Parenting Tips : పిల్లలను తల్లిదండ్రుల విడాకులు ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటే
Divorce Affect Children : తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా, శారీరకంగాను ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి.
పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితిలో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా?
ముఖ్యంగా పిల్లల వయస్సు 6 నుండి 12 సంవత్సరాల మధ్య ఉంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయస్సులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు. కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయస్సులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు.
ముఖ్యం గా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయస్సులో తల్లిదండ్రులు పిల్లలను పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక సమస్యలు
తల్లిదండ్రుల విడాకుల వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, కోపం, విచారం, భయం వంటి భావాలను అనుభవిస్తారు. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పవచ్చు. నిన్నటి దాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది.
అభద్రతా ఫీలింగ్
తల్లిదండ్రుల విడాకులు పిల్లల్లో భద్రతా భావాన్ని బలహీనపరుస్తుందని మీకు తెలుసా. ఇంట్లో వాతావరణం పిల్లలకు ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో వారు అభద్రతా భావానికి గురవుతున్నారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగా ఫోకస్ చేయలేరు. చేసినా మధ్యలోనే వదిలివేస్తారు.
చదువు దెబ్బతింటుంది
తల్లిదండ్రుల విడాకులు పిల్లల చదువుపై కూడా ప్రభావం చూపుతాయి. అలాగే క్లాసులో సరిగ్గా ఏకాగ్రత పెట్టలేరు. ఇది వారికి కష్టంగా ఉండవచ్చు. అసలు విషయానికొస్తే, వారికి చదువు పట్ల ఆసక్తి కొద్దికొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలలో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెబుతుంటే.. ఈ పిల్లల మనసుకు గాయం అవుతుంది.
తల్లిదండ్రులతో సమయం
తల్లిదండ్రుల విడాకుల తర్వాత, పిల్లలు తరచుగా తల్లిదండ్రులిద్దరితో తక్కువ సమయం గడపవలసి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు. వారి మధ్య సంబంధం దెబ్బతినవచ్చు. పెళ్లి, బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగవచ్చు.
భవిష్యత్తు దెబ్బతింటుంది
తల్లిదండ్రుల విడాకులు పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రుల్లాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడుతున్నారు. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. ఆత్మన్యూనత భావం ఎక్కువగా పెరుగుతుంది.
తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు ఉన్నాయి. జపాన్ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పని చేయాలి.