Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు
Gongura Chepala Pulusu: గోంగూర చికెన్, గోంగూర రొయ్యల కూర వండుతూ ఉంటారు. అలాగే గోంగూర చేపలు కలిపి వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.
Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే గోంగూర చేపల ఇగురు లేదా గోంగూర చేపల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశ, ఇడ్లీ, అన్నం ఎందులో వేసుకుని తిన్నా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. చేపలను ఇష్టపడేవారు అప్పుడప్పుడు ఇలా గోంగూర చేపల పులుసు లేదా గోంగూర చేపల ఇగురును ప్రయత్నించండి. ఇక్కడ మేము గోంగూర చేపల పులుసు రెసిపీ ఇచ్చాము దీన్ని చేయడం చాలా సులువు.
గోంగూర చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
చేపలు - ఒక కిలో
గోంగూర - ఒక కట్ట
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - పావు స్పూన్
కారం - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు
ఉల్లిపాయ - ఒకటి
ధనియాల పొడి - ఒక స్పూను
మెంతి పిండి - అర స్పూను
గరం మసాలా - ఒక స్పూను
టమాటా - రెండు
నీరు - తగినంత
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
నూనె - సరిపడినంత
గోంగూర చేపల పులుసు రెసిపీ
1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. అందులోనే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గంట సేపు వాటిని అలా వదిలేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. చేపలు వేయించడానికి సరిపడా నూనెను వేసుకోవాలి.
6. నూనె వేడెక్కాక ఒక్కొక్క చేప ముక్కను రెండు వైపులా ఎర్రగా కాల్చి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త నూనె వేయాలి.
8. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
9. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి చిన్న ముక్కలుగా కోసి వేయించాలి.
10. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి వేయించుకోవాలి.
11. ఇప్పుడు గోంగూరను చిన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఆకులను కూడా కళాయిలో వేసి బాగా కలపాలి.
12. మూత పెడితే అవి త్వరగా మగ్గుతాయి.
13. తర్వాత మూత తీసి పసుపు, కారం, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
14. టమాటాలను మిక్సీలో వేసి ఫ్యూరీ లాగా చేసుకోవాలి.
15. ఆ ప్యూరీని కూడా వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద అరగంట పాటు ఉడికిస్తే నూనె పైకి తేలుతుంది.
16. ఆ సమయంలో నీళ్లు వేయాలి. పులుసు బుడగలు వస్తున్నట్టు మరుగుతూ ఉంటుంది.
17. ఆ సమయంలోనే ముందుగా వేయించుకున్న చేప ముక్కలను వేయాలి.
18. మూత పెట్టి పావుగంట సేపు ఉడికిస్తే సరిపోతుంది. చేప ముక్కలను గరిటతో కలపకూడదు.
19. చేపలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే వాటిని వేయించి పెట్టుకున్నాము.
20. స్టవ్ కట్టే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. చేపల కూర చల్లారే వరకు అలా ఉంచాలి.
21. చేపలు పులుసును పీల్చుకొని చాలా టేస్టీగా అవుతాయి.
22. గోంగూర పుల్లగా ఉండేట్టు చూసుకోవాలి. ఒకవేళ పుల్లని గోంగూర దొరకకపోతే కాస్త చింతపండు రసాన్ని వేసుకోవచ్చు.
23. గోంగూర పుల్లగా ఉంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు.
నాన్ వెజ్ ప్రియులకు కచ్చితంగా ఈ గోంగూర చేపల పులుసు నచ్చుతుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ చేపల పులుసును వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే వేరు. అలాగే దోశ, ఇడ్లీల్లో ఈ పులుసును తినవచ్చు. ఒకసారి ఈ చేపల పులుసును ప్రయత్నించి చూడండి. అలాగే గోంగూర చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది.