Energy bar: బెస్ట్ ఎనర్జీ బార్స్ రెసిపీ.. ఉదయాన్నే ఒక్కటి తింటే పిల్లల్లో, పెద్దల్లో పోషక లోపమే రాదు
Energy bar: ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ కలిపి పోషకాలు నిండిన ఎనర్జీ బార్స్ చేసేయొచ్చు. వీటిలో పంచదార కూడా వాడకుండా ఆరోగ్యకరంగా తయారు చేస్తాం.
ఎనర్జీ బార్ రెసిపీ (pinterest)
రోజంతా శక్తినిచ్చే ఎనర్జీబార్ ఇంట్లోనే చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. దీంతో శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ కూడా లభిస్తుంది. ఉదయాన్నే ఈ ఒక్క బార్ తింటే శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందినట్లే. కడుపూ నిండుతుంది.
ఎనర్జీ బార్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఎండు ఖర్జూరం
1 కప్పు జీడిపప్పు
సగం కప్పు బాదాం
పావు కప్పు వాల్‌నట్
పావు కప్పు నువ్వులు
పావు కప్పు పల్లీలు (వేయించినవి)
పావు కప్పు ఉప్పులేని పిస్తా
పావు కప్పు గుమ్మడి గింజలు
సగం కప్పు తేనె
పావు టీస్పూన్ యాలకుల పొడి
సగం కప్పు ఓట్స్
ఎనర్జీ బార్ తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెలో వేడినీళ్లు తీసుకుని అందులో ఖర్జూరం వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి.
- తర్వాత చేత్తో గింజలు తీసేసి నీళ్లు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో జీడిపప్పు, వాల్ నట్, పిస్తా, నువ్వులు, గుమ్మడి గింజలు, బాదాంపప్పు, పల్లీలు వేసుకోండి.
- స్టవ్ సన్నం మంట మీద పెట్టుకుని వీటన్నింటినీ ఒకేసారి వేయించుకోవాలి.
- ఒక్క అయిదు నిమిషాలు వేయించారంటే వాటిలో తేమ పోయి కాస్త క్రిస్పీగా అవుతాయి.
- మీకు కొబ్బరి రుచి నచ్చితే పావు కప్పు కొబ్బరి తురుము కూడా ఇప్పుడే వేసి వేయించేయండి. లేదంటే వదిలేయొచ్చు.
- ఇవన్నీ ఒక పాత్రలోకి తీసుకుని చల్లారబెట్టండి.
- అదే కడాయిలో ఓట్స్ కూడా వేసుకుని వేయించండి. ఒక అయిదు నిమిషాలు ఆగితే మంచి వాసన వస్తాయి. అప్పుడు స్టవ్ కట్టేసి చల్లారాక మిక్సీ పట్టుకోండి.
- ఇప్పుడు కడాయిలో మిక్సీ పట్టుకున్న ఖర్జూరం ముద్ద వేసుకుని చిక్కబడేదాకా కలుపుతూ ఉండండి.
- నీరంతా ఇంకిపోయి చిక్కబడ్డాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలపాలి.
- స్టవ్ కట్టేసి తేనె కూడా పోసుకుని మరోసారి కలియబెట్టాలి.
- తీపి కోసం ఖర్జూరం ముద్ద, తేనె సరిపోతాయి. ఇక పంచదార వేయాల్సిన అవసరం అస్సలుండదు. ఇందులోనే ఓట్స్ పొడి కూడా వేసి బాగా కలపండి.
- అన్నీ కలిసి మంచి ముద్దలాగా అయిపోతాయి.
- ఇప్పుడు ఒక ట్రేలో ఈ మిశ్రమాన్ని అంతా తీసుకోవాలి. కాస్త చల్లారాక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- గట్టిపడ్డాక చాకు సాయంతో పొడవాటి ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నారంటే ఎనర్జీ బార్స్ రెడీ అయినట్లే.
ఈ ఎనర్జీ బార్స్ కోసం డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టకుండా అలాగే వాడితే.. తినేటప్పుడు మంచి క్రంచీ ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ పిల్లల కోసం చేస్తే వాళ్లకు మరింత నచ్చాలంటే ఒకసారి మిక్సీలో తిప్పండి. కచ్చాపచ్చాగా అయిపోతాయి.