Soya Idli Recipe । హాయిగా తినాలనిపించే సోయా ఇడ్లీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
Soya Idli Recipe: ఎప్పుడూ ఒకేరకమైన ఇడ్లీ తిని విసిగిపోయారా? ఇలా ఓసారి సోయా ఇడ్లీ చేసుకొని తిని చూడండి. రెసిపీ కోసం ఇక్కడ చూడండి.
ఉదయాన్నే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వలన మీరు రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని తీర్చడానికి శాకాహారంలో సోయాబీన్ ఒక గొప్ప ఎంపిక. సోయాబీన్ యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇది కొలెస్ట్రాల్ లేనిది, ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లోకి సోయాబీన్ కలిగిన అల్పాహారం తీసుకోవడం వలన అది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఈ సూపర్ ఫుడ్ జీర్ణక్రియకు కూడా చాలా మంచిది.
మరి సోయాబీన్ కలిగిన అల్పాహారం ఎలా అనుకుంటున్నారా? మీరు సోయా ఇడ్లీ సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఇది మీరు రెగ్యులర్‌గా తినే ఇడ్లీకి మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. సోయా చంక్స్ లేదా మీల్ మేకర్‌ను పిండిగా చేసి, ఇడ్లీ పిండితో కలుపుకొని దీనిని తయారు చేస్తారు. అది ఎలా చేయాలో సోయా ఇడ్లీ రెసిపీ ఈ కింద ఉంది, చూడండి.
Soya Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు సోయా చంక్స్
- 2 కప్పులు బియ్యం
- 1/2 కప్పు పెసరిపప్పు
- 1 టేబుల్ స్పూన్ నూనె
- ఉప్పు రుచి ప్రకారం
సోయా ఇడ్లీ తయారీ విధానం
- సోయా ఇడ్లీ చేయడానికి ముందుగా అవసరమైన పరిమాణంలో బియ్యం, పెసరిపప్పును తీసుకొని వాటిని వేర్వేరు గిన్నెలలో నానబెట్టండి.
- దీని తరువాత సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ తీసుకొని నీటిలో ఉడికించండి. ఆపై నీటిని తీసివేసి చల్లబరచండి. ఆపై ఉడికిన మీల్ మేకర్లను మిక్సీ జార్‌లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని మందపాటి పేస్టులాగా రుబ్బుకోవాలి.
- అదే విధంగా నానబెట్టిన బియ్యాన్ని, పప్పును మిక్సీ జార్‌లో వేసి పిండి రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండికి, సోయా మిశ్రమం కలిపి, రుచికి తగినట్లుగా ఉప్పు వేసి పులియబెట్టండి. సుమారు 5-6 గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి.
- ఇప్పుడు సిద్ధమైన ఇడ్లీ బ్యాటర్ ను ఇడ్లీ కుక్కర్ అచ్చుల్లో పోసి ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి.
మూత తీసి చూస్తే సోయా ఇడ్లీ రెడీ. మీకు నచ్చిన చట్నీ లేదా సాంబార్‌తో తింటూ ఆస్వాదించండి.
సోయా ఇడ్లీని సోయా చంక్స్‌తో కాకుండా సోయాబీన్లను నానబెట్టి, దానిని పిండిగా రుబ్బుకొని కూడా చేయవచ్చు.
సంబంధిత కథనం