21 vegetable curry: గణేషునికి నివేదించే 21 కూరగాయలతో కూర తయారీ.. ఏమేం కూరగాయలు వాడతారంటే-how to make 21 vegetables curry for ganesh chathurthi naivedyam ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  21 Vegetable Curry: గణేషునికి నివేదించే 21 కూరగాయలతో కూర తయారీ.. ఏమేం కూరగాయలు వాడతారంటే

21 vegetable curry: గణేషునికి నివేదించే 21 కూరగాయలతో కూర తయారీ.. ఏమేం కూరగాయలు వాడతారంటే

Koutik Pranaya Sree HT Telugu
Sep 07, 2024 11:30 AM IST

21 vegetable curry: వినాయక చవితి రోజున చాలా చోట్ల 21 కూరగాయలతో చేసిన కూరను వినాయకునికి నైవేద్యంగా పెడతారు. దాని తయారీ విధానం ఏంటో వివరంగా చూసేయండి.

21 కూరగాయలతో కూర
21 కూరగాయలతో కూర

వినాయక చవితి రోజున 21 అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. 21 రకాల పూలు, 21 పత్రాలు, 21 మోదుకలు, 21 ఉండ్రాళ్లు, కుడుములు.. ఇలా ప్రతిదీ 21 అనే సంఖ్యతో ముడిపడి ఉంటాయి. అలాగే ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో 21 కూరగాయలు కలిపి చేసే కూరను వినాయకునికి తప్పకుండా నివేదించే ఆచారం ఉంటుంది. ఈ కూర తయారీ ఎలాగో చూసేయండి. అలాగే ఈ కూర తయారీకి సాధారణంగా వెల్లుల్లి, ఉల్లిపాయలను వాడరని గుర్తుంచుకోండి.

21 కూరగాయలతో కూర తయారీకి కావాల్సినవి:

2 కప్పుల 21 కూరగాయల ముక్కలు

(21 కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు. క్యారట్, బటానీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, టమాటా, బంగాళదుంప, బెండకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, బీన్స్, పచ్చిమిర్చి, పొట్లకాయ, కొత్తిమీర, క్యాబేజీ, దొండకాయ..లాంటివన్నీ కొద్దికొద్దిగా తీసుకుని ముక్కలుగా కోసుకుని ఈ కూర కోసం వాడతారు.)

2 చెంచాల కొబ్బరి తురుము

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా ధనియాల పొడి

1 చెంచా నువ్వుల పొడి

అరచెంచా కారం

పావు టీస్పూన్ జీలకర్ర

పావు టీస్పూన్ ఆవాలు

చిటికెడు ఇంగువ

1 చెంచా గరం మసాలా

అరచెంచా ఉప్పు

అరచెంచా పసుపు

3 చెంచాల వంటనూనె

మసాలా కోసం:

గుప్పెడు కొత్తిమీర

గుప్పెడు పుదీనా ఆకులు

అల్లం

పచ్చిమిర్చి

21 కూరగాయలతో కూర తయారీ విధానం:

  1. ముందుగా మసాలా కోసం కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి.
  2. కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక ఆవాలు , జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటమన్నాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని వేయించాలి.
  3. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇంగువ, పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి.
  4. టమాటా మెత్తబడ్డాక కూరగాయలన్నీ వేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి.
  5. ఇప్పుడు కొబ్బరి తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని మరో పది నిమిషాలు ఉడికించాలి.
  6. ఒక కప్పు నీళ్లు పోసుకుని ఉడికిస్తే కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి.
  7. చివరగా ఇంగువ, నువ్వుల పొడి, గరం మసాలా కూడా వేసుకుని మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి.
  8. కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే కూర సిద్దం అయినట్లే.