Tomato Biryani: టమాటాలతో కమ్మటి బిర్యానీ ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ
Tomato Biryani: టమాటాలతో కమ్మని బిర్యానీ చేసుకోవచ్చని తెలుసా? అటు బిర్యానీ తిన్న అనుభూతి, సింపుల్ గా చేసేశాం అనిపించాలంటే ఈ టమాటా బిర్యానీ ప్రయత్నించండి. చాలా రుచిగానూ, కొత్తగానూ ఉంటుంది.
టమాటా బిర్యానీ (pinterest)
బిర్యానీ అంటేనే బోలెడు సామాగ్రి కావాలి. అందుకే దాన్ని సమయం ఉన్నప్పుడే చేస్తారు. కానీ టమాటాలతో చేసే వెజ్ బిర్యానీ కోసం ఎక్కువ కూరగాయలూ అక్కర్లేదు. రెండు ఉల్లిపాయలు, టమాటాలుంటే ఈ టమాటా బిర్యానీ చేసుకోవచ్చు. దీని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
టమాటా బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
4 పెద్ద టమాటాలు, ముక్కలుగా కట్ చేసుకోవాలి
2 కప్పుల బాస్మతీ బియ్యం
2 ఉల్లిపాయలు, సన్నటి ముక్కలు
చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద
2 పచ్చిమిర్చి చీలికలు
4 చెంచాల నూనె లేదా నెయ్యి
అంగుళం దాల్చిన చెక్క ముక్క
3 యాలకులు
1 చెంచా కారం
1 టీస్పూన్ పసుపు
1 టీస్పూన్ గరం మసాలా
అర టీస్పూన్ పంచదార
అరకప్పు కొత్తిమీర తరుగు
అరకప్పు పుదీనా ఆకులు, తరుగు
టమాటా బిర్యానీ తయారీ విధానం:
- ముందుగా బాస్మతీ బియ్యం శుభ్రంగా కడుక్కోవాలి. దాన్ని నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి.
- వాసన వచ్చాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమర్చి ముక్కలు వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి.
- ఇప్పుడు కారం, ఉప్పు, పంచదార, పసుపు వేసుకుని కలుపుకోవాలి. టమాటా పులుపుదనం, పంచదార కలిసి మంచి రుచి వస్తుంది. మీకు నచ్చకపోతే పంచదార వేసుకోకండి.
- టమాటా ముక్కలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి.
- ముక్కలు మెత్తబడ్డాక కొత్తిమీర, పుదీనా తరుగు వేసి ఒకసారి కలిపితే బిర్యానీ మసాలా రెడీ అయినట్లే.
- ఇప్పుడు ముందు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుని ఒకసారి కలియబెట్టాలి. మీకు కొబ్బరి పాలు నచ్చితే, అందుబాటులో ఉంటే అవి ఒక కప్పు వేసుకుంటే ఈ బిర్యానీ రుచి బాగుంటుంది. లేదంటే మామూలు నీళ్లు పోసుకోండి.
- కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకుని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తే టమాటా బిర్యానీ రెడీ అవుతుంది.
- రైతా లేదా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.
టాపిక్