Malaika's beauty: యాభై ఏళ్ల లోనూ ముడతలు లేని చర్మం.. మలైకా ఫాలో అయ్యే సీక్రెట్ ఇదే-how malaika arora have flawless skin in 50s with wood therapy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Malaika's Beauty: యాభై ఏళ్ల లోనూ ముడతలు లేని చర్మం.. మలైకా ఫాలో అయ్యే సీక్రెట్ ఇదే

Malaika's beauty: యాభై ఏళ్ల లోనూ ముడతలు లేని చర్మం.. మలైకా ఫాలో అయ్యే సీక్రెట్ ఇదే

Koutik Pranaya Sree HT Telugu
Aug 18, 2024 07:00 AM IST

Malaika's beauty secret: మలైకా అరోరా అందానికి, ఆమె వయసుకు సంబంధం ఉండదు. ఎంతో యవ్వనంగా కనిపించే ఆమె చర్మ సౌందర్యానికి రహస్యం ఆమే పంచుకున్నారు. వుడ్ థెరపీని చర్మం మీద ముడతలు తగ్గించడానికి వాడతానన్నారు. ఇంతకీ ఈ థెరపీకి సంబంధించిన విషయాలు తెల్సుకోండి.

మలైకా బ్యూటీ సీక్రెట్
మలైకా బ్యూటీ సీక్రెట్ (Instagram)

బాలీవుడ్ సెలెబ్రిటీ మలైకా అరోరాను చూస్తే 50 ఏళ్ల వయసున్నట్లు ఉంటుందా? ఆమె చర్మం చాలా బిగుతుగా, యవ్వనంగా ఉంటుంది. దానికి కారణం ఖరీదైన క్రీములు, చికిత్సలు కాదట. సౌత్ అమెరికాకు చెందిన మాడెరో థెరపీ అనే టెక్నిక్ తన అందానికి రహస్యమని మలైకా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.దీన్నే వుడ్ థెరపీ అనీ అంటారు. 

వుడ్ థెరపీ అంటే?

మనింట్లో ఉండే అప్పడాల కర్ర లాంటి చెక్కతో చేసిన కట్టె ఒకటి దీనికోసం వాడతారు. దీన్ని వాడి చర్మం మీద ముడతలు తగ్గించేలా మర్దనా చేస్తారు. చాలా మంది మహిళల్లో వయసుతో పాటే తొడలు, పొత్తి కడుపు, పిరుదుల వద్ద చర్మం ముడతలుగా మారుతుంది. దీన్నే సెల్యులైట్ అంటారు. దీనివల్ల ఏ ఆరోగ్య సమస్యా లేదు. కానీ కొంతమంది దీన్ని కనిపించకుండా ఉండటానికి, అసౌకర్యంగా ఫీలయ్యి కొన్ని లోషన్లు, క్రీములు వాడతారు. దాంతో సమస్య కాస్త తగ్గుతుంది.

వుడ్ థెరపీలో కొన్ని రకాల కట్టెతో చేసిన పరికరాల్ని, ఆకారాల్ని వాడతారు. ముందుగా శరీరానికి నూనె లేదా ఏదైనా లోషన్ రాస్తారు. దాంతో కట్టెను చర్మం మీద కదిలించడం సులభం అవుతుంది. ఆ తర్వాత మర్దనా చేస్తారు.  కొన్ని ప్రత్యేక విధానాల్లో, రకరకాలుగా తిప్పుతూ చేసే ఈ మర్దనా కోసం కనీసం అరగంట నుంచి గంటైనా కేటాయించాల్సిందే. దీనివల్లే చర్మం యవ్వనంగా మారుతుంది. 

నాకూ ఆ సమస్యలున్నాయ్

అందరి లాగే మలైకా అరోరాకు కూడా సెల్యులైట్ సమస్య ఉంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. హార్మోన్ల మార్పులతో సమస్యలూ ఉన్నాయి. ఈ సమస్యలు తగ్గించడానికి, పూర్తి ఆరోగ్యం కోసం నేను ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానన్నారామె. ముఖ్యంగా చర్మం మీద ముడతలు తగ్గించుకోవడం కోసం గువా షా మర్దనాలు, వుడ్ థెరపీలు చేయించుకుంటానని చెప్పారు. 

వుడ్ థెరపీ లాభాలు:

  1. చర్మం కింది పొరల్లో పేరుకుపోయిన నీటి శాతాన్ని ఈ వుడ్ థెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు. దీంతో ముడతలు కాస్త తగ్గినట్లు కనిపిస్తాయి. 
  2. ఈ థెరపీలో చేసే మర్దనా వల్ల రక్త సరఫరా పెరగుతుంది. కొవ్వు కరుగుతుంది. 
  3. చర్మం నుంచి విష పదార్థాలు బయటకి పంపడంలో సాయపడుతుంది. 
  4. ఒత్తిడిని తగ్గిస్తుంది. 
  5. కండరాలకు విశ్రాంతిగా అనిపిస్తుంది. 
  6. చర్మం యవ్వనంగా మారుతుంది. 

మంచి ఆహారంలో చర్మాన్ని యవ్వనంగా మార్చుకోలేమా?

చర్మం యవ్వనంగా కనిపించడానికి వుడ్ థెరపీకి బదులుగా మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందా అనిపిస్తుందా. అది కొంత వరకు సాధ్యమే.  సరైన ఆహారం, వ్యాయామం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంలో ఉన్న ఉబ్బు తగ్గిస్తాయి. వీటితో పాటే మంచి క్రీములు, లోషన్లు ఎంచుకుంటే సమస్య తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీరెంచుకునే క్రీముల్లో రెటినాల్, కెఫీన్ ముఖ్య పదార్థాలుగా ఉండాలి.