Dental Care Tips । అందమైన చిరునవ్వు కోసం ఆణిముత్యాల లాంటి దంత సంరక్షణ చిట్కాలు!
Dental Care Tips: దంతాలు రంగు మారడం, నోటి దుర్వాసన, నోటి ఆరోగ్యం మొదలైన అన్ని సమస్యలకు దంత వైద్యులు సిఫారసు చేసిన సంరక్షణ చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
అందమైన చిరునవ్వు ఉండాలంటే దంతాలు మిళమిళ మెరుస్తూ, చక్కని అమరికలో ఉండాలి. లేదంటే మూతి ముడుచుకొని అరనవ్వే నవ్వాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా అద్దంలోకి చూసుకుని, మీ చిరునవ్వును గమనించారా? పళ్లు పసుపు రంగులో, దంతాలలో సమస్యలు, చిగుళ్ల వాపు ఉంటే గనక మీ రోజువారీ నోటి సంరక్షణ దినచర్యను సవరించవలసిన సమయం ఆసన్నమయినట్లే. మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం. బలమైన తెల్లని దంతాలు, ఆరోగ్యకరమైన చిగుళ్ళు, నోటి నుంచి తాజా శ్వాస అనేవి మీ నోటి ఆరోగ్యానికి సంకేతాలు. ఇవే మీ నోటి పరిశుభ్రతను తెలియజేసే ముఖ్యమైన అంశాలు.
సెలబ్రిటీ డెంటిస్ట్, ముంబైలోని హౌస్ ఆఫ్ టూత్ వ్యవస్థాపకురాలు డాక్టర్ క్షమా చందన్, మీ దంత సంరక్షణ చర్యలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. మీ నోటి పరిశుభ్రత కోసం "బ్రష్, ఫ్లాస్, రిన్స్ , రిపీట్" అనే మంత్రం గుర్తుంచుకోవాలని ఆమె చెబుతోంది.
Oral Health, Dental Care Tips- నోటి ఆరోగ్యం, దంతాల సంరక్షణ చిట్కాలు
మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి, శ్వాసను తాజాగా ఉంచడానికి, మీ చిరునవ్వు తెల్లగా అలాగే మీ దంతాలను ప్రకాశవంతంగా ఉండటానికి డాక్టర్ క్షమా సిఫారసు చేసిన సంరక్షణ చర్యలు ఇక్కడ తెలుసుకోండి.
1. రోజూ రెండుసార్లు పళ్ళు తోముకోవాలి
మీ దంతాలను ప్రతిరోజూ రెండుసార్లు, ఉదయం అలాగే రాత్రి, కనీసం రెండు నిమిషాల పాటు, సరైన బ్రషింగ్ టెక్నిక్‌తో బ్రష్ చేయండి. మీ టూత్ బ్రష్‌ను మీ చిగుళ్లకు 45-డిగ్రీల కోణంలో పట్టుకోండి. మీ దంతాల పైభాగంలో, పక్కలకు అన్ని కోణాలలో బ్రష్ చేయండి. అలాగే మీరు రోజు ఆహారాన్ని నమిలే మీ దంతాల ఉపరితలాలను, లోపలి భాగాలను తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
2. టూత్ బ్రష్ ఎంపిక
మనకు మార్కెట్లు చాలా రకాల టూత్ బ్రష్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే అన్ని టూత్ బ్రష్‌లలో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లేదా చిన్న హెడ్, మృదువైన బ్రిసెల్స్ కలిగిన టూత్ బ్రష్‌ను ఎంచుకోవాలని దంత వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ రెండు రకాలు కాకుండా ఇతర రకాల టూత్ బ్రష్‌లు కఠినంగా ఉంటాయి, అవి దంతాలపై ఉండే ఎనామెల్‌ను దెబ్బతీస్తాయి. ఇంకా, మీ టూత్ బ్రష్‌ను ప్రతి 3-4 నెలలకోసారి తప్పకుండా మార్చాలి. ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా అనారోగ్యం పాలయితే, అప్పుడు కూడా టూత్ బ్రష్ అదే వాడకుండా కొత్తది ఉపయోగించాలని సూచిస్తున్నారు.
3. క్రమం తప్పకుండా ఫ్లాస్ చేయండి
బ్రషింగ్‌తో పాటుగా దంతాలను క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయాల్సిందే. దంతాల సందులలో టూత్ బ్రష్ చేరుకోలేదు. అయితే ప్లాసింగ్ చేయడం వలన ఇరుకైన ఖాళీలలో కూడా దంతాలు శుభ్రపడతాయి. ముఖ్యంగా మాంసాహారం వంటివి తిన్నప్పుడు దంతాలలో ఇరుక్కుంటాయి ఇవి కుళ్లిపోయినపుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది, మీ దంతాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మీ దంతాలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కనీసం రోజుకు ఒక్కసారైనా ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఫ్లాస్ చేయండి. 18-20 అంగుళాల పొడవు గల ఫ్లాస్ తీగను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు.
ఫ్లాస్ చేయడం కష్టంగా ఉన్నవారికి లేదా సున్నితమైన చిగుళ్ళు ఉన్నవారు వాటర్ గ్లోసర్ ఉపయోగించడం సరైన ఎంపిక. వాటర్ గ్లోసర్ మొత్తం ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. ఇది దంత ఫలకం, ఆహార కణాలు, బ్యాక్టీరియాను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది.
4. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్
మీ రోజువారీ ఓరల్ కేర్ రొటీన్‌లో మౌత్‌వాష్‌ని ఉపయోగించడం చాలా మేలు చేస్తుంది. ఇది మీ నోటిలో నివసించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా అదనపు రక్షణగా పనిచేస్తుంది. మౌత్‌వాష్ మీ నోటిలోని పగుళ్లు, మృదు కణజాలంలోకి చేరి దుర్వాసన, దంత క్షయాన్ని నివారిస్తుంది. ఉదయం, రాత్రి బ్రష్ , ఫ్లాసింగ్ చేసిన వెంటనే మీ మౌత్ వాష్‌ను ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది.
5. మీ నాలుకపై కొంత శ్రద్ధ పెట్టండి
మీ దంతాలు, చిగుళ్ళ శుభ్రత మాత్రమే కాదు, మీ నాలుక కూడా నోటి దుర్వాసనకు కారణమయ్యే వివిధ రకాల బ్యాక్టీరియాకు ఆతిథ్యం ఇవ్వగలదు. కొన్ని టూత్ బ్రష్‌లలో తల వెనుక భాగంలో టూత్ స్క్రాపర్ ఉంటుంది. ఆ ప్రాంతం మీ నాలుకను శుభ్రం చేయడానికి, బ్యాక్టీరియాను తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీ నాలుకను స్క్రాప్ చేయడం మీ రోజువారీ దంత సంరక్షణ దినచర్యలో భాగంగా ఉండాలి. మీరు ఈ అలవాటును ఎంత ఎక్కువగా పాటిస్తే, మీ నోరు అంత శుభ్రంగా ఉంటుంది.
నోటి పరిశుభ్రతను కూడా మీ మొత్తం శరీర ఆరోగ్యంలో అంతర్భాగం. ఇక్కడ సూచించిన విధంగా దంత పరిశుభ్రత చిట్కాలను అనుసరించడం ద్వారా మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, ఎలాంటి నోటి సమస్యలు మీకు ఎదురు కావు.
సంబంధిత కథనం
టాపిక్