Ready To Eat Salads: రెడీ టు ఈట్‌ సలాడ్లు ఆరోగ్యానికి మంచివేనా?-disadvantages of eating ready to eat salads and tips for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ready To Eat Salads: రెడీ టు ఈట్‌ సలాడ్లు ఆరోగ్యానికి మంచివేనా?

Ready To Eat Salads: రెడీ టు ఈట్‌ సలాడ్లు ఆరోగ్యానికి మంచివేనా?

HT Telugu Desk HT Telugu
Sep 07, 2023 09:21 AM IST

Ready To Eat Salads: సలాడ్లు ఆరోగ్యానికి మంచివని అవి చేసుకునే సమయం లేక రెడీ టూ ఈట్ సలాడ్లు తింటున్నాం. అవి ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివో తెలుసుకోండి.

రెడీ టూ ఈట్ సలాడ్
రెడీ టూ ఈట్ సలాడ్ (pexels)

కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారు అలా బయటకి వెళ్లినప్పుడు కూరగాయల సలాడ్లను లేకపోతే ఫ్రూట్‌ సలాడ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని దుకాణాల్లో ఈ సలాడ్లను ఉదయాన్నే ముక్కలు కట్‌ చేసేసి చిన్న చిన్న కప్పుల్లో సర్ది డిస్‌ప్లేలో పెడుతుంటారు. అలాగే పెద్ద పెద్ద మాల్స్‌లో కూరగాయలు ముక్కలు తరిగి పెట్టి, ప్యాక్ చేసి అమ్మకానికి పెడతారు. వాటి పక్కనే రెడీ టూ ఈట్‌ సలాడ్లనూ అమ్మకానికి పెడుతుంటారు. తినడానికి తేలికగా అందుబాటులో ఉంటాయని వీటిని చాలా మంది కొనుక్కుని పట్టుకెళుతుంటారు. అసలు ఈ రెడీ టు ఈట్‌ సలాడ్లు ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుని ఈ సలాడ్లను తింటుంటే గనుక దీన్ని తప్పకుండా చదివేయండి.

బ్యాక్టీరియాలు ఉన్నాయి! :

కొన్ని ప్రముఖ ఫుడ్ జర్నల్స్‌లో వచ్చిన వార్తల ఆధారంగా చూస్తే ఇలా ముందే కత్తిరించి పెట్టిన సలాడ్లలో బ్యాక్టీరియాలు పెరిగిపోయే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో అమ్మకానికి పెట్టాలి కాబట్టి చాలా మంది మనుషులు వీటిని కత్తిరించాల్సి ఉంటుంది. వారు చేతులను శుభ్రం చేసుకున్నారా లేదా? ప్యాకింగ్‌ చేసేప్పుడు సరైన భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా? అనే విషయాల ఆధారంగా ఆ సలాడ్‌ కాలుష్యం అయి ఉందా? లేకపోతే సరైనదా? అనే విషయం ఆధారపడుతుంది. మార్కెట్లలో దొరికే కొన్ని సలాడ్లను తీసుకొచ్చి పరీక్షలు చేసినప్పుడు చాలా వాటిలో బ్యాక్టీరియా కంటెంట్‌ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఆ బ్యాక్టీరియాల్లో వ్యాధులను సంక్రమింపజేసేవీ ఉండటాన్ని గుర్తించారు.

ఫుడ్‌ పాయిజనింగ్‌ అవకాశాలున్నాయి! :

శాస్త్రవేత్తలు తీసుకున్న అన్ని శాంపుళ్లలోనూ దాదాపుగా ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉండటంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటి రెడీ టు ఈట్‌ సలాడ్లను తినడం కంటే తినకపోవడమే మంచిదని సూచించారు. ఇలాంటి వాటిని తినడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్ అయ్యే అవకాశాలుంటాయని తెలిపారు. అవి ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి కొన్ని వాయువుల్ని వాడతారు. అది కూడా ఒక కారనమే. అంతేకాకుండా వీటి వల్ల మరెన్నో ఆరోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమాదాలు ఉంటాయని చెప్పారు. అందుకనే బయట ఎక్కడైనా ఇలాంటి సలాడ్లను తినాలన్నా, కొని తెచ్చుకోవాలన్నా పునరాలోచించుకోవాలన్నారు. బదులుగా ఇంట్లో అప్పటికప్పుడు తరుక్కుని తినే సలాడ్లే ఉత్తమమంటూ సలహా ఇస్తున్నారు.

ఇంట్లో సలాడ్ చేసుకునేటపుడు ఈ జాగ్రత్తలు:

పచ్చి కూరగాయలు, ఆకుకూరల్నే సలాడ్లలో వాడతాం కాబట్టి. వాటిని సరిగ్గా శుభ్రం చేశామని నిర్ధరించుకోవాలి. వాటిని తాజాగా ఉండటం కోసం రిఫ్రిజిరేటర్ లో భద్రపరుచుకోవాలి. మీరు సలాడ్ తినే కొద్దిసేపు ముందు మాత్రమే వాటిని కట్ చేసుకోవాలి. ఒకవేళ బయట రెస్టారెంట్లలో ఇచ్చే టమాటాలు, ఉల్లిపాయ ముక్కల సలాడ్ ఇచ్చినా కూడా అది తాజాదేనని నిర్ధరించుకోవాలి. లేదంటే పోషకాలు అందకపోగా అనారోగ్యపాలవుతాం.

Whats_app_banner