Kidney Failure- Warning Signs । కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందు ఎలాంటి సంకేతాలు గమనించవచ్చు?
Kidney Failure Warning Signs: కిడ్నీ వ్యాధి చాలా తీవ్రమైన అనారోగ్య సమస్య. కిడ్నీలు చెడిపోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి.
ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకు పోయే నత్రజని వ్యర్థపదార్థాల నుండి రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ప్రధానంగా బాధ్యత వహిస్తాయి. శరీర జీవక్రియలలో భాగంగా ఉప ఉత్పత్తులుగా ఉత్పన్నమయ్యే యూరియా, క్రియేటినిన్, ఆమ్లాలు మొదలైన వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. అలాగే శరీరంలో నీటి సమతుల్యతను కాపాడతాయి. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణ, ఎముకల ఆరోగ్యం, హిమోగ్లోబిన్ సంశ్లేషణకు అవసరమయ్యే ముఖ్యమైన అనేక హార్మోన్లను నియంత్రిస్తాయి. ఇలాంటి కీలక బాధ్యతలను నిర్వహించే మూత్రపిండాలలో ఏ ఒక్కటి చెడిపోయినా, మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.
కిడ్నీ సరిగా పనిచేయడంలో విఫలమైనప్పుడు కిడ్నీ దెబ్బతినడం కనిపిస్తుంది. సాధారణంగా మధుమేహం, వృద్ధాప్యం, కుటుంబ చరిత్ర, రక్తపోటు మొదలైన కారణాల వలన కిడ్నీ సమస్యలకు గురవుతారు. కిడ్నీ సంబంధింత వ్యాధులు ఉన్న వ్యక్తికి గుండె, రక్తనాళాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువే అని వైద్యులు అంటున్నారు.
పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి వారసత్వంగా సంక్రమిస్తుంది, ఇది ఉన్నప్పుడు మూత్రపిండాలలో పెద్ద తిత్తులకు దారితీస్తుంది. చుట్టుపక్కల కణజాలానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే మరో వ్యాధి లూపస్, ఇది ఉన్నపుడు కిడ్నీలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసే చిన్న రక్తనాళాలలో వాపు ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది . ఈ సందర్భంలో డయాలసిస్ లేదా అవయవ మార్పిడి కూడా అవసరమవుతుంది.
Kidney Failure Warning Signs- కిడ్నీలు చెడిపోయే ముందు కనిపించే సంకేతాలు
చాలా మందికి కిడ్నీ వ్యాధులు ఉండవచ్చు. వ్యాధి ముదిరే వరకు ఎటువంటి తేడా ఉండదు. అందుకే కిడ్నీ వ్యాధిని తరచుగా 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. చాలా మంది రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తున్నప్పటికీ, ఇందులో కిడ్నీ వ్యాధులు బయట పడకపోవచ్చు. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపినపుడే అసలు విషయం బయటపడుతుంది.
అయితే మూత్రపిండాల వ్యాధి ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసట:
మీరు ఏ పని చేయకుండానే అలసిపోతుంటే, అంతర్లీన ఆరోగ్య సమస్య ఉందని సూచిస్తుంది. ఇది కిడ్నీ వ్యాధికి కూడా ఒక సంకేతం.
ఆకలి లేకపోవడం:
మీకు ఆకలిలేకపోవడం, అసలేమి తినలేకపోతుంటే అది కూడా ఒక సంకేతమే. సాధారణంగా, మూత్రపిండాల వ్యాధి కలిగి ఉన్నవారు ఈ లక్షణాన్ని కనబరుస్తారు.
ఉబ్బిన పాదాలు:
ఇవి కూడా మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లక్షణాలను విస్మరించవద్దు.
ఉబ్బిన కళ్ళు:
ఉబ్బిన కళ్ళు ఉంటే మీకు కిడ్నీ వ్యాధి ఉందని అర్థం.
పొడి, దురద చర్మం:
మూత్రపిండాల పనితీరు పడిపోవడంతో, టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోతాయి. ఇది పొడి చర్మానికి దారితీస్తుంది. చికాకు, దురద కలుగుతుంది. చర్మం నుంచి దుర్వాసన కూడా వస్తుంది.
మూత్రం ఫ్రీక్వెన్సీలో మార్పులు:
మూత్ర విసర్జన తగ్గవచ్చు లేదా మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి రావచ్చు, ముఖ్యంగా రాత్రి సమయంలో ఇలాంటి లక్షణాలు ఉంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం మంచిది.
అధిక రక్తపోటు:
అధిక రక్తపోటు కూడా మూత్రపిండ వ్యాధికి సంకేతం కావచ్చు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఏ వ్యక్తి అయినా, అనుమానం వస్తే కిడ్నీ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్