Burning Urination | మూత్రంలో మంట, చురుకు లేచినట్లు అనిపిస్తుందా? నివారణ ఇలా!
Burning Urination: మూత్రంలో మంట అనేది మూత్రనాళ ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection) కు సంకేతం. దీని లక్షణాలు ఏమిటి, నివారణ మార్గాలను చూడండి.
Urine- Burning Sensation: మీరు మూత్ర విసర్జన చేసినప్పటికీ మళ్లీ తరచుగా మూత్ర విసర్జన చేయాలనే భావన కలుగుతుందా? ఒకవేళ మూత్ర విసర్జన చేద్దామనుకున్నా మూత్రం రాకపోవడం, లేకపోతే తక్కువ మొత్తంలో మూత్రం రావడం జరుగుతుంది, మూత్రం పోసేటపుడు మంటగా కూడా అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయంటే మీరు మూత్రనాళ ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection) కు గురయ్యారని అర్థం. వేసవి నెలల్లో అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండటం సర్వసాధారణం. ఈ పరిస్థితిని మనం వ్యవహారిక భాషలో చురుకు లేవడం, సెగ లేవడం లేదా వేడి చేయడం అని పిలుస్తుంటాం.
వేసవిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (Summer UTIs) వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే వెచ్చని వాతావరణంలో సూక్ష్మక్రిములు లేదా బ్యాక్టీరియా వృద్ధి చెందడం సులభం. మూత్రంలో కోలి లేదా ఇతర బ్యాక్టీరియా పెరిగినపుడు అవి మూత్రాశయం, మూత్రనాళాన్ని ప్రభావితం చేస్తాయి. మంట, దురదను కలిగిస్తాయి. ఇందుకు వేడి వాతావరణంతో పాటు, సరైన పరిశుభ్రత పాటించకపోవడం, లైంగిక సంపర్కం కారణాలుగా నిర్జలీకరణం కూడా UTIలకు దారి తీస్తుంది. ఈ సమయంలో మీరు కూల్ డ్రింక్స్ తాగటం, సోడా లేదా బీర్ వంటి పానీయాలు తాగటం, సిట్రస్ జ్యూస్ లు తాగటం వలన మంట మరింత ఎక్కువ ఉంటుంది.
UTI Symptoms- యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు
- మూత్ర విసర్జన చేసేటపుడు తిమ్మిరిగా, మండుతున్నట్లుగా అనిపించడం
- మూత్ర విసర్జన చేశాక మళ్లీ వెంటనే మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలగడం
- తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక, మండుతున్నటు వంటి అనుభూతి
- తక్కువ మొత్తంలో మాత్రమే మూత్ర విసర్జన చేయడం
- చెడు వాసనతో కూడిన మూత్రం రావడం
- అప్పుడప్పుడూ రక్తంతో కూడిన మూత్రం రావడం
- దిగువ పొత్తికడుపులో నొప్పి, తిమ్మిరి
- జ్వరం, చలి ఉండటం (101° కంటే ఎక్కువ జ్వరం UTIని సూచిస్తుంది)
- వికారం, వాంతులు (ఎగువ UTI)
- దిగువ వెన్ను భాగంలో నొప్పిగా అనిపించడం
- పురుషులకు స్కలనం సమయంలో నొప్పి, వృషణాల వెనక నొప్పి
ఈ లక్షణాలన్నీ మూత్రనాళ ఇన్ఫెక్షన్ ను సూచిస్తాయి. అయితే అదృష్టవషాత్తూ ఈ UTIలు కొంత అసౌకర్యం కలిగించినప్పటికీ, సాధారణంగా ప్రమాదకరమైనవి కావు, వీటిని యాంటీబయాటిక్స్‌తో సులభంగా చికిత్స చేయవచ్చు. రెండు మూడు రోజుల్లో మళ్లీ మామూలు స్థితికి రావచ్చు.
UTIs Home Remedies- మూత్రనాళ ఇన్ఫెక్షన్ నివారణలు
వేసవిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించటానికి లేదా చికిత్స చేయడానికి మీరు ఇంటి వద్దనే ప్రయత్నించగల కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
పుష్కలంగా నీరు త్రాగండి
నిర్జలీకరణం UTIల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి పుష్కలంగా నీరు, ఇతర ద్రవాలు తాగండి. తద్వారా ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. క్రమం తప్పకుండా మూత్రవిసర్జన చేయడం వల్ల మూత్ర నాళంలోని బ్యాక్టీరియాను ఫ్లష్ చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు మూత్రం చేయకుండా ఉండకండి. బ్యాక్టీరియా పేరుకుపోవడానికి దారితీస్తుంది, ఫలితంగా ఇన్ఫెక్షన్ వస్తుంది.
విటమిన్ సి తీసుకోండి
మీ విటమిన్ సి తీసుకోవడం వల్ల UTIల నుండి రక్షణ పొందవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విటమిన్ సి మూత్రం ఆమ్లతను పెంచుతుంది, ఇది ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. నిమ్మకాయ షర్బత్ వంటివి తాగవచ్చు, విటమిన్ సి కలిగిన పండ్లు తినవచ్చు.
క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి
తియ్యని క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం అనేది UTIలకు అత్యంత ప్రసిద్ధ సహజ నివారణలలో ఒకటి. క్రాన్బెర్రీస్ మీ మూత్ర నాళానికి అంటుకుని ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి బయటకు పంపేలా సహాయపడగలదు.
ప్రోబయోటిక్స్ తీసుకోండి
ప్రోబయోటిక్స్ మీ పేగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ, కెఫీర్ వంటి పదార్థాలు ఎక్కువ తీసుకోండి.
పరిశుభ్రత అలవాట్లను పాటించండి
బాత్రూమ్ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను అభ్యసించడం ద్వారా UTIలను నివారించవచ్చు. సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం కూడా బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించటానికి ఒక మార్గం. జననావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోండి.
ఇలా తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించండి, వైద్యులు సూచించిన యాంటీబయోటిక్స్ వాడండి.
సంబంధిత కథనం