Riceflour Panki: గుజరాతీ వంటకం పాన్‌కీ.. బియ్యంపిండితో ఇలా చేసేయండి..
Riceflour Panki: వైరల్ గుజరాతీ డిష్ పాన్‌కీ రెసిపీ అల్పాహారంలోకి అదిరిపోతుంది. దీన్ని చాలా తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో చూడండి.
పాన్‌కీ (shutterstock)
ప్రతిరోజూ అల్పాహారంలో ఏదో ఒక రుచికరమైన, కొత్త ఆహారం తినాలని ఉంటుంది. రోజూ ఏం చేయాలా అని ఆలోచించాల్సి వస్తుంది. ఆరోగ్యాన్నిచ్చి, తక్కువ నూనెతో రెడీ అయిపోయే ఈ గుజరాతీ వంటకం పాన్‌కీ ఒకసారి చేసి చూడండి. అరటి ఆకులమీద వీటిని ఆవిరి మీద ఉడికించి తయారు చేస్తారు. వాటి కోసం కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.
పాన్‌కీ తయారీకి కావలసిన పదార్థాలు
రెండు కప్పుల బియ్యప్పిండి
అరకప్పు పెరుగు
ఉప్పు రుచికి తగినంత
ఒక టీస్పూన్ జీలకర్ర
టీస్పూన్ ముద్దగా తరిగిన అల్లం
టీస్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ లేదా సన్నటి ముక్కలు
రెండు టీస్పూన్ల వెల్లుల్లి ముద్ద
చిటికెడు ఇంగువ
పావు టీస్పూన్ పసుపు
పావు చెంచా నెయ్యి
3-4 అరటి ఆకులు
అరటి ఆకులకు రాసుకోడానికి నూనె
పాన్‌కీ తయారీ విధానం:
- ముందుగా అరటి ఆకులను శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు వడిచిపోయాక వాటిని రెండు మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి. అరచేతి కన్నా పెద్దగా వాటి సైజు ఉంటే సరిపోతుంది.
- ఇప్పుడొక వెడల్పాటి పాత్రలో బియ్యంపిండి, పెరుగు, ఉప్పు, మూడు కప్పుల గోరువెచ్చని నీళ్లు పోసుకుని చిక్కటి పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా అస్సలు ఉండకూడదు.
- ఇప్పుడు ఈ పాత్ర మీద మూత పెట్టి కనీసం మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత మూత తీసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకోవాలి.
- తర్వాత జీలకర్ర కాస్త దంచుకుని వేయాలి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసేయాలి. చివరగా చెంచా నెయ్యి కూడా వేసుకుని బాగా కలియబెట్టాలి. పిండిని కలపడానికి విస్కర్ వాడితే ఇంకా మంచిది.
- ఇప్పుడు అరటి ఆకును తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. మీద సగం గరిటెడు పిండి తీసుకుని అట్టు లాగా వేసుకోవాలి.
- మీద మరో అరటి ఆకుతో కప్పేయాలి. ఇలా పిండినంతా అరటి ఆకుల్లో పెట్టేసుకోవాలి. ఒక్కో పాన్‌కీ చేయడానికి రెండు అరటి ఆకు ముక్కలు అవసరం అవుతాయన్నమాట.
- ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని కింద నీళ్లు పోసి మీద ఒక పాత్రలో ఈ అరటి ఆకులను వేసుకోవాలి. ఇంట్లో స్టీమర్ ఉంటే దాన్ని వాడొచ్చు. మూత పెట్టుకుని ఆకులు రంగు మారేంత వరకు ఉడికించాలి.
- ఆకులను ఒకసారి బయటకు తీసి లోపల పిండి మిశ్రమం అట్టులాగా, అతుక్కోకుండా వచ్చేస్తే పాన్‌కీ రెడీ అయినట్లే. దీన్ని ఏదైనా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.