Idli Manchurian: పిల్లలకు నచ్చేలా ఇడ్లీ మంచూరియన్ దీని రెసిపీ చాలా సులువు
Idli Manchurian: ఇడ్లీ పేరు చెబితే ఎక్కువమంది పిల్లలు ముఖం ముడుచుకుంటారు, కానీ ఇలా ఇడ్లీ మంచూరియన్ చేసి పెట్టండి. బ్రేక్ ఫాస్ట్‌లో అదిరిపోతుంది.
Idli Manchurian: పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ఇడ్లీని తినిపిస్తున్నారా? పిల్లలకు త్వరగా బోర్ కొట్టేసే అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ మంచూరియన్ చేసి పెడుతూ ఉండండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది. పైగా చట్నీ కూడా అవసరం లేదు. కాబట్టి స్నాక్స్‌లాగా తినేస్తారు. ఇడ్లీని అల్పాహారంలో తింటే ఆరోగ్యానికి మంచిది. అలా అని పిల్లలు ప్రతిరోజూ ఇడ్లీని తినలేరు. అందుకే ఇడ్లీ మంచూరియన్ రెసిపీని ఇక్కడ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించి చూడండి.

ఇడ్లీ మంచూరియన్ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఇడ్లీలు - అయిదు
టమోటో - ఒకటి
చింతపండు - చిన్న ఉండ
గరం మసాలా పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - అర ముక్క
పచ్చిమిర్చి - రెండు
పసుపు - అర స్పూను
నూనె - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
ఆవాలు - అర స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఇడ్లీ మంచూరియన్ రెసిపీ
1. ముందుగా ఇడ్లీలను వండి పెట్టుకోవాలి. వాటిని తీసి ప్లేట్లో వేసుకొని ముక్కలుగా కోసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనెను వేయాలి. మంటను మధ్యస్థంగా ఉంచాలి.
3. అందులో జీలకర్ర, ఆవాలను వేసి వేయించాలి.
4. అవి చిటపటలాడాక టమోటో తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోవాలి.
5. చింతపండును మూడు స్పూనుల నీటిలో నానబెట్టుకోవాలి.
6. నూనెలో వేసినవన్నీ వేగాక చింతపండు పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు అది దగ్గరగా ఇగురులాగా అవుతుంది.
8. అందులో గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
9. టమాటాలు మెత్తగా మారి ఇగురులాగా అయ్యాక ఉప్పును వేసి కలుపుకోవాలి.
10. ఆ మిశ్రమంలో ముందుగా కోసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను వేసి కలుపుకోవాలి.
11. అది పొడిపొడిగా అయ్యేవరకు స్టవ్ మీద ఉంచి తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి.
12. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే ఇడ్లీ మంచూరియన్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
13. దీన్ని తినేందుకు ప్రత్యేకంగా చట్నీ అవసరం లేదు. పిల్లలు ఒక్కసారి తిన్నారంటే దీన్ని ఇష్టంగా తింటారు.
ఉదయం పూట అల్పాహారంలో ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఇడ్లీలను పెట్టే తల్లులు ఎక్కువ. ప్రతిరోజూ ఇడ్లీ పెడితే పిల్లలకు బోర్ కొట్టవచ్చు. అలాంటివారికి ఇడ్లీ మంచూరియన్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇవి స్నాక్స్ లాగా అనిపిస్తాయి. అలాగే పిల్లలకు బలాన్ని ఇస్తాయి. వీటిని చేయడం చాలా సులువు. ఇడ్లీలను వండుకొని ముందుగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీ రెడీగా ఉంటే పది నిమిషాల్లో ఇడ్లీ మంచూరియా చేసేయొచ్చు. ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నించండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.
టాపిక్