Kaju garlic pickle: జీడిపప్పు వెల్లుల్లి ఆవకాయ.. ఒక్కసారి తిన్నారంటే మరో ఆవకాయ నచ్చదు..
Kaju garlic pickle: జీడిపప్పు, వెల్లుల్లితో చాలా తక్కువ సమయంలో ఊరగాయ రెడీ అవుతుంది. మంచి టిప్స్ ఫాలో అయి చేస్తే మీకిది ఫేవరైట్ ఊరగాయ అయిపోతుంది. ఇంకే ఆవకాయ అక్కర్లేదు.
జీడిపప్పు అంటేనే మంచి రుచి. ఎన్నైనా తినేస్తాం. దాంతో ఏ వంటకం చేసినా బాగుంటుంది. కానీ ఊరగాయ చేయొచ్చని మాత్రం చాలా మందికి తెలీదు. ఇది తెలుగు వారి వంటకమే. జీడిపప్పు, వెల్లుల్లిని మసాలాల్లో ఊరబెడితే జీడిపప్పు, వెల్లుల్లి ఊరగాయ తయారవుతుంది. ఏ కూర చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఊరగాయ కలుపుకుని అన్నం మొత్తం తినేయొచ్చు. వేడివేడి అన్నంలో ఈ ఊరగాయ, కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే అమోఘంగా ఉంటుంది. ఇంతా ఊరించే ఈ ఊరగాయ తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. తయారీ మాత్రం చాలా సులువు. పదంటే పదే నిమిషాలు చాలు.
వెల్లుల్లి జీడిపప్పు ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు జీడిపప్పు (సగంగా చేసిన ముక్కలు తీసుకోవాలి)
సగం కప్పు వెల్లుల్లి రెబ్బలు
1 టీస్పూన్ మెంతుల పొడి
2 పెద్ద సైజు నిమ్మకాయలు
2 చెంచాల కారం
2 చెంచాల ఉప్పు
1 చెంచా ఆవాల పొడి
2 చెంచాల నూనె
సగం చెంచా ఆవాలు
సగం చెంచా మినప్పప్పు
సగం చెంచా శనగపప్పు
2 ఎండుమిర్చి
1 కరివేపాకు రెమ్మ
వెల్లుల్లి జీడిపప్పు ఊరగాయ తయారీ విధానం:
1. ముందుగా నిమ్మకాయల్ని కట్ చేసుకుని గింజలు లేకుండా నిమ్మరసం పిండుకుని పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే ఆవపొడి ఇంట్లో లేకపోతే కొన్ని ఆవాలను కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే చాలు.
3. అలాగే వెల్లుల్లి రెబ్బలకు పొట్టు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం వేసుకోవాలి. దాంట్లోనే కారం, ఆవాల పొడి, మెంతుల పొడి, ఉప్పు వేసుకోవాలి.
5. అన్నీ బాగా కలిసిపోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
6. అందులోనే జీడిపప్పు పలుకులు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటికి మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడొక కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి.
8. ఈ తాలింపు చల్లారిపోయాక జీడిపప్పు మిశ్రమంలో కలిపేసుకోవాలి. అంతే.. వెల్లుల్లి జీడిపప్పు ఊరగాయ రెడీ అయినట్లే.
ఈ ఊరగాయను వెంటనే వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తినేయొచ్చు. కానీ జీడిపప్పు, వెల్లుల్లి మసాలాలతో బాగా ఊరితేనే రుచి బాగుంటుంది. అందుకే రెండు లేదా మూడ్రోజులాగి తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఒకవేళ మీరు వెంటనే ఈ ఊరగాయ చేసి సర్వ్ చేయాలి అనుకుంటే.. జీడిపప్పు, వెల్లుల్లిని పచ్చిగా వేయకూడదు. చెంచా నూనె వేసుకుని జీడిపప్పు, వెల్లుల్లిని బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి. వాటిని ఊరగాయలో వేసుకుంటే వెంటనే తినేయొచ్చు. ఈ రుచి కాస్త వేరేలా ఉంటుంది.
పచ్చి జీడిపప్పు వాడి మసాలాలో ఊరిన తర్వాత తింటే మెత్తగా కారంగా వెల్లుల్లి ఫ్లేవర్‌తో ఉంటాయి. అలాగే మీ ఇష్టానుసారం దీంట్లో జీడిపప్పు ఎక్కువగా, వెల్లుల్లి కాస్త తక్కువగా వేసుకున్నా పరవాలేదు. రుచిలో మార్పుండదు. వెల్లుల్లి లేకుండా కేవలం జీడిపప్పుతోనే కూడా కొన్ని చోట్ల ఈ ఊరగాయ చేసుకుంటారు.