Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే-icmr doctors say when to drink tea and coffee and how much to drink and these are the dangers due to them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avoid Tea And Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న Icmr వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

Haritha Chappa HT Telugu
May 15, 2024 09:00 AM IST

Avoid Tea and Coffee: టీ ,కాఫీలతోనే రోజును మొదలుపెట్టే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారికి ICMR షాక్ ఇస్తోంది. వారు తాగే పానీయాలు ఎంత అనారోగ్యకరమైనవో వివరిస్తోంది.

టీ, కాఫీ ఎందుకు తాగకూడదు?
టీ, కాఫీ ఎందుకు తాగకూడదు? (Pixabay)

Avoid Tea and Coffee: టీ, కాఫీలు తాగితేనే పనులు మొదలు పెట్టేవారు ప్రపంచంలో ఎక్కువమంది. అయితే టీ, కాఫీ వినియోగదారులు తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వైద్యులు... టీ, కాఫీ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ICMRతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు కలిసి దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టారు. అందులో టీ, కాఫీల ప్రస్తావనే అధికంగా ఉంది. ఈ వైద్యులు టీ, కాఫీలను ఎలా తాగాలో, ఎంత తాగాలో వివరిస్తున్నారు. అలాగే ఆ రెండు పానీయాలు ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో కూడా చెబుతున్నారు. టీ, కాఫీ వినియోగదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ.

కొంతమంది రోజులో ఒకసారి మాత్రమే టీ లేదా కాఫీ తాగుతారు. మరి కొంతమంది మాత్రం రోజులో ఎప్పుడు పడితే అప్పుడు వీటిని తాగుతూనే ఉంటారు. ఇదే వారి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ICMR చెబుతున్న ప్రకారం టీ, కాఫీలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిస్తుంది. దీనివల్లే ఆ రెండూ తాగాక మనిషి ఉత్సాహంగా, ఉత్తేజంగా మారుతాడు. అలా అని రోజులో ఎక్కువసార్లు తాగితే మాత్రం సమస్యలు తప్పవు.

ఎంత కెఫిన్ ఉంటుంది?

ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. అదే ఇన్స్టెంట్ కాఫీ విషయానికొస్తే 50 నుంచి 65 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.

కెఫిన్ అధికమైతే...

కెఫీన్ చాలా తక్కువ మొత్తంలోనే ఆ శరీరానికి అవసరం. అధిక మొత్తంలో తాగితే అంతా విషంగానే మారుతుంది. భోజనానికి ముందు లేదా భోజనం చేసిన తర్వాత ఒక గంట వరకు టీ లేదా కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఈ పానీయాలలో టానిన్లు ఉంటాయి. ఈ టానిన్లు శరీరంలో చేరాక ఇనుమును శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఇనుము లోపం ఏర్పడుతుంది. టానిన్లు పొట్టలోనే ఇనుమును బంధిస్తాయి. ఇనుము లోపం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు కాఫీని అధికంగా తాగడం వల్ల రక్తపోటు పెరిగిపోతుంది. గుండె కొట్టుకునే వేగంలో కూడా మార్పులు వస్తాయి.

పాలు లేని టీ తో లాభాలు

టీ, కాఫీలు తాగాలనుకునేవారు పాలను వేసుకోకుండా తాగడం మంచిది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగు పడుతుంది. కరోనరీ హార్ట్ డిసీజ్, పొట్ట క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. టీ, కాఫీలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. రోజుకి ఒకసారి మాత్రమే టీ లేదా కాఫీ ని తాగడం ఉత్తమం. పండ్లు, కూరగాయలు, మాంసాలు, సముద్రపు ఆహారం, పప్పులు వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చక్కెర, ఉప్పు, అధిక నూనె వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

కాబట్టి టీ, కాఫీల పై ఆధారపడుతున్న వారు చాలావరకు ఆ అలవాటును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎక్కువ కాలం పాటు ఆయుష్షును పూసుకుని జీవిస్తారు. లేకుంటే అనేక రకాల సమస్యలు శరీరంలో ఉత్పన్నమవుతాయి. మీకు అంతగా తాగాలనిపిస్తుంది పాలు వేయకుండా కేవలం టీ డికాషన్ మరిగించుకొని, చక్కెర లేకుండా తాగడం ఉత్తమం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

ICMR అంటే?

ICMR అనేది భారత వైద్య పరిశోధన సంస్థ. ఇది ప్రపంచంలోనే ప్రాచీనమైన అతి పెద్ద వైద్య పరిశోధనా సంస్థలలో ఒకటి. దీనికి భారత ప్రభుత్వం ఆరోగ్య పరిశోధనాభాగం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తూ ఉంటాయి. ICMR నిత్యం ప్రజల కోసం పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తినాలి? ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? వంటివి పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఈ సంస్థలో ఎంతోమంది వైద్యులు పనిచేస్తున్నారు. వీరు పోషకాహారం, వివిధ రకాల వ్యాధులను అరికట్టే మందుల పరిశోధనలో బిజీగా ఉంటారు. ICMR ఒక సూచన చేసిందంటే అది ప్రజల సంక్షేమం కోసమే.అంతేకాదు ఆ సూచన చేసే ముందు ఎన్నో సంవత్సరాలు పరిశోధనలు చేశాకే ఫలితాన్ని ప్రకటిస్తారు. కాబట్టి ఐసిఎంఆర్ సూచన చేశాక వాటిని పాటించడం ప్రజల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

WhatsApp channel

టాపిక్