senagapindi rava idli: శనగపిండి, రవ్వతో ఇన్స్టంట్ ఇడ్లీలు.. 5 నిమిషాల్లో రెడీ..-how to make breakfast recipe senagapindi rava idli ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Senagapindi Rava Idli: శనగపిండి, రవ్వతో ఇన్స్టంట్ ఇడ్లీలు.. 5 నిమిషాల్లో రెడీ..

senagapindi rava idli: శనగపిండి, రవ్వతో ఇన్స్టంట్ ఇడ్లీలు.. 5 నిమిషాల్లో రెడీ..

senagapindi rava idli: శనగపిండి, రవ్వతో ఇడ్లీలు ఇన్స్టంట్ గా చేసుకోవచ్చే. వీటిని ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం.

శనగపిండి, రవ్వ ఇడ్లీలు

రవ్వ, శనగపిండి కలిపి చేసే ఈ ఇన్స్టంట్ ఇడ్లీలు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ ఇడ్లీలకు మినప్పప్పు వాడము. కేవలం శనగపిండి, రవ్వ కలిపి తయారు చేస్తాం. ఈ పిండి పులియాల్సిన అవసరం కూడా లేదు. రుచిలో మామూలు ఇడ్లీకన్నా చాలా తేడా ఉంటుంది. ఇడ్లీలు ఒకేలా తినడం ఇష్టపడని వాళ్లకి ఇది మంచి ఆప్షన్. ఈ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో వివరంగా చూసేయండి.

శనగపిండి, రవ్వ ఇడ్లీల తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు శనగపిండి

సగం కప్పు సన్నం రవ్వ

సగం కప్పు పెరుగు

1 చెంచా ఫ్రూట్ సాల్ట్

1 చెంచా పసుపు

1 చెంచా నిమ్మరసం

సగం చెంచా పంచదార పొడి

1 చెంచా నూనె లేదా నెయ్యి

సరిపడా ఉప్పు

పావు టీస్పూన్ ఆవాలు

కరివేపాకు ఆకులు గుప్పెడు

2 పచ్చిమిర్చి తరుగు

గుప్పెడు కొత్తిమీర తరుగు

శనగపిండి, రవ్వ ఇడ్లీల తయారీ విధానం:

1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, కప్పు సన్నం రవ్వ, సగం కప్పు పెరుగు, పసుపు, పంచదార పొడి, నిమ్మరసం, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.

2. ఒక కప్పు దాకా నీళ్లు పోసుకుని కలుపుకుండే పిండి మరీ పలుచగా ఉండదు. ముద్దలా ఉండదు. అవసరమనుకుంటేనే ఇంకొన్ని నీళ్లు పోసుకోండి.

3. బాగా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని పావుగంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి.

4. పావుగంట తర్వాత తీసి ఒక చెంచా నూనె, చెంచా ఫ్రూట్ సాల్ట్ వేసుకోండి. ఒక నిమిషం పాటూ వేగంగా ఒక చెంచాతో పిండిని కలుపుతూ ఉండండి.

5. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని నెయ్యి లేదా నూనె రాసుకోండి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పోసుకోండి.

6. ఇడ్లీ కుక్కర్ ఉంటే దాంట్లో ఈ పాత్రల్ని పెట్టేయండి. ఆవిరి మీద ఉడికిస్తే కనీసం పావుగంట సేపు ఇడ్లీలు ఉడకాలి.

7. ఒకసారి చెంచాతో గుచ్చి చూస్తే పిండి అంటుకోకపోతే ఇడ్లీలు రెడీ అయినట్లే. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

8. ఒక కడాయిలో చెంచా నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. చిటపటలాడాక కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వేగనివ్వాలి.

9. కొత్తిమీర కూడా వేసి నిమిషం మూత పెట్టి ఈ తాలింపును ఇడ్లీల మీద వేసి సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ మీకిష్టం ఉంటే ఈ తాలింపులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. దాంతో రుచి మరింత బాగుంటుంది. మసాలా ఇడ్లీలా అనిపిస్తుంది. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు. లేదంటే ఈ తాలింపును ఇడ్లీ పిండిలో ముందే కలిపేసి ఇడ్లీలు చేసుకోవచ్చు.