Honda Activa Premium Edition । యాక్టివా స్కూటర్‌లో ప్రీమియం ఎడిషన్ విడుదల!
హోండా యాక్టివాలో ప్రత్యేక ప్రీమియం ఎడిషన్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది ఎక్స్-షోరూం వద్ద రూ.75,400/- ధరకు లభిస్తుంది. ప్రత్యేకతలు ఏమున్నాయో తెలుసుకోండి.
ద్విచక్ర వాహన తయారీదారు 'హోండా టూవీలర్స్ ఇండియా' తమ పాపులర్ స్కూటర్ హోండా యాక్టివాలో ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. ఎక్స్-షోరూం వద్ద ఈ స్కూటర్ ధర రూ.75,400/- గా ఉంది. డీలక్స్ మోడల్ తో పోలిస్తే ప్రీమియం ఎడిషన్ మోడల్ ధర రూ.1000 ఎక్కువగా ఉంది.
హోండా యాక్టివా 6Gలో చెప్పుకోవటానికి విజువల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కొత్తగా గోల్డెన్ వీల్స్, 3D గోల్డ్ ఫినిష్డ్ లోగో, బ్రౌన్ ఇన్నర్ బాడీతో పాటు సీట్ కవర్, ఫ్రంట్ ఆప్రాన్‌లో గోల్డెన్ యాక్సెంట్‌లు వచ్చాయి. ఈ మార్పులతో పాటుగా కొత్త కలర్ ఆప్షన్‌లు కూడా వచ్చాయి. ఆక్టివా 6G ప్రీమియం ఎడిషన్ ఇప్పుడు మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ అలాగే పర్ల్ సైరన్ బ్లూ అనే మూడు సరికొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
అయితే ఫీచర్లపరంగా ప్రీమియం ఎడిషన్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లను చేర్చలేదు. హార్డ్‌వేర్ అంశాలలో కూడా ఎలాంటి మార్పు లేకపోవటం గమనార్హం.
ఇంజన్ కెపాసిటీ
2022 Honda Activa 6G Premium Edition స్కూటర్లో 109.51cc ఇంజన్ ఉంటుంది. దీనిని CVT గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 7.68bhp శక్తిని అలాగే 8.79Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఈ స్కూటర్ 12-10-అంగుళాల వీల్ కాంబినేషన్‌పై నడుస్తుంది. రెండు చక్రాలు డ్రమ్ బ్రేక్‌ల సెటప్‌ను కలిగి ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున మోనోషాక్ అబ్జర్బర్ ఉన్నాయి.
ఇంజన్ స్టార్ట్-స్టాప్ స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సీటును తెరిచేందుకు డ్యూయల్-ఫంక్షన్ స్విచ్ మొదలైన అంశాలు చెప్పుకోదగినవి.
Honda Activa 6G Premium స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక హోండా డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.