Fresh Breath Day: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలు పనిచేస్తాయి..-fresh breath day tips to reduce bad smell from mouth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fresh Breath Day: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలు పనిచేస్తాయి..

Fresh Breath Day: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలు పనిచేస్తాయి..

HT Telugu Desk HT Telugu
Aug 06, 2023 12:05 PM IST

Fresh Breath Day: తాజా శ్వాస మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోండి.

నోటి దుర్వాసన తగ్గించే చిట్కాలు
నోటి దుర్వాసన తగ్గించే చిట్కాలు (pexels)

నోటి ఆరోగ్యం శరీర ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని చిట్కాల ద్వారా నోటి దుర్వాసన వల్ల వచ్చే అసౌకర్యం కూడా తగ్గిపోతుంది. దానికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి.

1. బ్రషింగ్:

రోజుకు రెండుసార్లు తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. ఫ్లాస్ చేసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలతో పాటూ నాలుకను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి శ్వాస కోసం మీరు వాడే టూత్‌పేస్ట్ లో పెప్పర్ మింట్, మింట్ లాంటి పదార్థాలు ఉండేలా చూసుకుంటే ఇంకాస్త ఎక్కువ ఫలితం ఉంటుంది.

2. నీళ్లు తాగడం:

రోజు మొత్తం తగినన్ని నీళ్లు తాగడం కూడా నోటి దుర్వాసనను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటూ, ఒంట్లో నుంచి బ్యాక్టీరియా బయటకు వెళ్లేలా చేస్తుంది.

3. గమ్స్:

పంచదార లేని మింట్స్, గమ్స్ తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. నోట్లో పంచదార లేని చూయింగ్ గమ్ వేసుకుని నమలడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను ఇది తొలగిస్తుంది.

4. ఆహారం:

యాపిల్స్, క్యారట్లు, యోగర్ట్ లాంటి ఆహారాలు తాజా శ్వాసకు సాయపడతాయి. ఇవి దంతాలను శుభ్రం చేసి, లాలాజలం ఉత్పత్తిని పెంచుతాయి. పుదీనా లాంటివి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

5. ఇవి తినకూడదు:

వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కహాల్, కారం ఉన్న ఆహారాలు తినడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది. కాఫీకి బదులు పెప్పర్ మింట్, చేమంతి లాంటి హెర్బల్ టీలు తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

6. ఉప్పు నీళ్లు:

ఉప్పునీళ్లతో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. పావు చెంచా లేదా అరచెంచా ఉప్పును గోరువెచ్చని గ్లాసు నీళ్లలో కలిపి 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. రోజుకు రెండు సార్లయినా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

7. లవంగాలు:

ప్రయాణాల్లోనో, ఆఫీసుల్లోనో కాస్త దుర్వాసన ఎక్కువగా అనిపిస్తే ఒక లవంగం వేసుకుని నమిలితే వెంటనే ఫలితం ఉంటుంది. ఇది ఇతర దంత సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది.

Whats_app_banner