Detox foods: పండగ తర్వాత మీ శరీరాన్ని డిటాక్స్‌ చేసే ఆహారాలివే-eat these foods to detox your body after eating heavy foods on festivals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Detox Foods: పండగ తర్వాత మీ శరీరాన్ని డిటాక్స్‌ చేసే ఆహారాలివే

Detox foods: పండగ తర్వాత మీ శరీరాన్ని డిటాక్స్‌ చేసే ఆహారాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 08, 2024 06:00 AM IST

Detox foods: పండగలంటే కాస్త హెవీ ఫుడ్ తినేస్తారు. అయితే మీ శరీరాన్ని డిటాక్స్ చేసే ఆహారాలు కొన్ని తిన్నారంటే శరీరానికి మేలు జరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అవేంటో తెల్సుకోండి.

శరీరాన్ని డిటాక్స్ చేసే ఆహారాలు
శరీరాన్ని డిటాక్స్ చేసే ఆహారాలు (freepik)

శ్రావణం అంటేనే పండగల సీజన్. ఈ నెలంతా ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. పండగలంటే రకరకాల పిండివంటలు ఆరగించేస్తారు. నూనెల్లో వేపి వండేసిన వంటల్ని తినేసి ఆనందించేస్తాం. మరి ఇప్పుడు ఇలా లోపలికి వెళ్లి పేరుకుపోయిన వ్యర్థాలన్నింటినీ బయటకు నెట్టేయకపోతే కష్టమే. దానివల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే పండుగ వెళ్లి పోయిన తర్వాత తినగలిగిన ఆహారాలేంటి అనే దాన్ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం ద్వారా మన బాడీని డిటాక్స్‌ చేసుకోగలం. మరి ఆ పదార్థాలేంటో ఓ లుక్కేద్దాం రండి.

యాంటీ ఆక్సిడెంట్లు :

పాల కూర, బచ్చలి కూర, బ్రోకలీ లాంటి ఆహారాలను భోజనంలో చేర్చుకోండి. వీటిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అరుగుదలను మెరుగుపరిచి డిటాక్సిఫికేషన్‌ని ప్రోత్సహిస్తాయి. అలాగే ఆహారంలో వెజిటెబుల్‌ సలాడ్లనూ తినండి. కీరదోస కాయ, టమాటా, బ్రోకలీ, క్యారెట్లు, ఉల్లిపాయలు ఇలా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. వీటిపైన కాస్త ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని కలిపి తినండి. ఇవి కూడా శరీరాన్ని శుభ్రం చేయడంలో సహకరిస్తాయి.

ఎక్కువ నీరు :

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నింటినీ సమర్థవంతంగా బయటకు నెట్టి వేయాలంటే ముందుగా సరిపడినంత నీటిని తాగడం అవసరం. ఇది డిటాక్సిఫికేషన్‌ ప్రాసెస్‌ని వేగవంతం చేస్తుంది. కిడ్నీల పని తీరును మెరుగుపరుస్తుంది. ఎసిడిటీని తగ్గించి పేరుకుపోయిన వ్యర్థాల్ని బటయకు తోసి వేసేందుకు సహకరిస్తుంది.

గ్రీన్‌ టీ :

గ్రీన్‌ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. ఇవి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టి వేయడంలో సహకరిస్తాయి. ఒక కప్పు ఈ టీ తాగితే మేలు.

పెరుగు :

పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్లిన తర్వాత చాలా ఉపయోగకరంగా మారతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియాల వృద్ధికి ఇవి తోర్పడతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరిచి వ్యర్థాల్ని బయటకు తోసివేయడంలో సహకరిస్తాయి.

పండ్లు :

నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. వీటిలో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరాన్ని శుభ్రం చేసే యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ లాంటి వాటిలో ఉండే ఫైటో కెమికల్స్‌ కిడ్నీల్లో ఉన్న విష పదార్థాలనూ బయటకు నెట్టి వేస్తాయి.

పసుపు :

శీతాకాలంలో పసుపు టీ, పసుపు వేసి చేసిన వంటల్ని ఎక్కువగా తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే డిటాక్సిఫికేషన్‌ వేగవంతం కావడానికీ సహకరిస్తాయి.

Whats_app_banner