Quinoa Upma Recipe । క్వినోవా ఉప్మా.. ఎంతో శ్రేష్ఠం, తప్పకుండా తినాల్సిన అల్పాహారం!-want to have a healthy breakfast here is nutrients loaded quinoa upma recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Quinoa Upma Recipe । క్వినోవా ఉప్మా.. ఎంతో శ్రేష్ఠం, తప్పకుండా తినాల్సిన అల్పాహారం!

Quinoa Upma Recipe । క్వినోవా ఉప్మా.. ఎంతో శ్రేష్ఠం, తప్పకుండా తినాల్సిన అల్పాహారం!

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 06:30 AM IST

Quinoa Upma Recipe: ఉప్మాను ఎప్పుడూ చేసుకునేలా రవ్వతో, సెమ్యాతో కాకుండా మరింత ఆరోగ్యకరంగా క్వినోవా ఉప్మా సిద్ధం చేసుకోంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Quinoa Upma Recipe
Quinoa Upma Recipe (slurrp)

అల్పాహారం వండేటపుడు ఆరోగ్యకరమైన పదార్థాలు ఉపయోగించడం ద్వారా మన ఎంతో శ్రేష్ఠమైన బ్రేక్‌ఫాస్ట్ చేయవచ్చు. ఉప్మా మనం తరచుగా తినే అల్పాహారం. ఈ ఉప్మాను మనం రవ్వతో లేదా సెమియా ఉపయోగించి చేస్తాం బదులుగా, క్వినోవా విత్తనాలతో ఉప్మా వండుకుకుంటే ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

క్వినోవా సాంకేతికంగా విత్తనమే అయినప్పటికీ వీటిని తృణధాన్యంగా పరిగణిస్తారు. క్వినోవాలో ప్రోటీన్, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నంను బియ్యంతో కాకుండా క్వినోవాతో కూడా వండుకోవచ్చు. ఓట్స్, రవ్వతో మొదలైన ధాన్యాలతో వండేవాటికి ఇది సరైన ప్రత్యామ్నాయం.

క్వినోవా విత్తనాలు గట్టిగా ఉంటాయి, అయితే వండిన తర్వాత మెత్తగా, మృదువుగా, తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. క్యారెట్ ముక్కలు, బఠానీలు వేసుకొని ఉప్మా చేస్తే రుచికిరుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. క్వినోవా ఉప్మా రెసిపీని ఈ కింద చూడండి.

Quinoa Upma Recipe కోసం కావలసినవి

  • 1/2 కప్పు క్వినోవా
  • 1/4 కప్పు సన్నగా తరిగిన క్యారెట్లు
  • 1/4 కప్పు ఫ్రెంచ్ బీన్స్
  • 1 ఉల్లిపాయ
  • 1/2 అంగుళం అల్లం ముక్క
  • 1 నుండి 2 పచ్చి మిరపకాయలు
  • 1 ఎండు మిరపకాయ
  • చిటికెడు ఇంగువ
  • 7 నుండి 8 కరివేపాకు ఆకులు
  • 1½ టేబుల్ స్పూన్ నూనె
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1/2 టీస్పూన్ జీలకర్ర
  • 1/2 టీస్పూన్ టీస్పూన్ మినపపప్పు
  • 1/2 టీస్పూన్ పెసరిపప్పు
  • 1 కప్పు నీరు
  • ఉప్పు తగినంత
  • తాజా కొత్తిమీర

క్వినోవా ఉప్మా రెసిపీ - తయారీ విధానం

  1. ముందుగా క్వినోవాను స్ట్రైనర్‌లో తీసుకుని నీటిలో బాగా కడిగి పక్కన పెట్టండి.
  2. బాణలిలో నూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయండి, ఆపైన అందులో ఆవాలు వేయాలి.
  3. ఆవాలు చిటపటలాడుతుండగా, జీలకర్ర, మినపపప్పు, పెసరిపప్పు, శనగపప్పులను వేయండి.
  4. పప్పులు బంగారు రంగులోకి మారాక, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి వేయించండి.
  5. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి.
  6. ఆతర్వాత సన్నగా తరిగిన క్యారెట్లు, బీన్స్ వేసి బాగా కలపాలి, రెండు నిమిషాలు తక్కువ వేడి మీద ఉడికించాలి.
  7. ఇప్పుడు క్వినోవా వేసి మళ్లీ బాగా కలపాలి. తక్కువ వేడి మీద ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాలి.
  8. ఇప్పుడు నీళ్లు పోసి బాగా కలపాలి. అనంతరం రుచికి తగినంత ఉప్పు వేయండి.
  9. ఇప్పుడు మూత పెట్టి ఉడికించండి, మధ్యమధ్యలో కలుపుతుండండి. నీరంతా పోయేవరకు ఉడికించండి.
  10. చివరగా మూతతీసి కొత్తిమీర చల్లి కలపాలి. అంతే క్వినోవా ఉప్మా రెడీ.

నిమ్మకాయ పచ్చడి, కొబ్బరి చట్నీతో తింటే రుచి మామూలుగా ఉండదు.

సంబంధిత కథనం