Rainbow meditation: ఇంద్రధనస్సులో ఏడు రంగులు.. వీటితో చేసే ధ్యాన ప్రక్రియతో లాభాలెన్నో..-how to do rainbow meditation know its benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rainbow Meditation: ఇంద్రధనస్సులో ఏడు రంగులు.. వీటితో చేసే ధ్యాన ప్రక్రియతో లాభాలెన్నో..

Rainbow meditation: ఇంద్రధనస్సులో ఏడు రంగులు.. వీటితో చేసే ధ్యాన ప్రక్రియతో లాభాలెన్నో..

Koutik Pranaya Sree HT Telugu
Jun 26, 2024 06:30 PM IST

Rainbow meditation: ఇంద్ర ధనస్సులో ఉండే రంగుల ఆధారంగా చేసే ధ్యానం విధానం పేరు రెయిన్ బో మెడిటేషన్. దాన్నెలా చేయాలో, దాని వల్ల లాభాలేంటో చూడండి.

రెయిన్ బో మెడిటేషన్
రెయిన్ బో మెడిటేషన్ (pexels)

ధ్యానం అంటే శ్వాస మీద ద్యాస పెట్టడం. ఆలోచనలు మన నియంత్రణలో ఉంచుకుని ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనమీద మనకు స్పష్టత వస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం చేయడానికి చాలా రకాల విధానాలుంటాయి. వాటిలో ఒకటి ఈ రెయిన్ బో మెడిటేషన్. దీనివల్ల మనసు మన అదుపులో ఉంటుంది. దాన్నెలా చేయాలో కూడా తెల్సుకోండి. కేవలం ఏడు నిమిషాలు కేటాయిస్తే నిర్మలమైన మనసు మీ సొంతమవుతుంది.

రెయిన్ బో మెడిటేషన్ అంటే ఏమిటి?

పేరులో ఉన్నట్లుగా రెయిన్ బో లేదా ఇంద్ర ధనస్సులో ఉండే రంగుల ఆధారంగా ఈ ధ్యానం చేయాలి. VIBGYOR ఈ పదం ఇంద్రధనస్సులో ఉండే రంగుల్ని సూచిస్తుందని తెల్సిందే. రెడ్ (ఎరుపు), ఆరంజ్, యెల్లో (పసుపు), గ్రీన్ (ఆకుపచ్చ), బ్లూ (నీలం), ఇండిగో(ఊదా), వయోలెట్.. ఇలా ఇంధ్ర దనస్సులో ఉండే ఏడు రంగుల్ని వెనకనుంచి చదివితే వాటి రంగుల క్రమం తెలుస్తుంది. వీటిని ఊహించుకుంటూ రెయిన్ బో ధ్యానం చేయాలి.

రెయిన్ బో మెడిటేషన్ చేసే పద్ధతి:

  1. ముందుగా మీకు సౌకర్యంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. సుఖాసనంలో వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి.
  2. మెల్లగా కళ్లు మూసుకుని మీరు ఈ ధ్యానం నుంచి ఏం పొందాలనుకుంటున్నారో ఆలోచించండి. ఒత్తిడి తగ్గించుకోవాలన, ఏదైనా బాధ తగ్గించుకోవాలనో, ఏదైనా లక్ష్యం మీద దృష్టి పెట్టే శక్తి మీకు రావాలనో.. ఇలా ఏదో ఒక లక్ష్యంపెట్టుకుని కళ్లు మూసుకోండి.
  3. ఆకాశంలో అందంగా మెరుస్తూ వేళాడుతున్న ఇంద్ర ధనస్సును ఊహించుకోండి. మీ కళ్లముందు ఆ సుందర దృశ్యం కదలాడాలి.
  4. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. అలా ఒక అయిదు సార్లు చేయండి.
  5. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఎరుపు రంగును ఊహించుకోండి. ఈ రంగు గురించి మాత్రమే ఆలోచిస్తూ మీ శరీరాన్ని శాంతపర్చుకోండి. మీ శరీరాన్ని అనుభూతి పొందుతూ ఆనందించండి.
  6. ఇప్పుడు మరోసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆరెంజ్ రంగును ఊహించుకోండి. ఈ రంగును ఊహిస్తూ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఆలోచించండి.
  7. ప్రతి రంగును ఊహిస్తు కనీసం నిమిషం పాటూ అలా ఉండిపోండి.
  8. ఇప్పుడు దీర్ఘశ్వాస తీసుకుని గాలి పీలుస్తూ పసుపు రంగును ఊహించండి. మీ కళ్ల ముందు పసుపు రంగు పరుచుకున్నట్లు మాత్రమే కనిపించాలి. ఇంకేమీ కనిపించొద్దు. మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ తుడిచేయండి. మెదడును ప్రశాంతంగా ఉంచుకోండి.
  9. ఇప్పుడు ఆకుపచ్చ రంగును ఊహిస్తూ మీలో మీరే ఏకాంతాన్ని వెతుక్కోండి. మీరొక్కరే ఉన్నట్లుగా, ఈ ప్రపంచం మీదేననే అనుభూతి పొందండి.
  10. నీలిరంగును ఊహించుకుంటూ మీ మనసును ప్రేమతో నింపేసుకోండి. మీకిష్టమైన, మీరు ప్రేమించే మనుషులెవరో తల్చుకోండి.
  11. ఊదారంగు తలుచుకుంటూ మీలో ఎవ్వరికీ తెలియని విషయాలేంటో, మీ గురించి మీకు మాత్రమే తెల్సిన ప్రత్యేకతలను తల్చుకోండి. మీరెంత ప్రత్యేకమో గుర్తు చేసుకోండి.
  12. వయోలెట్ రంగును ఊహిస్తూ ఏ ఊహాలేనంత హాయిగా ఉండండి. ఏమీ ఆలోచించకండి. లోతైన ప్రశాంతతలోకి మీ మనసును తీసుకెళ్లండి.
  13. ఇప్పుడు మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి ఆలోచించండి. మీ నుంచి మీరే స్పూర్తి పొందండి. లక్ష్యాన్ని సాధించే శక్తి మీలో ఉందని గ్రహించండి.

ఇప్పుడు ఈ ఒక్కో రంగును ఊహిస్తూ మీ ఊహల్లో నుంచి బయటకు రండి. చివరగా మీకు పూర్తిగా ఆకాశంలో మెరుస్తున్న ఇంద్రధనస్సు కనిపించాలి. మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సంపూర్ణత్వాన్ని అనుభవించండి. కేవలం ఏడు నిమిషాలు కేటాయించి మీ మెదడును ఈ రెయిన్ బో మెడిటేషన్ తో డిటాక్స్ చేసుకోండి. రెయిన్ బో మెడిటేషన్‌ను కూడా చాలా రకాల విధానాలు అవలంబిస్తూ చేయొచ్చు.

Whats_app_banner