raw banana bajji: అరటికాయ బజ్జీలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్..-how to make raw banana bajji or aratikaya bajji with tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Banana Bajji: అరటికాయ బజ్జీలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్..

raw banana bajji: అరటికాయ బజ్జీలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్..

Koutik Pranaya Sree HT Telugu
Jul 07, 2024 03:30 PM IST

raw banana bajji: అరటికాయతో చేసే బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వాటిని కొన్ని టిప్స్ తో చేస్తే నూనె పీల్చుకోవు. వాటి తయారీ ఎలాగో చూసేయండి.

అరటికాయ బజ్జీ
అరటికాయ బజ్జీ

వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అయితే ఒకసారి అరటికాయ బజ్జీలు చేసేయండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. కొన్ని చిట్కాలు పాటించి చేస్తే బజ్జీలు నూనె పీల్చుకోవు. వీటిని బజ్జీలాగా నేరుగా తినేయొచ్చు. కాస్త చట్ పటా ఫ్లేవర్ రావాలంటే చాట్ లాగానూ చేయొచ్చు. అదెలాగో, దీనికోసం కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి. 

అరటికాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు:

2 అరటికాయలు

కప్పున్నర్ శనగపిండి

2 చెంచాల బియ్యంపిండి

1 చెంచా కారం

1 చెంచా ఉప్పు

పావు టీస్పూన్ పసుపు

1 టీస్పూన్ జీలకర్ర

డీప్ ఫ్రై కి సరిపడా నూనె

2 చెంచాల వేడి నూనె

స్టఫ్ఫింగ్ కోసం:

2 చెంచాలు నూనెలో వేయించిన పల్లీలు

1 ఉల్లిపాయ సన్నం ముక్కలు

సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు

అరటికాయ బజ్జీ తయారీ విధానం:

  1. ముందుగా అరటికాయల్ని కడిగేసుకుని పైనున్న చెక్కు చాకు సాయంతో తీసేయాలి. చెక్కు మొత్తం తీసేయకుండా కాస్త ఆకుపచ్చబాగం ఉండేలాగా చూడండి. పూర్తిగా అరటికాయ లోపలిభాగం కనబడేదాకా తొక్క తీయక్కర్లేదు.
  2. ఇప్పుడు వాటిని అడ్డంగా లేదా నిలువుగా సన్నం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  3. ఒక బౌల్ ‌లో శనగపిండి, బియ్యంపిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపాక రెండు చెంచా వేడి చేసిన నూనె పోసుకుని మరోసారి కలపాలి.
  4. ఇప్పుడు కొద్దకొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి జారుడుగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే తరిగిపెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేయాలి.
  5. స్టవ్ పెట్టుకుని కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక్కో అరటికాయ ముక్కకు పిండి అంటుకునే లాగా చూసి నూనెలో వేసుకోవాలి.
  6. మీడియం మంట మీద వాటిని వేయించుకుని రంగు మారగానే బయటకు తీసుకోవాలి. పెద్ద మంట మీద చేస్తే లోపల అరటికాయ వేగదని గుర్తుంచుకోండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
  7. చాట్ లాగా సర్వ్ చేయాలి అనుకుంటే.. ఈ బజ్జీ మధ్యలో గాటు పెట్టాలి. అందులో వేయించిన పల్లీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కారం చల్లుకుని సర్వ్ చేయొచ్చు. దీంతో రుచి మరింత పెరుగుతుంది. 

శనగపిండితో పాటూ బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీ కరకరలాడుతుంది. అలాగే పిండి కలిపేటప్పుడు వేడి నూనె వేయడం వల్ల బజ్జీలు నూనె ఎక్కువగా పీల్చుకోవు. అలాగే అరటికాయ ముక్కల్ని మరీ మందంగా కట్ చేసుకోకండి. సన్నగా ఉంటే తొందరగా ఉడికిపోతాయి. బజ్జీ తింటున్నప్పుడు పచ్చిదనం రుచి తెలీదు.

 

Whats_app_banner