Sweet with Toast: టోస్టులతో నోరూరించే హల్వా రెసిపీ.. దేంతో చేశారో ఎవ్వరూ గుర్తుపట్టలేరు
Sweet with Toast: చాలా మంది ఇళ్లలో టోస్టు లేదా రస్క్ తప్పకుండా ఉంటాయి. మీకు సమయం లేనప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ టోస్ట్ వాడి కమ్మటి హల్వా చేయొచ్చు. తక్కువ సమయంలో టోస్ట్ హల్వా ఎలా చేయాలో చూడండి.
టోస్టులతో హల్వా
బ్రెడ్‌తో చేసే డబల్ కా మీఠా చాలా సార్లు తినే ఉంటారు. కానీ ఈ టోస్ట్ హల్వా దానికి భిన్నం. దానికన్నా ఇంకా సులభం కూడా. నాలుగైదు టోస్టులు ఉంటే చాలు. రుచికరమైన హల్వా రెడీ అవుతుంది. ఉన్నట్లుండి ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు, పిల్లలు ఏదైనా కావాలన్నప్పుడు తక్కువ సమయంలో అయిపోయే బెస్ట్ స్వీట్ రెసిపీ ఇది.
టోస్ట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
6 టోస్టులు (ఏ ఫ్లేవర్ లేని రకం ఎంచుకుంటే మేలు)
ఒకటిన్నర కప్పుల నీళ్లు
సగం కప్పు పంచదార
పావు కప్పు నెయ్యి
రెండు చెంచాల జీడిపప్పు
రెండు చెంచాల ఎండుద్రాక్ష
అరటీస్పూన్ యాలకుల పొడి
టోస్ట్ హల్వా తయారీ విధానం:
- ముందుగా టోస్ట్ లేదా రస్క్‌లను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పొడి మరీ మెత్తగా ఉండకూడదు.ఈ పొడి లావు రవ్వలాగా, అక్కడక్కడా ముక్కలతో ఉండాలని గుర్తుంచుకోండి. ఒకట్రెండు సార్లు అలా తిప్పితే చాలు.
- ఇప్పుడు ఒక అడుగు మందం ఉన్న కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి.
- నెయ్యి వేడెక్కాక జీడిపప్పు ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక ఒక పల్లెంలోకి తీసుకోండి.
- అదే నెయ్యిలో ఎండుద్రాక్ష కూడా వేసుకుని ఉబ్బితే బయటకు తీసేయండి.
- అదే నెయ్యిలో రస్క్ పొడిని వేసుకోండి. అడుగంటకుండా, మాడకుండా సన్నం మంట మీద ఈ పొడిని నెయ్యిలో బాగా వేయించాలి.
- కాసేపటికి కాస్త ముదురు రంగులోకి పొడి మారిపోతుంది. ఈ పొడిని ఒక పల్లెం లోకి తీసుకోండి.
- అదే కడాయిలో ఒకటిన్నర కప్పుల నీళ్లు, పంచదార వేసుకుని కలిపి స్టవ్ వెలగించండి. మీడియం మంట మీద చిక్కని పాకం అయ్యేదాకా కలపండి. యాలకుల పొడి కూడా వేసి కలపండి.
- వెంటనే వేయించి పెట్టుకున్న టోస్టు పొడి కూడా వేసేయండి. బాగా కలిపి డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసి కలియబెట్టి స్టవ్ కట్టేయండి చాలు. టోస్ట్ హల్వా రెడీ.
టాపిక్