Nellore Karam Dosa: నెల్లూరు కారం దోశను ఇలా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చడం ఖాయం-nellore karam dosa recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nellore Karam Dosa: నెల్లూరు కారం దోశను ఇలా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చడం ఖాయం

Nellore Karam Dosa: నెల్లూరు కారం దోశను ఇలా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చడం ఖాయం

Haritha Chappa HT Telugu
May 09, 2024 06:00 AM IST

Nellore Karam Dosa: దోశ అనగానే ప్లెయిన్ దోశ, రవ్వ దోశ, మసాలా దోశ ఇవే కనిపిస్తాయి. ఒకసారి నెల్లూరు కారం దోశ రెసిపీని ప్రయత్నించండి. ఇది స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.

నెల్లూరు కారం దోశ రెసిపీ
నెల్లూరు కారం దోశ రెసిపీ

Nellore Karam Dosa: నెల్లూరులో ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ నెల్లూరు కారం దోశ. దీన్ని తినే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఇంట్లో కూడా నెల్లూరు కారం దోశను చేసుకోవచ్చు. ఈ దోశ కోసం నెల్లూరు వెళ్లాల్సిన అవసరం లేదు. సులువుగా నెల్లూరు కారం దోశ ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

నెల్లూరు కారం దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు

దోశ పిండి - ఒక కప్పు

నూనె - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

చింతపండు - చిన్న ముద్ద

జీలకర్ర - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

ఉల్లిపాయలు తరుగు - అరకప్పు

టమోటా తరుగు - పావు కప్పు

ఎండుమిర్చి - మూడు

నెల్లూరు కారం దోశ రెసిపీ

1. నెల్లూరు కారం దోశ తయారీలో ముందుగా కారాన్ని తయారుచేసి పెట్టుకోవాలి.

2. ఇందుకోసం ఉల్లిపాయను, టమోటాను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, తరిగిన టమోటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.

5. నూనె వేడెక్కాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి చిన్న మంట మీద ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి.

6. పచ్చివాసన పోయే వరకు అలా వేయించాలి.

7. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

8. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.

9. దోశల పిండితో దోశను వేసుకోవాలి.

10. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న కారాన్ని తీసి దోశ మధ్యలో వేసి దోశ మొత్తం విస్తరించేలా చేయాలి.

11. ఒక నిమిషం పాటు దోశ వేయించాక మడిచి ఒక ప్లేట్లో వేసుకోవాలి.

12. అంతే స్పైసీ నెల్లూరు కారం దోశ రెడీ అయినట్టే.

13. ఎగ్ దోశ కావాలనిపిస్తే దోశ మధ్యలో ఈ కారాన్ని పూశాక, ఒక కోడి గుడ్డును పగలగొట్టి వేసుకొని దోశ మొత్తం పరుచుకోవాలి.

14. రెండువైపులా దోశెను కాల్చి పక్కన పెట్టుకోవాలి. అంతే నెల్లూరు ఎగ్ కారం దోశ కూడా రెడీ అయిపోయినట్టే.

15. కొబ్బరి చట్నీతో దీన్ని తింటే రుచి అదిరిపోతుంది.

16. ఒక్కసారి తిన్నారంటే నెల్లూరు కారం దోశను పదేపదే తినాలన్న కోరిక పుడుతుంది.

నెల్లూరులో ఎక్కువగా కారాన్ని తింటూ ఉంటారు. నెల్లూరు కారం దోశ కూడా కాస్త స్పైసీగానే ఉంటుంది. మీకు మరీ స్పైసీ ఎక్కువ అనిపిస్తే ఎండుమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. లేదా పచ్చిమిర్చిని తగ్గించుకున్నా చాలు. ఈ కారాన్ని ఒకసారి రుబ్బి పెట్టుకుంటే వారం రోజులు పాటు వాడుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్లో భద్రపరుచుకోవాలి.

టాపిక్