Egg Chat: పిల్లలకు ఇలా ఎగ్ చాట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు-egg chaat recipe in telugu know how to make this recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Chat: పిల్లలకు ఇలా ఎగ్ చాట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు

Egg Chat: పిల్లలకు ఇలా ఎగ్ చాట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు

Haritha Chappa HT Telugu
May 02, 2024 03:30 PM IST

Egg Chat: చాట్ పేరు చెప్తేనే పిల్లలకు నోరూరిపోతుంది. ఎప్పుడూ బయట ఆహారాన్ని పెట్టే కన్నా ఇంట్లోనే ఎగ్ చాట్ తయారు చేసి పెట్టండి. వారు ఇష్టంగా తింటారు.

ఎగ్ చాట్ రెసిపీ
ఎగ్ చాట్ రెసిపీ

Egg Chat: కోడిగుడ్డుతో చేసిన ఆహారాలు ఏవైనా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీలు తింటే బోర్ కొట్టేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు కొత్త కొత్త రుచులు కావాలనిపిస్తుంది. ఇంట్లోనే ఒకసారి ఎగ్ చాట్ తయారు చేసి చూడండి. ఇది పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చుతుంది. ముఖ్యంగా దీన్ని చేయడం చాలా సులువు. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఉడకబెట్టిన గుడ్లు ఉంటే సరిపోతుంది. ఎగ్ చాట్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ చాట్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన గుడ్లు - నాలుగు

టమాటోలు - రెండు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి - నాలుగు

ఉల్లిపాయ - ఒకటి

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - చిటికెడు

కారం - ఒక స్పూను

చాట్ మసాలా - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

నూనె - సరిపడినంత

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

ఎగ్ చాట్ రెసిపీ

1. ముందుగానే కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా కోసి తెల్లభాగాన్ని ఒక గిన్నెలో, లోపలి పచ్చ భాగాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

3. తెల్లభాగాన్ని కాస్త పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇక పచ్చ సొనను పొడిలా చేసి పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. నూనెలో తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.

6. తర్వాత సన్నగా తరిగిన టమోటో ముక్కలు, కరివేపాకులు వేసి వేయించాలి.

7. అలాగే కారం, ఉప్పు, చాట్ మసాలా, పసుపు కూడా వేసి వేయించాలి.

8. వాటిల్లోనే నాలుగైదు స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి.

9. ఆ నీళ్లు ఇగిరిపోయాక పుదీనా తురుమును వేయాలి.

10. అలాగే ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు అన్ని వేసి వేయించుకోవాలి.

11. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పచ్చ సొన పొడిని, తెల్ల గుడ్డు ముక్కలను వేసి కలుపుకోవాలి.

12. పైన చాట్ మసాలా చల్లుకోవాలి. అంతే రుచికరమైన ఎగ్ చాట్ రెడీ అయినట్టే.

13. ఇది తినే కొద్ది ఇంకా కావాలనిపిస్తుంది.

దీన్ని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తిన్నా మంచిదే, లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకున్నా కూడా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో మనం అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే వేసాము. కాబట్టి దీన్ని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీన్ని తయారు చేయడానికి కేవలం 10 నిమిషాల సమయం పడుతుంది. కోడిగుడ్లను ఉడకబెట్టి రెడీగా ఉంచుకుంటే సరి... అప్పటికప్పుడు చేసుకునే ఆహారంగా దీన్ని చెప్పుకోవచ్చు.

Whats_app_banner