Fat Burning Teas: శరీరంలో కొవ్వు కరిగేలా చేసే 4 రకాల టీలు.. సింపుల్‍గా ఎలా తయారు చేసుకోవాలో చూడండి
Fat Burning Teas: బరువు తగ్గాలని అనుకుంటే శరీరంలోని ఫ్యాట్ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. కొవ్వు కరిగేందుకు కొన్ని రకాల టీలు ఉపయోగపడతాయి. అవెలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్‍తో పాటు వ్యాయామాలు చేస్తుంటారు. ఈ బరువు తగ్గే ప్రయత్నానికి కొన్ని రకాల టీలు కూడా తోడ్పడతాయి. శరీరంలోని కొవ్వు కరిగేందుకు సహకరిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వెయిట్ లాస్ అయ్యేందుకు చేయూతనిస్తాయి. అలా శరీరంలో ఫ్యాట్ కరిగేలా చేసే ఐదు రకాల టీలు ఏవో.. ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
అల్లం-దాల్చిన చెక్క టీ
శరీరంలో కొవ్వు కరిగేందుకు అల్లం దాల్చిన చెక్క టీ సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు మేలు చేస్తుంది. ఇది తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగై, కుడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఆకలిని కూడా ఇది తగ్గిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన సంతృప్తిని ఇచ్చి క్యాలరీలు ఎక్కువ తీసుకోకుండా చేస్తుంది.
- తయారీ ఇలా: ముందుగా ఓ కప్ నీటిని స్టవ్‍పై మరగనివ్వాలి.
- నీరు మరుగుతున్నప్పుడు ఓ ఇంచ్ అల్లం ముక్క, ఓ దాల్చిన చెక్క వేయాలి.
- 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం మంటపై మరగనివ్వాలి.
- ఆ తర్వాత వడగట్టుకొని అల్లం దాల్చిన చెక్క టీ తాగేయవచ్చు.
గ్రీన్ టీ.. నిమ్మరసంతో
వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ బాగా ఫేమస్ అయింది. ఇందులోని కట్చెన్స్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు కరిగేందుకు తోడ్పడుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సీ ఫ్యాట్ ఆక్సిడేషన్ అయ్యేలా చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగితే బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
- తయారీ ఇలా: ముందుగా కప్‍లో వేడి నీరు పోసి గ్రీన్‍టీ బ్యాగ్‍ను 2-3 నిమిషాల పాటు ముంచాలి.
- ఆ తర్వాత టీ బ్యాగ్ తొలగించి.. గ్రీన్ టీ కాస్త చల్లారనివ్వాలి.
- అనంతం దాంట్లో సగం నిమ్మకాయ రసం పిండాలి.
- ఆ టీని వడబోసి తాగేయవచ్చు.
పసుపు అల్లం టీ
శరీరంలో జీవక్రియను మెరుగుపరిచి, ఇన్‍ఫ్లమేషన్ తగ్గించి వెయిట్ లాస్ అయ్యేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అల్లం కూడా ఇందుకు సహకరిస్తుంది. ఈ రెండు కలిపి చేసే ఈ టీ ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు ప్రభావంతంగా పని చేస్తుంది.
- తయారీ ఇలా: ముందుగా ఓ కప్ నీటిని మరిగించుకోవాలి.
- దాంట్లో ఓ ఇంచ్ అల్లం ముక్క, ఓ టీస్పూన్ పసుపు పొడి వేయాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి.
- ఆ తర్వాత వడబోసుకొని ఆ టీని తాగొచ్చు. టేస్టీగా కావాలంటే తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
పుదీన టీ
వెయిట్ లాస్‍కు పుదీన టీ సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచటంతో పాటు ఆకలిని ఇది తగ్గించగలవు. కడుపులో ఇబ్బందులు నయం అయ్యేందుకు కూడా సహకరిస్తుంది. కొవ్వు కరిగేందుకు తోడ్పడుతుంది.
- తయారీ ఇలా: ముందుగా ఓ కప్ నీటిని వేడి చేసుకోవాలి.
- మరో కప్‍లో 2 టీస్పూన్ల ఎండబెట్టిన లేకపోతే తాజా పుదీన ఆకులను వేయాలి.
- అందులో వేడి నీటిని పోయాలి. 5 నిమిషాల వరకు దాన్ని అలానే వదిలేస్తే ఆకుల్లోని సారం నీటిలో కలుస్తుంది.
- ఆ తర్వాత ఆకులను వడగట్టేసి ఆ టీ తాగొచ్చు.
- తీపి కోసం దాంట్లో తేనె వేసుకోవచ్చు.