Egg White vs Egg Yolk । గుడ్డులో తెల్లసొన తింటే మంచిదా.. పచ్చసొన ఆరోగ్యకరమా?
Egg White vs Egg Yolk: గుడ్లు తినడం ఆరోగ్యకరమే. అయితే కొంతమంది గుడ్డులోని తెలసొన మాత్రమే తింటారు, పచ్చసొనని వదిలివేస్తారు. మరి ఇలా తినడం సరైనదేనే, గుడ్డు పోషకాలను ఇక్కడ తెలుసుకోండి.
Egg White vs Egg Yolk: గుడ్లు అనేవి మంచి పౌష్టికాహారం, ఇవి ప్రోటీన్లకు గొప్ప మూలంగా పరిగణిస్తారు. గుడ్లు తినడం చాలా ఆరోగ్యకరం అని తెలిసిందే. చాలా మంది గుడ్లను ఇష్టంగా తింటారు కూడా. అయితే కొంతమంది గుడ్లలో తెల్లసొనను మాత్రమే తింటారు, పచ్చసొనలో కొవ్వు ఉంటుందని వదిలివేస్తారు. మరికొందరు ఉడికించిన గుడ్లు తినడానికి ఇష్టపడరు, కేవలం ఫ్రై చేస్తే లేదా ఆమ్లెట్ వేసుకొని తింటారు. కానీ ఉడికించిన గుడ్లు తింటేనే ఆరోగ్యకరం అని పోషకాహార నిపుణుల అభిప్రాయం. మరి ఈ ఉడికించిన గుడ్లలో పచ్చసొన భాగం తినకూడదా? ఎక్కువ మంది పచ్చసొన కంటే తెల్లసొనను ఎంచుకోవడానికి గల కారణాలేమి? గుడ్లను ఎలా తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి గుడ్డులో పచ్చసొన కంటే గుడ్డులోని తెల్లసొన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తెలుపు భాగంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అయితే పోషకాల విషయానికి వస్తే మాత్రం పచ్చసొనలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. గుడ్లు మొత్తంగా తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరం స్వయంగా తయారు చేయలేనివి , ఆహారం నుండి స్వీకరించాల్సిన అమైనో ఆమ్లాలు. అసలు గుడ్డులొని పచ్చసొన, తెల్లసొన గురించి మాట్లాడేముందు వాటిలోని పోషకాల మోతాదును ఇప్పుడు తెలుసుకుందాం.
Egg Nutrition- గుడ్డులోని పోషక విలువలు
ఒక గుడ్డులోని తెల్లసొన సగటు పరిమాణం 33 గ్రాములు కాగా, గుడ్డు పచ్చసొన పరిమాణం 17 గ్రాములు. గుడ్డు పచ్చసొనలో పోషకాలు చాలా దట్టంగా ఉంటాయి, ఇందులో 52% నీరు మాత్రమే ఉంటుంది. అయితే గుడ్డులోని తెల్లసొనలో 88% నీరు ఉంటుంది.
గుడ్డు పచ్చసొనలో కేలరీలు అధికంగా ఉంటాయి, 100 గ్రాముల గల పచ్చసొన తింటే 322 కేలరీలు ఉంటాయి. ఒక గుడ్డు పచ్చసొనలో 55 కేలరీలు ఉంటాయి. మరోవైపు కోడిగుడ్డు తెల్లసొనలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, వంద గ్రాములలో కేవలం 52 కేలరీలు ఉంటాయి.
Egg Yolk Health Benefits - గుడ్డు పచ్చసొన ప్రయోజనాలు
గుడ్డు పచ్చసొనలో కెరోటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లన్నీ కండరాల నిర్మాణానికి, శరీరంలో బయోటిన్ వంటి సమ్మేళనాలను ప్రోత్సహిస్తాయి. సన్నగా ఉండే వారు, బరువు పెరగాలాని కోరుకునేవారు పచ్చసొన తినడం చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదల, చర్మ ఆరోగ్యం, ముఖంలో నిండుతనాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
Egg White Health Benefits - గుడ్డు తెల్లసొన ప్రయోజనాలు
గుడ్డులోని తెల్లసొన భాగం తక్కువ కేలరీల ఆహారం, ఇది శరీరానికి ప్రోటీన్‌ను ఇస్తుంది కానీ కొలెస్ట్రాల్‌ను పెంచదు. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినడం గుండె జబ్బులతో బాధపడే వారికి మేలు చేస్తుంది. ఇది కాకుండా, కండరాల నిర్మాణాన్ని ప్రోత్సహించే, కండర ద్రవ్యరాశి నిర్మాణానికి సహాయపడే అనేక రకాల అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నవారు గుడ్డు తెల్లసొన తినడం వలన ప్రయోజనం చేకూరుతుంది.
గుడ్డు తెల్లసొన, పచ్చసొన అని వేర్వేరుగా కాకుండా మొత్తం గుడ్డును తినడం శ్రేయస్కరం. మితమైన మోతాదులో గుడ్లు తినడం ద్వారా పైన పేర్కొన్న పోషకాలన్నీ శరీరానికి అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు.
సంబంధిత కథనం