Things To Do Before 9AM: మీ రోజు అద్భుతంగా గడవాలంటే.. ఉదయం తొమ్మిది లోపు చేయాల్సిన పనులివే..-for a good day know few works to be completed before nine in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Things To Do Before 9am: మీ రోజు అద్భుతంగా గడవాలంటే.. ఉదయం తొమ్మిది లోపు చేయాల్సిన పనులివే..

Things To Do Before 9AM: మీ రోజు అద్భుతంగా గడవాలంటే.. ఉదయం తొమ్మిది లోపు చేయాల్సిన పనులివే..

Koutik Pranaya Sree HT Telugu
Nov 20, 2023 09:24 AM IST

Things To Do Before 9AM: మీరోజు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఎలాంటి గజిబిజి లేకుండా ఉండాలంటే ఉదయం తొమ్మిది లోపే కొన్ని పనులు అయిపోవాలి. అవేంటో చూసి మీరూ పాటించేయండి.

ఉదయం చేయాల్సిన పనులు
ఉదయం చేయాల్సిన పనులు (pexels)

సరైన ప్లానింగ్‌ లేకుండా రోజును మొదలు పెట్టడం వల్ల పనులన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. కొందరు ఉదయం లేస్తూనే ఉరుకుల పరుగుల మీద రోజు వారీ పనుల్లో పడిపోతారు. అయితే మీరు క్రమశిక్షణతో జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిదింటి లోపు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల మీ రోజు మరింత అద్భుతంగా గడుస్తుంది.

ఉదయాన్నే నిద్ర లేవడం:

ఎప్పుడో ఎండెక్కాక నిద్ర లేవడం కాదు. క్రమశిక్షణతో రోజును ప్రారంభించాలని అనుకునే వారు సమయానికి విలువనివ్వాలి. ఉదయం కనీసం ఐదారింటికైనా నిద్ర మేల్కొనేలా చూసుకోవాలి.

రోజును ప్రణాళిక చేసుకోవడం:

లేచి కాసేపు వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ రోజు ఏమేం పనులు ఉన్నాయన్న దాన్ని ప్లానింగ్‌ చేసుకోవాలి. ఉదయం తొమ్మిది లోపు చేయాల్సిన పనులేమిటి? ఆ తర్వాత చేయాల్సినవి ఏమిటి అన్న ప్రణాళిక అంతా పూర్తయిపోవాలి.

హైడ్రేషన్‌:

చాలా మంది ఉదయాన్నే కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. అంతకు ముందుగా కనీసం అర లీటరైనా నీటిని తాగండి. ఉదయాన్నే మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మెల్లగా ఉన్న జీవ క్రియ వేగం పుంజుకుంటుంది. కావాలనుకుంటే ఒక గ్లాసు సాధారణ నీరు, ఒక గ్లాసు గోరు వెచ్చని నిమ్మకాయ నీరు, ఒక గ్లాసుడు తులసి నీళ్లు.. ఇలా నీటిని విభజించుకుని తాగొచ్చు.

తప్పనిసరిగా వ్యాయామం:

మార్నింగ్‌ రొటీన్‌లో వ్యాయామానికి తప్పకుండా చోటు కల్పించాలి. కనీసం అరగంట అయినా వాకింగ్‌, జాగింగ్‌, కొద్ది పాటి వ్యాయామాలు చేయడం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే కొన్ని బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజులు, మెడిటేషన్‌ లాంటివీ వ్యాయామంలో భాగమై ఉండాలి. ఇవి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

పోషకాల అల్పాహారం:

ఉదయాన్నే ఎక్కువ నూనెల్లో వేయించిన ఆహారాలను తీసుకోకూడదు. బదులుగా వీలైనంత ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని టిఫిన్‌గా తీసుకోవాలి. ఎప్పుడూ అలవాటైన ఇడ్లీ, దోశల్లాంటి వాటినే కాకుండా పచ్చి కూరగాయల తురుము, సలాడ్లు, ఓట్స్‌, చియా సీడ్స్‌తో చేసుకునే పుడ్డింగుల్లాంటి వాటినీ తినేందుకు ప్రయత్నించవచ్చు.

ఫోన్‌ని ఫ్లైట్‌ మోడ్‌లో:

ఉదయాన్ని ఇన్ని పనులు ఉండగా చాలా మంది ఫోన్‌లు చూసుకుంటూ, సోషల్‌ మీడియాలో ఛాటింగ్‌లు చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఎడిక్షన్లు ఉన్న వారు ఉదయం తొమ్మిది వరకు కచ్చితంగా ఫోన్‌ని ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచండి. దాని జోలికి వెళ్లకుండా మీ రోజును ప్రారంభించండి.

Whats_app_banner