Flossing Teeth | బ్రష్ చేయడమే కాదు, దంతాలను ఫ్లాసింగ్ కూడా చేయాలి!
మీరు మాంసం తింటారా? అయితే ఫ్లాసింగ్ తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజూ టూత్ బ్రష్ ఎలా అయితే చేస్తారో ఫ్లాసింగ్ కూడా అలవాటు చేసుకోవాలని డెంటిస్టులు అంటున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
ఫ్లాసింగ్ అనేది దంతాలను శుభ్రం చేసుకునే ఒక పద్ధతి. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాల కణాలు కొన్నిసార్లు టూత్ బ్రష్ చేసుకున్నప్పటికీ తొలగిపోవు. ఇలాంటి సందర్భంలో లేదా టూత్ బ్రష్ చేరుకోలేని మూలాల్లోకి సన్నని తంతువులతో కూడిన త్రాడును ఉపయోగించి పళ్ల సందుల్లో ఇరుకున్న ఆహారం, దంత ఫలకాన్ని తొలగించుకోవడాన్ని ఫ్లాసింగ్ అంటారు. నోటి ఆరోగ్యంలో కాపాడుకోవడానికి ఫ్లాసింగ్ చేయమని దంతవైద్యులు సిఫారసు చేస్తారు.
నోటి పరిశుభ్రతకు సంబంధించి ఫ్లాసింగ్ చేసుకోవడం ఒక మంచి అలవాటు. మాంసాహారం తినేవారు ఫ్లాసింగ్ చేసుకోవడం చాలా మంచిది. మాంసం తిన్నప్పుడు పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. దీంతో చాలా మంది టూత్ పిక్స్ ఉపయోగించి తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పళ్ల మధ్య సందు మరింత పెరుగుతుంది. అయితే ఫ్లాసింగ్ ఇందుకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఇది దంతాల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తేలికగా శుభ్రపరుస్తుంది. నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. దంతాలపై ఉండే ఫలకాన్ని తొలగిస్తుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధి రాకుండా నివారించవచ్చు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫ్లాసింగ్ చేయమని దంతవైద్యులు సిఫారసు చేస్తారు.
ఫ్లాసింగ్ ఎలా చేయాలి?
ఫ్లాసింగ్ చేసేటపుడు ఏదో మొక్కుబడిగా కాకుండా సరైన రీతిలో చేయాలి. ఫ్లాసింగ్ సరిగ్గా చేయకుంటే దంతాలు, చిగుళ్ళకు హాని కలగవచ్చు. కాబట్టి సరైన ఫ్లాస్ త్రాడును ఎంచుకోండి. 18 నుండి 24 అంగుళాల డెంటల్ ఫ్లాస్‌ను కత్తిరించి. మీ బొటనవేలు, చూపుడు వేలుకు ఫ్లాస్‌ను చుట్టి ప్రతి పంటికి రెండు వైపులా రుద్దుతూ, ఫ్లాస్‌ను మెల్లగా పైకి క్రిందికి గ్లైడ్ చేయండి. మీ చిగుళ్ళ లోపలి దాకా ఫ్లాస్‌ను గ్లైడ్ చేయవద్దు.
టూత్ బ్రష్ చేయకముందు ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాస్ చేయడం వలన దంతాల మధ్య ఇరుకున్న ఆహార కణాలు బయటకు వస్తాయి, వదులుగా అవుతాయి. ఇప్పుడు బ్రష్ చేయడం వలన ఈ కణాలు మీ నోటి నుండి ఈ కణాలు తొలగిపోతాయి.
ప్రతిరోజూ టూత్ బ్రష్ చేస్తున్నట్లే ఫ్లాసింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. రోజుకు ఒకసారి లేదా ప్రత్యామ్నాయ రోజులలో ఫ్లాసింగ్ చేసుకోవాలని నిపుణులు సిఫారసు చేశారు.
సంబంధిత కథనం