Happy Diwali 2022 - Safety Tips | దీపావళిని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి.. ఈ చిట్కాలు పాటించండి!
Happy Diwali 2022: దీపావళి పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి. మీరు ఈ పండగ వేళ భద్రంగా ఉండేందుకు ముఖ్యమైన సురక్షిత నియమాలు ఇక్కడ సూచిస్తున్నాం, తప్పకుండా పాటించండి.
Happy Diwali 2022: దీపావళి వచ్చేసింది, దేశమంతటా పండగ వాతావరణం తెచ్చేసింది. పండగ సన్నాహాలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. చిన్నా, పెద్ద వయసు బేధం లేకుండా అందరూ కలిసి ఆనందోత్సహాల మధ్య ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. పటాకులు కాలుస్తూ సంబరాల్లో మునిగి తేలుతారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ, ఈ దీపావళికే ఎక్కువ మందికి కాలిన గాయాలవుతాయి, ఈ పండగకే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఉత్సాహం, ఊపుతో భద్రత నియమాలను పట్టించుకోకుండా వేడుకలు జరుపుకుంటే, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు.
దీపావళి పండగను ఘనంగానే జరుపుకోవాలి, అయితే అది సురక్షిత పద్ధతుల్లో వేడుకలు జరుపుకోవాలి. పటాకులు కాల్చే సమయంలో చిన్నపిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వెలుగుల దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలి, కానీ చీకటిమయం చేయకూడదు.
Happy Diwali 2022- Safety Tips
మీరు సురక్షితమైన, ఆరోగ్యకరమైన దీపావళిని జరుపుకోవడానికి కొన్ని చిట్కాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. వాటిని పాటిస్తూ వేడుకలు చేసుకోండి, మీ ప్రియమైన వారికి తెలియజేయండి, నలుగురిలో ఆదర్శంగా నిలవండి.
దీపావళి అలంకరణలో జాగ్రత్త
దీపావళి సందర్భంగా అందరూ తమ ఇండ్లను దీపాలతో, ఎలక్ట్రిక్ ఫెయిరీ లైట్లతో అలంకరించుకుంటారు. నూనె దీపాలను వెలిగించేటపుడు కిటికీల వద్ద, గుమ్మం వద్ద కర్టెన్లకు దూరంగా దీపం ఉండేలా నిర్ధారించుకోండి. అలాగే ఎలక్ట్రిక్ లైట్లు అలంకరించేటపుడుశ్రద్ధ వహించండి. తడిగా ఉన్న చోట విద్యుత్ షాక్ తగలకుండా జాగ్రత్త వహించండి.
ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి
దీపావళి సమయంలో, సరైన వెంటిలేషన్ ఉండటానికి మీ తలుపులు, కిటికీలను తెరిచి ఉంచండి. పటాకుల పొగతో కాలుష్యం ఎక్కువగా ఉంటే కొంత విరామం పాటు మూసి, ఆపై తెరిచి ఉంచుకోండి. ఇది అనుకోని ప్రమాదాలను నివారిస్తుంది.
శానిటైజర్ వాడకండి
కరోనా తర్వాత అందరి ఇళ్లలో శానిటైజర్ కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారింది. శానిటైజర్ రాసుకొని దీపాలు వెలిగించడం, పటాకులు కాల్చటం చేయకండి. హ్యాండ్ శానిటైజర్‌లు ఆల్కహాల్ ఆధారితమైనవి, అవి మండే గుణాన్ని కలిగి ఉంటాయి. అగ్ని ప్రమాదాలకు కారణం అవుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి.
భారీ శబ్దాలు వచ్చే బాంబులు వద్దు
భారీ శబ్దాలు వచ్చే టపాసులు కాల్చకపోవడమే మంచిది. వీటివల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరుగుతుంది. గుండె సమస్యలు ఉన్నవారికి ఈ శబ్దాలు ప్రమాదకరం, పసిపిల్లలు భయపడతారు. దారినపోయే వారు గాయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టపాసులు కాల్చకుండా ఉండాలి. కానీ, చాలామంది ఏదైతే వద్దు, మంచిది కాదు అని చెప్తే అదే చేస్తారు. ఈ దీపావళి సమయంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి విశాల మనసుతో ఆలోచించగలగాలి.
కాలిన గాయాలైతే ఇలా చేయండి
దీపావళి వేళ సురక్షితంగా టపాసులు కాల్చండి. ఈ సమయంలో కాలిన గాయాలైతే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టరును సంప్రదించండి. ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే, అంత తక్కువ నష్టం ఉంటుందని గమనించాలి. అయితే చిన్నచిన్న గాయాలైతే వెంటనే ఆలోవెరా జెల్ పూసి, ఆ వెంటనే డాక్టరును సంప్రదించండి. టపాసులు కాల్చే సమయంలో ఒక బకెట్ నీరు పక్కన సిద్ధంగా ఉంచుకోండి. దుస్తులకు మంట అంటుకుంటే పరుగెత్తకుండా వెంటనే దుస్తులను విప్పేయండి. కాలిన చోట నీళ్లు చల్లుకోండి. సురక్షితంగా ఉండండి.
ఆయిల్ ఫుడ్ తినడం మానుకోండి
దీపావళి వేళ రుచికరమైన ఆహారం తినాలని కోరిక కలుగుతుంది, మార్కెట్‌లో అందుబాటులో ఉండే స్వీట్లను తినాలనిపిస్తుంది. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అధిక నూనెతో కూడిన ఆహారం అజీర్ణానికి దారితీస్తుంది. వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఆహారపదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వండి.
సురక్షితమైన దీపావళి జరుపుకోండి, సుఖసంతోషాలతో ఉండండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
సంబంధిత కథనం