Lung Cancer Vaccine: ప్రపంచంలో తొలిసారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్, ఇది ఎలా పనిచేస్తుందంటే
Vaccine for Lung Cancer: ధూమపానం వల్ల ఎంతో మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచంలో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడంతో దీనికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఎప్పటినుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి.
Vaccine for Lung Cancer: ప్రపంచంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతిరోజూ కొన్ని వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ధూమపానం చేసే వారి సంఖ్య పెరగడంతో వారితో పాటు వారు విడిచిన పొగను పీల్చిన పక్కనున్నవారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. ఇది ఒక్కసారి వస్తే జీవిత ఆయుష్షు కరిగిపోయినట్టే. అందుకే ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడుగా వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. యూకేలోని ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక రోగికి ఆ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఇచ్చారు. అతడి వయసు 67 ఏళ్లు.
ఊపిరితిత్తుల వ్యాక్సిన్ కోర్సు
బ్రిటన్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న 67 ఏళ్ల వ్యక్తికి క్యాన్సర్ కోసం తయారుచేసిన వ్యాక్సిన్ కోర్సును 6 ఇంజక్షన్ల ద్వారా అందించారు. ఇప్పుడు అతని ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ క్యాన్సర్ కణితులపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుందో కూడా అధ్యయనం చేస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ పేరు
ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతమైనదని చెబుతున్నారు పరిశోధనకర్తలు. మన రోగ నిరోధక వ్యవస్థలోని ఐదు బిలియన్ కణాలకు శక్తినిచ్చి ప్రతిదాడి చేయడానికి శిక్షణ ఇస్తుందని చెబుతున్నారు. ఆ కణాలు క్యాన్సర్ కణితులను పెరగనివ్వవని, వాటిని అడ్డుకుంటాయని వివరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కు BNT116 అనే సంకేతనామాన్ని ఇచ్చారు.
ఈ వ్యాక్సిన్ అందుకున్న తొలి వ్యక్తి రాక్జ్. ఇతను యూకేకు చెందిన వ్యక్తి అతను కీమోథెరపీ కంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవడమే సులభంగా ఉందని చెప్పారు. అలాగే ఇది నొప్పి కూడా పెట్టడం లేదని వివరిస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలతో పోరాడడానికి, రోగుల రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చేందుకు సహాయపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తుల్లో ఎక్కడ ఉన్నా నిర్మూలించే విధంగా శరీరాన్ని ప్రతిస్పందించేలా చేస్తుంది. కనితి పరిమాణం పెరగకుండా క్యాన్సర్ మళ్ళీ మళ్ళీ దాడి చేయకుండా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి రోగుల రోగనిరోధక వ్యవస్థను విపరీతంగా పెంచుతుంది. కాకపోతే ఈ వ్యాక్సిన్‌ను 12 నెలల పాటు వినియోగించాల్సి వస్తుంది. అంటే ఏడాది వరకు ఈ ఇంజక్షన్లు వేసుకోవాలి. దాదాపు ఏడాదిలో 12 ఇంజక్షన్లను తీసుకోవాల్సి రావచ్చు.
ధూమపానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాగి ఉంటుంది. కొంతమంది ఆ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారు కూడా ఉన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రారంభ దశలో బయటపడడం కాస్త కష్టంగా ఉంటుంది. దీనివల్ల అది శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స చేయడం చాలా అవసరం.
ధూమపానం అలవాటు ఉన్నవారు సంవత్సరానికి రెండుసార్లు అయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షను చేయించుకోవడం ఉత్తమం. లేకుంటే అది మెదడు, కాలేయం, చర్మం, అడ్రినల్ గ్రంధులతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు త్వరగా వ్యాపిస్తుంది. లింఫ్ నోడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధూమపానం మానేయాలి. లేదా ధూమపానం చేస్తున్న ప్రతివారు ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం పరీక్షలు చేసుకోవడం ఉత్తమం. దగ్గు, ఛాతీ నొప్పి, తీవ్ర అలసట వంటివి అక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన చికిత్సను తీసుకోవాలి.
టాపిక్