్యులను కలిసి ఊపిరితిత్తులకు కావలసిన చికిత్సను అందించండి.
టాపిక్