Water after Meal: భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని వైద్యులు ఎందుకు చెబుతున్నారో తెలుసుకోండి
Water after Meal: భోజనం తిన్న వెంటనే లేదా భోజనం తింటున్నా మధ్యలో నీళ్లు తాగే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఆయుర్వేదం ప్రకారం భోజనం మధ్యలో లేదా భోజనం తిన్న వెంటనే నీరు తాగకూడదట.
Water after Meal: తిన్న ఆహారం అరగాలంటే నీరు తాగడం తప్పనిసరి. అయితే నీరు తాగేందుకు ఒక సమయం ఉందని చెబుతోంది ఆయుర్వేదం. నీరు తాగడం వల్ల మన శరీరం తేమవంతంగా మారుతుంది... అప్పుడే అన్ని అవయవాలు తమ కర్తవ్యాలను సరిగ్గా నిర్వర్తిస్తాయి. అయితే భోజనం తిన్నాక మాత్రం నీరు తాగకూడదనేది ఆయుర్వేద అభిప్రాయం. దీనికి కారణాలను కూడా నిపుణులు వివరిస్తున్నారు.
భోజనం తిన్నాక నీరు ఎందుకు తాగకూడదు?
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణరసాలు పలుచగా మారతాయి. దీనివల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగదు. అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇది నిజమేనని సైన్స్ కూడా చెబుతోంది. భోజనం తిన్న వెంటనే నీరు తాగితే బరువు త్వరగా పెరుగుతారని, ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు అతిగా తింటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు వైద్యులు.
భోజనం తర్వాత శరీరంలో చేరిన నీరు జీర్ణ ఎంజైములను పల్చగా మారుస్తుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గుండెల్లో మంట కూడా రావచ్చు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణం కాకుండా ఆహారం చాలా వరకు మిగిలిపోతుంది. ఇది కొవ్వు రూపంలో నిల్వ అవుతుంది. ఈ ప్రక్రియ ఇన్సులిన్ స్థాయిలను అమాంతం పెంచుతాయి. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మధుమేహం ఉన్నవారు భోజనం తిన్న వెంటనే నీటిని తాగకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఎప్పుడు తాగాలి?
నీరు తాగడానికి సరైన సమయాన్ని వివరిస్తున్నారు ఆయుర్వేద వైద్యులు. భోజనం తినడానికి అరగంట ముందు, భోజనం తిన్న అరగంట తర్వాత నీరు తాగడం ఉత్తమం. ఇది ఆహారాన్ని మృదువుగా మారుస్తుంది. అయితే చల్లటి నీటిని మాత్రం తాగకూడదు. ఎందుకంటే అన్నం తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. జీర్ణవ్యవస్థలో టాక్సిన్స్ పేరుకుపోయే అవకాశం ఉంది. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే భోజనం తినేటప్పుడు కెఫీన్ నిండిన పానీయాలు, కూల్ డ్రింకులు కూడా తాగడం మానేయాలి.