Too Much Caffeine: కెఫీన్ ఎంత తీసుకుంటే ఎక్కువ? అది లేకుండా వేటితో మనకు ఉత్సాహం?
Too Much Caffeine: రోజూ కాఫీలు తాగే అలవాటుంటే ఎంతవరకూ తీసుకోవచ్చు? దానికి ప్రత్యామ్నాయాలేంటి? ఎలాంటి అలవాట్ల వల్ల కాఫీ తాగడం మానేయొచ్చు అనే సందేహాలున్నాయా? అయితే ఆ వివరాలన్నీ తెల్సుకోండి.
ఇవాళ రేపు చాలా మంది.. మంచి కాఫీతోనో, వేడి వేడి టీతోనో రోజును ప్రారంభిస్తున్నారు. దానిలో ఉండే కెఫీన్ వల్ల మనం ఉదయాన్నే కాస్త ఉత్సాహంగా పనులు మొదలు పెట్టగలం అనుకుంటున్నాం. నిజానికి అవిచ్చే కిక్ అలాంటిది మరి. అందుకే చాలా మంది వీటిని తాగకపోతే ఉండలేరు. ఏదో వెలితిగా ఉన్న భావనతో ఉంటారు. అయితే రోజుకు అసలు ఎంత వరకు కెఫీన్ తీసుకోవచ్చు. ఇది లేకుండా దీనంత ఉత్సాహంగా మనల్ని ఉంచే ఆహారాలేమిటి? అలవాట్లేమిటి? తెలుసుకుందాం రండి.
ఎంత మోతాదు వరకు కెఫిన్ తీసుకోవచ్చు :
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. రోజుకు నాలుగు వందల మిల్లీ గ్రాముల వరకు కెఫీన్‌ని తీసుకోవడం శ్రేయస్కరం. అంటే మూడు నుంచి నాలుగు కప్పుల వరకు కాఫీని తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది విష పదార్థంగా మనలో పని చేస్తుంది. ముందుగా జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. తర్వాత మరెన్నో అనారోగ్యాలకు ఇది కారణం అవుతుంది. కాబట్టి కాఫీ, టీలను తాగే వారు ఈ మోతాదు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కెఫీన్‌కు బదులుగా మనల్ని ఉత్సాహంగా ఉంచే పదార్థాలు :
మనకు టీనో, కాఫీనో తాగాలని అనిపించినప్పుడల్లా ఆరోగ్యకరమైన సలాడ్ల వైపు మొగ్గు చూపాలి. పాల కూర, బచ్చలి కూర, క్యాబేజ్, కీర దోసకాయ, అరటి పండ్లు, యాపిల్, కమలా పండ్లు.. తదితరాలతో చేసిన సలాడ్లను తీసుకుంటూ ఉండాలి. సన్నగా కోసి పెట్టుకున్న ముక్కలపై కాస్త ఉప్పు, నిమ్మరసం చల్లుకుని తినేయొచ్చు. రక రకాల రుచులు కలబోసిన ఇలాంటి సలాడ్లు మన పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో నీటి శాతం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇలాంటి సలాడ్లతో పాటుగా ఎక్కువగా నీటినీ తాగుతూ ఉండాలి. కడుపు నిండుగా ఉంటే కాఫీల్లాంటివి తాగాలని ఎక్కువగా అనిపించదు.
కెఫీన్‌కి బదులుగా మనల్ని ఉత్సాహంగా ఉంచే అలవాట్లు :
మనం ఎక్కువ ఒత్తిడి, ఆందోళనలతో ఉన్నప్పుడు కాఫీ, టీల్లాంటి వాటిని ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది. అవి తాగితే కాస్త ఒత్తిడి తగ్గినట్లుగా అనిపిస్తుంది. అందుకనే ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిద్ర అలవాట్లను సరి చేసుకోవడం లాంటి విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ అలవాట్లు మనల్ని రోజంతా మరింత ఉత్సాహంగా ఉంచడంలో సహకరిస్తాయి. ప్రయత్నించి చూడండి.