First impression tips: తొలి చూపులోనే ఎదుటి వ్యక్తిని ఆకర్షించడం ఎలా? పెళ్లి చూపులకైనా, ఇంటర్వ్యూకు అయినా ఇవే టిప్స్
First impression tips: మొదటి చూపులోనే ఒక వ్యక్తిని ఆకర్షించడం సాధ్యమే. దానికోసం మన వ్యక్తిత్వంలో, తీరులో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీంతో పెద్ద ఇంటర్వ్యూలు అయినా, పెళ్లి చూపులైనా మంచి మార్కులు పడతాయి.
మొదటి పరిచయంలో ఎదుటి వ్యక్తి మీమీద ఒక అభిప్రాయం ఏర్పర్చుకోడానికి ఎంత సమయం పడుతుందో తెల్సా? కేవలం సెకనులో పదో వంతు కాలం. అంత తొందరగా ఒక వ్యక్తికి మీద ఓ పైపైన అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే మీరు ముఖ్యమైన వ్యక్తిని మొదటిసారి కలుస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వీటితో ఎదుటి వ్యక్తిని ఆకర్షించడమే కాకుండా, మీరంటే మంచి అభిప్రాయమూ ఏర్పడుతుంది.పెళ్లి చూపులయినా, పెద్ద అధికారిక మీటింగులైనా, ఇంటర్వ్యూలయినా మీరు పాటించాల్సినవి ఇవే.
మీ దృష్టి:
ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల కళ్లల్లోకి చూసి మాట్లాడండి. మీ నిజాయతీని ఇది తెలిసేలా చేస్తుంది. మొహమాటంతో పక్కకు చూసి మాట్లాడటం అస్సలు సరికాదని గుర్తుంచుకోండి. దానివల్ల చెడు అభిప్రాయం కలగకపోయినా మంచి మార్కులు మాత్రం పడవు.
నవ్వు:
సందర్భాన్ని బట్టి, మీరు మాట్లాడుతున్న విషయం బట్టి, వ్యక్తిని బట్టి నవ్వటం ముఖ్యమే. గట్టిగా, పెద్దగా నవ్వక పోయినా మీ ముఖంలో చిరునవ్వు ఉండటం మంచిది.
కమ్యునికేషన్:
ఎదుటివ్యక్తి ఎంత మాట్లాడితే దానికన్నా మనం ఎక్కువగా మాట్లాడేయాలి అనుకోవడం ముమ్మాటికీ తప్పు. ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడటం మంచి అలవాటు. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత ఏకాగ్రతతో ఉంటే వాళ్లకు అంత ఎక్కువ విలువ ఇస్తున్నట్లు. మీరు వారు చెబుతున్నది వింటున్నట్లు ఎదుటి వ్యక్తికి అర్థం అవుతుంది. మీతో మాట్లాడాలనే ఇష్టం పెరుగుతుంది.
మధ్యలో ఆపడం:
ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నది మీకు తప్పనిపిస్తే వెంటనే వారిని ఆపేయకండి. పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. లేదంటే వాళ్లని మాట్లాడనివ్వడం లేదనే అభిప్రాయం వస్తుంది. మీలో ఉన్న ఓపిక, సహనాన్ని ఇది తెలిసేలా చేస్తుంది.
ఆహార్యం:
మీకు ఫ్యాషన్ గురించి, స్టైలింగ్ గురించి పెద్దగా ఆసక్తి లేకపోవచ్చు. కానీ, మీరు కలవబోయే వ్యక్తిని బట్టి తప్పకుండా మీ డ్రెస్సింగ్ ఉండాలి. ఫార్మల్స్, క్యాజువల్స్, బట్టల రంగు.. ఇలా సందర్బాన్ని బట్టి ఎంచుకోవాలి.
నటన వద్దు:
మీరు తీసుకునే జాగ్రత్తలు మిమ్మల్ని ఎదుటి వ్యక్తి తప్పుగా అనుకోకూడదనే విషయంలో మాత్రమే తప్ప మిమ్మల్ని మీరు వేరుగా చూయించుకోడానికి కాదు. మీరు మీలాగే ఉండాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు స్పష్టంగా తెలియజేయాలి. మీకు ఏ ప్రశ్నకైనా జవాబు తెలియకపోయినా, జవాబు చెప్పడం ఇష్టం లేకపోయినా వివరంగా తెలియజేయండి. అంతేకానీ ఇబ్బంది పడకూడదు. మీ వ్యక్తిత్వం విషయంలో ఎలాంటి ముసుగులు వద్దు.
స్పష్టత:
మీరు కలవబోయే వ్యక్తిని బట్టి ముందుగానే కొన్ని విషయాల్లో సంసిద్ధం అవ్వాలి. ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?, ఎలాంటి సంభాషణ జరగొచ్చు ?.. లాంటివి ముందే ఊహించి మీ సమాధానాలు కొద్దిగా అయినా ఆలోచించుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు ఆ తేడా తప్పకుండా తెలుస్తుంది. అనవసరంగా ఎక్కువగా మాట్లాడకూడదు. ఏ ప్రశ్నకు ఎంత సమాధానం, ఎలాంటి సమాధానం మంచిదనే ఆలోచన తప్పనిసరిగా ఉండాలి.
ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటే ఎదుటివ్యక్తికి మీమీద మంచి అభిప్రాయం కలగజేసే విషయంలో సాయం చేస్తాయి. సందర్బం బట్టి ఇలాంటి వాటికి సంసిద్ధం కావాలి.