bride hair care: పెళ్లి సమయంలో జుట్టు సంరక్షణ ఇలా..
Summer hair care: పెళ్లి సమయంలో జట్టు విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకోండి.
పెళ్లి సమయంలో చర్మం సంరక్షణతో పాటూ జుట్టు సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెళ్లికి ముందునుంచే వివిధ కార్యక్రమాల కోసం జుట్టును స్టైలింగ్ చేయాల్సి వస్తుంది. జుట్టుకు తరచూ వేడి పరికరాలు వాడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో జుట్టుకు వేడివాడటం వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. తేమ, ఎండ, వేడి నుంచి జుట్టును కాపాడుకోడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. జుట్టును వివిధ హెయిర్ స్టైల్స్ పేరుతో వేడి చేస్తుంటే కొన్ని మెలకువలు తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే జుట్టు పొడిబారడం, పలుచగా ఈకల్లాగా అయిపోవడం, తొందరగా తెగిపోవడం లాంటి సమస్యలొస్తాయి.
ఎక్కువ వేడి:
కర్లింగ్, స్ట్రైటెనింగ్.. ఇంకేమైనా హెయిర్ స్టైల్ కోసం జుట్టుకు వేడి పరికరాలు వాడాల్సి వస్తుంది. అలాంటపుడు ఉష్ణోగ్రత విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు వేడి నియంత్రించ గలిగే ఆప్షన్ ఉన్న కర్లర్ లేదా స్ట్రైటెనర్ ని మాత్రమే ఎంచుకోండి. అలాగే ముందుగా జుట్టుకు హీట్ ప్రొటెక్టంట్ రాసుకోవడం మర్చిపోవద్దు. వేడి వల్ల జుట్టు పాడవకుండా ఇది కాస్త రక్షిస్తుంది.
హెయిర్ స్టైల్:
వేసవిలో ముఖం మీద జుట్టు పడితే చికాగ్గా ఉంటుంది. వేడుకని బట్టి మీకు సౌకర్యంగా ఉండే హెయిర్ స్టైల్ ఎంచుకోండి. జుట్టు విరబోయకున్నా కూడా మంచి హెయిర్ స్టైల్ వేసుకుంటే అందంగా కనిపించొచ్చు. జుట్టును పైకి మడిచి పెట్టుకునే మెస్సీ హెయిర్ బన్స్, కాస్త విభిన్నంగా జుట్టు అల్లుకుని అలంకరణ చేయడం మంచిది. ముఖ్యంగా జిడ్డుతల తత్వం ఉన్నవాళ్లు జుట్టును విరబోయకపోవడమే మంచిది.
చన్నీటి స్నానం:
వేడినీటి స్నానం వల్ల చర్మంతో పాటూ జుట్టు కూడా దెబ్బతింటుంది. అందుకే చన్నీటి స్నానం చేయండి. దీనివల్ల జట్టు బలంగా, మృదువుగా తయారవుతుంది. ఒక వేళ వేడినీటితో చేసినా నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. తలస్నానం చేసిన వెంటనే దువ్వుకోకూడదు. జట్టు తడిగా ఉన్నపుడు బలహీనంగా ఉంటుంది. ఆరిన తరువాత మాత్రమే దువ్వెన వాడాలి. హడావుడి ఉండే ముందుగా తక్కువ వేడితో డ్రైయర్ వాడి తరువాత మాత్రమే జుట్టు దువ్వుకోండి.
మర్దనా:
జుట్టుకు మర్దనా చేయడం వల్ల రక్త సరఫరా పెరిగి జుట్టు మొదళ్లను సంరక్షిస్తుంది.పెళ్లికి కనీసం వారం ముందు నుంచి మంచి నూనెలతో మర్దనా చేసుకోండి. దానివల్ల పెళ్లి సమయానికి జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. మర్దనా వల్ల జట్టుకు పోషకాలు అందే అవకాశం కూడా పెరుగుతుంది.
జుట్టు పలుచబడటం:
ముఖ్యంగా నుదురు మీద భాగంలో జుట్టు ఎక్కువగా ఊడిపోయి పలుచగా అనిపిస్తుందా? . అలాంటపుడు కొన్ని హెయిర్ స్టైల్స్ వల్ల ఆ సమస్య ఉన్నట్లు తెలీకుండా చేయొచ్చు. ముందు వైైపు బ్యాంగ్స్ చేయించుకోవచ్చు. లేదా లేయరింగ్ హెయిర్ స్టైల్ వల్ల కూడా జుట్టు ఒత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సెట్టింగ్:
గంటల తరబడి కూర్చుని జుట్టుకు స్టైలింగ్ చేయించుకున్నాక మీరు చేయించుకున్న ఉంగరాల జుట్టు నిలవదు. లేదా స్ట్రెయిట్‌గా చేయించుకున్న జుట్టు వంకర టింకర్లగా మారుతుంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే చివరగా సెట్టింగ్ స్ప్రే వాడటం తప్పని సరి. మీ జుట్టు తీరు, పొడవు బట్టి వివిధ రకాల స్ప్రేలు ఎంచుకోవచ్చు.