Soya Chaaps: నాన్‌వెజ్ కన్నా రుచిగా ఉండే వెజ్ సోయాచాప్స్.. ఇంట్లోనే చేసేయండి-how to make soya chaaps recipe at home in simple way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soya Chaaps: నాన్‌వెజ్ కన్నా రుచిగా ఉండే వెజ్ సోయాచాప్స్.. ఇంట్లోనే చేసేయండి

Soya Chaaps: నాన్‌వెజ్ కన్నా రుచిగా ఉండే వెజ్ సోయాచాప్స్.. ఇంట్లోనే చేసేయండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 14, 2024 05:30 PM IST

Soya Chaaps: సోయాచాప్స్ బయట మార్కెట్లో కొనుక్కుని తెచ్చుకుంటున్నాారా? అక్కర్లేదు.. ఈ పద్ధతిని ఫాలో అయిపోండి. రుచికరమైన సోయాచాప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

సోయా చాప్స్
సోయా చాప్స్

సోయాచాప్స్ చూడ్డానికి ఐస్ క్రీముల్లాగా ఉంటాయి. కానీకాదు.. వాటిని మీల్ మేకర్, సోయాబీన్ ఉపయోగించి తయారు చేస్తారు. ముట్టుకుంటే మెత్తగా ఉంటాయి. వీటిని సూపర్ మార్కెట్లలో ఫ్రీజ్ చేసి అమ్ముతారు. నేరుగా వీటితో కూర వండేయొచ్చు. అలాకాకుండా కాస్త ఓపిక ఉంటే ఇంట్లోనే సోయాచాప్ తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే ఒక పది సార్లయినా రకరకాల వంటలు వీటితో చేయొచ్చు. రుచికరమైన సోయా చాప్ గ్రేవీ కర్రీ, సోయా చాప్ తందూరీ, సోయా చాప్ 65..ఇలా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. 

సోయా చాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు సోయాబీన్

సగం కప్పు మీల్ మేకర్ లేదా సోయా చంక్స్

1 కప్పు మైదా

1 చెంచా ఉప్పు

20 ఐస్ క్రీం పుల్లలు

సోయా చాప్స్ తయారీ విధానం:

1. ముందుగా సగం కప్పు సోయాను రాత్రంతా నానబెట్టుకోవాలి. సోయాబీన్ కనీసం 8 గంటల పాటూ నానితేనే సోయాచాప్ రుచి బాగుంటుంది.

కొన్నిసార్లు సోయాబీన్ బదులుగా సోయాబీన్ పిండిని వాడి వీటిని తయారు చేస్తారు. అంటే సోయాబీన్ నానబెట్టే పని ఉండదు. కానీ సరైన రుచి రావాలంటే నానబెట్టిన సోయాలనే వాడాలి.

2. సోయాబీన్ నానిన తర్వాత సోయాచాప్ తయారు చేసుకునే పది నిమిషాల ముందు మీల్ మేకర్ ను వేడి నీళ్లలో కనీసం అయిదు నిమిషాల పాటూ ఉడికించుకోవాలి. అవి చాలా మెత్తగా అయిపోవాలి.

3. మీల్ మేకర్‌ను వేడి నీళ్లలో నుంచి తీసేసి గట్టిగా పిండేసుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి.

4. చల్లారాక ఈ మీల్ మేకర్ ను మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టాలి.

5. అలాగే నానబెట్టుకున్న సోయాబీన్ నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మీల్ మేకర్ మిశ్రమంలో కలిపేసుకోవాలి.

6. అందులోనే కప్పు మైదా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకుని గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. దీంతో చపాతీలు ఒత్తుకోగలగాలి.

7. ఈ పిండిని అయిదు నిమిషాల పాటూ పక్కన పెట్టుకోవాలి. వెంటనే చిన్న సైజు ఉండలు చేసుకుని చపాతీల్లాగా ఒత్తుకోవాలి. కొద్దిగా మైదా చల్లుకుంటూ సన్నగా ఒత్తుకోవాలి.

8. ఈ చపాతీ మీద కాస్త దూరం వదులుకుంటూ చాకుతో పొడవుగా గాట్లు పెట్టుకోవాలి. వీటిని ఐస్ క్రీం పుల్లలకు చుట్టుకోవాలి. ఒక్క పుల్లకు ఒక వరుసే చుట్టుకోవాలి. అయితేనే తొందరగా ఉడుకుతాయి. ఎక్కువ చుట్లు చుట్టుకుంటే సమయం కాస్త ఎక్కువ పడుతుంది.

9. ఇప్పుడు కాస్త లోతు ఎక్కువున్న పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్లు పోసుకుని మరిగేదాకా వేడిచేయాలి.

10. వేడి నీళ్లలో చుట్టి పెట్టుకున్న సోయా చాప్ పుల్లలు ఒక్కోటి వేసుకోవాలి. కనీసం పావుగంట సేపు ఉడికించుకుంటే సోయా చాప్స్ రెడీ అయినట్లే. వాటిని బయటకు తీసి చల్లటి నీళ్లలో వేసుకోవాలి.

11. పూర్తిగా చల్లారాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని వెంటనే ఏదైనా వంట కోసం వాడుకోవచ్చు. లేదంటే జిప్ లాక్ బ్యాగులో వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటూ వాడుకోవచ్చు.

టాపిక్