Honda Activa Electric । యాక్టివా కంటే తక్కువ ధరకే హోండా ఎలక్ట్రిక్ స్కూటర్..!
హోండా టూవీలర్స్ తమ పాపులర్ మోడల్ అయినటువంటి హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ స్కూటర్ (Honda Activa Electric Version) ను విడుదల చేయనుంది. ఇది పెట్రోల్‌తో నడిచే యాక్టివా స్కూటర్ కంటే తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించేదిగా ఉండబోతుంది. వివరాలు చూడండి.
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా అనేక స్టార్టప్ కంపెనీలు పోటీపడీ మరీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో వివిధ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు కూడా తమ స్వంత బ్రాండ్ మీద ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు హోండా టూవీలర్ కూడా చేరబోతుంది.
హోండా ఇండియా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. హోండా మోటార్‌సైకిల్ -స్కూటర్ ఇండియా (HMSI) EV మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, వివిధ మోడళ్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే డిజైన్, పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పైన పేర్కొన్నట్లుగా హోండా వివిధ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనుంది. మొదటి సెగ్మెంట్ ఎలక్ట్రిక్ బైక్‌ల విషయానికి వస్తే ఇందులో 25కిమీ/గం గరిష్ట వేగంతో తక్కువ-స్పీడ్ EVలు ఉంటాయి. ఈ EVలను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. తదుపరిది ఎలక్ట్రిక్ మోపెడ్ సెగ్మెంట్, దీనిలో మోపెడ్‌లు 50కిమీ/గంకు పరిమిత వేగంతో ఉంటాయి.
హోండా నుంచి హోండా యాక్టివా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్. మొదటగా హోండా యాక్టివా మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు HMSI ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా ధృవీకరించారు. ఈ దశాబ్దం చివరి నాటికి హోండా బ్రాండ్ మీద ఒక మిలియన్ EVలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. హోండా యాక్టివాతో పాటు మరో రెండు మోడల్‌లను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోకి మార్చేందుకు లైన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
Honda Activa Electric Version అంచనాలు
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ చాలా తక్కువ ఫీచర్లతో మిడ్-రేంజ్ స్కూటర్ గా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. బజాజ్ చేతక్‌లో చూసినట్లుగా ఉంటుంది. యాక్టివా ఎలక్ట్రిక్ రెండు రైడింగ్ మోడ్‌లు, డిజిటల్ స్క్రీన్ ,పరిమిత కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 60 kmph వేగాన్ని కలిగి ఉంటుంది. ధర పరంగానూ ఎలక్ట్రిక్ వెర్షన్ యాక్టివా దాని ప్రామాణిక IC-ఇంజిన్ యాక్టివా కంటే తక్కువగానే ఉంటుంది. సుమారు, రూ. 72,000 నుంచి రూ. 75,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హోండా EV ఎప్పుడు లాంచ్ అవుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ, నివేదికల ప్రకారం మొదటి హోండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఏప్రిల్ 2023లో విడుదల చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం