Politics and Summer : ఎండలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు ఈ చిట్కాలు పాటించాలి-elections 2024 must follow summer tips who campaign for election ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Politics And Summer : ఎండలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు ఈ చిట్కాలు పాటించాలి

Politics and Summer : ఎండలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు ఈ చిట్కాలు పాటించాలి

Anand Sai HT Telugu
Apr 05, 2024 04:30 PM IST

Summer Tips : ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో దీనిపైనే అందరి దృష్టి. చాలా మంది కార్యకర్తలు ప్రచారం కోసం ఎండలోనే తిరుగుతారు. ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి.

ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Unsplash)

ఓవైపు ఎన్నికల వేడి.. మరోవైపు సూరీడి వేడి. రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మెుదలుపెట్టాయి. సూర్యుడు కూడా ఫిబ్రవరి నుంచే విపరీతంగా ఎండతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ ఏడాది చాలా వేడిగా ఉండనుంది. మధ్యాహ్నం కాసేపు ఎండలో నిల్చుంటే తల పగిలిపోయేలాగా ఉంది. అంత వేడి మరి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత మొదలై జూన్ వరకు ఉంటుంది. మరోవైపు ఎన్నికలు కూడా సరిగ్గా జోరు ఎండలు ఉన్నప్పుడే వస్తున్నాయి. దీంచో ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని IMD ఇప్పటికే తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్య చాలా వేడిగాలులు ఉంటాయి. ఆ రోజుల్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

మరికొద్ది రోజుల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రోడ్లపై ప్రచారం జోరుగా సాగుతున్న ఈ సమయంలో రాజకీయ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తిరుగుతుంటారు. ఇలా ప్రచారానికి వెళ్లేటప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొన్ని చిట్కాలు పాటించాలి.

నీళ్లు ఎక్కువగా తాగాలి

ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. నిమ్మ రసం, మజ్జిగ తాగాలి. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి సాయపడుతుంది. ఈ వేసవిలో డీహైడ్రేషన్ ఎక్కువైతే ఆరోగ్యం బాగుండదు.

గొడుగు తీసుకెళ్లండి

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగు చేతిలో ఉండాలి. లేకపోతే చాలా కష్టం అవుతుంది. తలతిరగడం, డీహైడ్రేషన్ తదితర సమస్యలు ఉంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎన్నికలు అనగానే ముఖాలు కనిపించాలని వెళ్తుంటారు. కానీ గొడుగు ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది.

మద్యం సేవించవద్దు

ఎన్నికల్లో మద్యం తప్పనిసరి అయిపోయింది. ప్రచారానికి వెళ్లేవారిలో చాలా మంది మద్యం సేవించి.. తిరుగుతారు. ఈ వేడి వాతావరణంలో మద్యం సేవించడం మీ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాని గురించి జాగ్రత్తగా ఉండండి.

మాంసాహారం తినొద్దు

మాంసాహారం తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ఎండలో మాంసాహారంలో బాక్టీరియా త్వరగా ఉత్పత్తి అవుతుందని, దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బిర్యానీ, మటన్, చికెన్ తినడానికి వెళ్లకండి. బిర్యానీ ప్యాకెట్ లేనిది ఎన్నికలు కంప్లీట్ అవ్వవు. కానీ బిర్యానీ ఎక్కువగా తింటే దాహం వేస్తుంది. ఇబ్బంది పడతారు.

హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం

రాజకీయ నాయకులు కార్లలో, జీపుల్లో వస్తుంటారు. కానీ సాధారణ కార్యకర్తలు మాత్రం కాలినడకన ర్యాలీల్లో పాల్గొంటారు. ఎండలో నడవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి.

హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరగడం, విపరీతమైన దాహం, కళ్లు తిరగడం, గుండె దడ, నోటి నుంచి నురగలు రావడం వంటివి జరుగుతాయి.

హీట్ స్ట్రోక్ విషయంలో వ్యక్తిని నీడలో కూర్చోబెట్టి, ఆపై వారికి తాగడానికి నీరు ఇవ్వండి. నీటితో వారి తలపై తడుపుతూ ఉండాలి. ఆపై తడి గుడ్డతో వారి శరీరంపై రుద్దాలి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లండి.