dandruff in summer: వేసవిలో చుండ్రు సమస్య వేదిస్తోందా?
dandruff in summer: వేసవిలో కూడా చుండ్రు సమస్య వేధిస్తుంటే కొన్ని కారణాలు, ఇంట్లోనే చుండ్రు సమస్య తగ్గించే కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
వేసవిలో కూడా కొంతమందికి చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. తరచూ తలలోనే చేయిపెట్టడం, దురద.. ఈ సమస్యలు ఎండాకాలంలో కాస్త ఎక్కువుంటాయి. అలాంటపుడు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుని సమస్య పరిష్కరించుకోవచ్చు.
ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు:
- వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది.
- నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో సగం చెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి గంట తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.
- పెరుగు కూడా పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు.
- కలబంద గుజ్జును తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. కుదుళ్లకు బాగా రాసి అరగంట తరువాత తలస్నానం చేయాలి.
- పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ ను పావు కప్పు నీళ్లలో కలిపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయొచ్చు.
చుండ్రుకు కారణాలు:
చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
షాంపూను ఎక్కువగా వాడటం వల్ల మాడు పొడుబారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వస్తుంది.
జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల గాలి తగలక చుండ్రు సమస్య ఎక్కువవుతుంది.
ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. తప్పకుండా తల మీద ఎండపడకుండా ఏమైనా వాడాలి.
చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువ సార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది.
ఇవి పాటించాలి:
వారానికి మూడు సార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడునుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువవుతుంది.
తరచూ తల ముట్టుకోకూడదు. చుండ్రు వల్ల వచ్చే దురద వల్ల తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. సమస్య ఇంకాస్త పెరుగుతుంది.
ఎండాకాలంలో హెయిర్ స్టైలింగ్ కోసమని క్రీములు, స్ప్రేలు ఎక్కువగా వాడకూడదు. అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి.
వారానికి ఒకసారైనా కుదుళ్లకు మంచి మర్దనా చేసుకోవాలి. దీనివల్ల మంచి రక్త సరఫరా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది.